Share News

TG News: ఇళ్ల తొలగింపునకు రంగం సిద్ధం

ABN , Publish Date - Apr 28 , 2025 | 12:55 PM

Revenue officials: భద్రాద్రి రామాలయ పరిసరాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇళ్లను తొలగించే ప్రక్రియ మే మొదటి వారంలో ఆరంభించి పూర్తి చేసేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేపట్టారు.

TG News: ఇళ్ల తొలగింపునకు  రంగం సిద్ధం
Bhadradri Ramalayam area houses

పరిహారం తీసుకున్న వారు ఖాళీ చేయాలని అధికారుల సూచన

మే నెలలో పూర్తి చేసేందుకు కసరత్తు

భద్రాద్రి రామాలయ అభివృద్ధిపై అధికారుల చర్యలు

హనుమాన్‌ జయంతి వరకు గడువు కోరుతున్న దుకాణదారులు

భద్రాచలం, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ పరిసరాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పరిహారం అందుకున్న ఇళ్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు ఇప్పటికే రెండు రోజుల క్రితం పరిహారం తీసుకున్న ఇళ్ల యజమానులు వెంటనే ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు సంబంధిత ఇంటి యజమానులకు సూచించారు. సోమవారం సైతం మరోసారి ఇళ్లను ఖాళీ చేయాలని చెప్పినట్టు రెవెన్యూ వర్గాలు తెలిపాయి. రామాలయ పరిసరాల్లో మొత్తం 41 ఇళ్లను అభివృద్ధి పనుల కోసం తొలగించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం రూ.35 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయగా.. ఇందులో 33మందికి పరిహారం ఇప్పటికే చెల్లించినట్లు అధికారులు తెలిపారు. కాగా తొలి విడతలో పరిహారం తీసుకోని వారితోపాటు మలి విడతలోని వారిని కలుపుకొని మొత్తం ఎనిమిది మంది ఇంటి యజమానులు ఇంకా పరిహారం తీసుకోలేదని అధికారులు తెలిపారు. ఈ ఇళ్ల యజమానులకు రూ.8కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉన్నట్టు తెలుస్తోంది.


మేలో పూర్తి చేసేందుకు కసరత్తు

భద్రాద్రి రామాలయ పరిసరాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇళ్లను తొలగించే ప్రక్రియ మే మొదటి వారంలో ఆరంభించి పూర్తి చేసేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేపట్టారు. వాస్తవానికి పరిహారం చెల్లించిన సమయంలో శ్రీరామనవమి అనంతరం వారం రోజుల తరువాత ఖాళీ చేయాలని సంబంధిత ఇంటి యజమానులకు స్పష్టం చేశారు. అయితే తొలగించనున్న ఇళ్లల్లో కొంత మంది అద్దెకు ఉండి వ్యాపారాలు చేస్తుండటంతో వారు హనుమజ్జయంతి వరకు ఇళ్లను తొలగించవద్దని అధికారులను కోరుతున్నారు. అయితే ఇప్పటికే ఇళ్లు తొలగించే ప్రక్రియ జాప్యం జరుగుతుండటంతో ఇందుకు సంబంధించిన పనులను మే మొదటి వారంలో ప్రారంబించనున్నట్లు రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా 54 మంది వ్యాపారులు ఇప్పటి వరకు కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకుంటుండటంతో తమకు న్యాయం చేయాలని ఇప్పటికే వారు ఆర్డీవో, కలెక్టర్‌, ఎమ్మెల్యే, మంత్రులను అభ్యర్థించారు. ఈ క్రమంలో కలెక్టర్‌ ఇప్పటికే సంబంధిత 54 మంది దుకాణాలకు సంబంధించిన వాస్తవ పరిస్థితిని ఫొటోల రూపంలో చిత్రీకరించినట్లు వినికిడి. ఈ నేపథ్యంలో మరోసారి వారు ఆర్డీవో, కలెక్టర్‌ను కలిసి తమకు న్యాయం చేయాలని కోరనున్నట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి...

CM Revanth Reddy: ప్రపంచానికి దిక్సూచి తెలంగాణ

Mahesh Babu: విచారణకు రాలేను.. మరో తేదీ ఇవ్వండి

Kaleshwaram: బినామీల గుట్టు విప్పని హరిరామ్‌!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 28 , 2025 | 01:02 PM