Share News

BRS Rajathotsavam: నేడే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ

ABN , Publish Date - Apr 27 , 2025 | 03:22 AM

బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ సభను హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించనుంది. సభలో కేసీఆర్‌ కాంగ్రెస్‌ మరియు బీజేపీలపై విమర్శలు చేస్తారని సమాచారం

BRS Rajathotsavam: నేడే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ

  • హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో సర్వం సిద్ధం

  • అన్ని జిల్లాల నుంచి జన సమీకరణకు ప్రణాళికలు

  • 154 ఎకరాల్లో సభా ప్రాంగణం

  • మాట్లాడేది కేసీఆర్‌ ఒక్కరే.. కాంగ్రెస్‌, బీజేపీలపై విమర్శలు?

హైదరాబాద్‌/వరంగల్‌, ఏప్రిల్‌ 26, (ఆంధ్రజ్యోతి): ఓరుగల్లు వేదికగా రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ సర్వం సిద్ధం చేసింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద ఆదివారం సాయంత్రం 4.30గంటలకు జరిగే భారీ బహిరంగ సభ కోసం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. జన సమీకరణపై దృష్టి పెట్టిన బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం... దానికి తగ్గట్లు ప్రణాళికలు రూపొందించుకుంది. ఉమ్మడి వరంగల్‌తోపాటు సమీపంలోని ఉమ్మడి కరీంనగర్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల నుంచి ప్రధానంగా జనసమీకరణ చేపడుతోంది. ఆయా జిల్లాల్లోని ఒక్కో నియోజకవర్గం నుంచి 30-50వేల మందిని తరలించేందుకు, మిగతా జిల్లాల నుంచి వీలైనంత మందిని తీసుకొచ్చేందుకు వీలుగా ఇప్పటికే పార్టీ నాయకత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. భారీ బహిరంగ సభలో మాట్లాడేది ఒకే ఒక్కరు. అది బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆరే. ఆయన ప్రధాన గురి కూడా మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపైనే ఉంటుందని సమాచారం. రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేదని, రైతు భరోసా ఇంకా ఇవ్వలేదన్న అంశాల నుంచి పలు హామీల అమలుపై అధికార కాంగ్రె్‌సను ఆయన నిలదీయనున్నట్లు తెలిసింది. అదే సమయంలో అటు బీజేపీపైనా రాజకీయ విమర్శలుంటాయని సమాచారం.


fd.jpg

పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకే..

పదేళ్ల పాలన తర్వాత బీఆర్‌ఎ్‌సగా రూపాంతరం చెందిన టీఆర్‌ఎస్‌.. 2023 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఆ ఓటమి నుంచి తేరుకోకముందే.. 2024 మే 13న జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒక్క సీటునూ గెలుచుకోలేకపోయింది. దీంతో బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ తీవ్ర నిరాశకు గురైంది. ఆ తరువాత వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. గత మార్చిలో జరిగిన పలు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండటం గులాబీ శ్రేణులను మరింత నైరాశ్యంలోకి నెట్టింది. మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచీ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పెద్దగా బయటకు వచ్చింది లేదు. ఫామ్‌హౌ్‌సలో తాను పిలిచిన నేతలు, తనను కలిసేందుకు వచ్చిన నేతలతోనే సమావేశాలు నిర్వహించారు. తాజాగా రజతోత్సవ సభతో కేసీఆర్‌ మళ్లీ ప్రజల ముందుకు రానున్నారు. గులాబీ శ్రేణుల్లో జోష్‌ నింపి.. తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ఈ సభ దోహదపడుతుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. మొత్తం 154 ఎకరాల్లో ప్రధాన సభా ప్రాంగణాన్ని ముస్తాబు చేస్తున్నారు.


చరిత్రలో నిలిచిపోయేలా సభ: కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు గులాబీ సైనికులతోపాటు తెలంగాణ ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ సభకు హాజరయ్యే వాళ్లందరూ గులాబీ రంగు దుస్తులు ధరించేలా చూసుకోవాలన్నారు.


ఇవి కూడా చదవండి

Butta Renuka: ఆస్తుల వేలం.. వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్

Human Rights Demad: కాల్పులు నిలిపివేయండి.. బలగాలను వెనక్కి రప్పించండి.. పౌరహక్కుల నేతలు డిమాండ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 27 , 2025 | 03:24 AM