Share News

KTR: రాష్ట్రంలో ఎనుముల రాజ్యాంగం!

ABN , Publish Date - Jan 07 , 2025 | 05:10 AM

అన్యాయాన్ని నిలదీసినా.. హామీలు అమలు చేయడం లేదని ప్రశ్నించినా.. అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతోందని, రాష్ట్రంలో ఎనుముల రాజ్యాంగం నడుస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

KTR: రాష్ట్రంలో ఎనుముల రాజ్యాంగం!

  • ఏ హోదా ఉందని తిరుపతిరెడ్డికి కాన్వాయ్‌?

  • అక్రమ కేసులకు భయపడను...ప్రశ్నిస్తూనే ఉంటా: కేటీఆర్‌

హైదరాబాద్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): అన్యాయాన్ని నిలదీసినా.. హామీలు అమలు చేయడం లేదని ప్రశ్నించినా.. అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతోందని, రాష్ట్రంలో ఎనుముల రాజ్యాంగం నడుస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ఒక వైపు తనను ప్రశ్నిస్తున్న వారిని ఇబ్బందులకు గురిచేస్తున్న ఎనుముల రేవంత్‌రెడ్డి.. తన కుటుంబం ద్వారా రాజ్యాంగ వ్యతిరేక పనులకు దిగుతున్నారని సోమవారం ‘ఎక్స్‌’ వేదికగా విమర్శించారు. స్థానిక ఎమెల్యేకు బదులుగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి తిరుపతిరెడ్డి ఎవరు? ఏ హోదా ఉందని ఆయనకు రెండు కాన్వాయ్‌లు, గన్‌మెన్‌ను ఏర్పాటు చేశారు? కల్యాణలక్ష్మి చెక్కులను ఏ అధికారంతో పంపిణీ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. వార్డు సభ్యుడిగా కూడా గెలవని వ్యక్తికి సీఎం స్థాయి అధికారాలు కల్పించడం.. ఎనుముల పాలనలోనే సాధ్యమని విమర్శించారు.


కొడంగల్‌లో ప్రొటోకాల్‌తో సంబంధం లేకుండా విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం జరుగుతోందని మండిపడ్డారు. భారత రాజ్యాంగం పట్టుకుని తిరిగే రాహుల్‌గాంధీకి రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదా? అని నిలదీశారు. రైతు భరోసా విషయంలో చేసిన మోసాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో భాగంగానే తనపై అక్రమంగా ఏసీబీ కేసులు పెట్టించారని ధ్వజమెత్తారు. ఎన్ని కుట్రలు చేసినా, అక్రమ కేసులు పెట్టినా భయపడబోనని పేర్కొన్నారు. హామీలు అమలును పట్టించుకోని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టంచేశారు. కాగా, ఏసీబీ విచారణకు కేటీఆర్‌ హాజరవుతున్న నేపథ్యంలో తెలంగాణ భవన్‌కు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. విచారణ అనంతరం తిరిగి తెలంగాణ భవన్‌ చేరుకున్న కేటీఆర్‌ను హరీశ్‌రావు, పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కలిశారు.

Updated Date - Jan 07 , 2025 | 05:10 AM