BRS MLC Kavitha: పేరుకే ముగ్గురు మంత్రులు అభివృద్ధి శూన్యం
ABN , Publish Date - Apr 21 , 2025 | 04:17 AM
ఖమ్మంలో మూడు మంత్రులు ఉన్నా, వారు అభివృద్ధి విషయంలో మౌనంగా ఉన్నారని కవిత ఆరోపించారు. అకాల వర్షాలతో రైతుల పంట నష్టంపై పరిహారం ప్రకటించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

ఖమ్మంలో మంత్రుల మధ్య ఆధిపత్య పోరు: కవిత
ఖమ్మం, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఖమ్మం జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రితో పాటు ఇద్దరు మంత్రులున్నా వారి మధ్య ఆధిపత్య పోరు తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడంలేదని, అకాల వర్షాలతో జరిగిన పంట నష్టంపై కనీసం సమీక్షించలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఖమ్మంలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ అకాల వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే సీఎం కనీసం రెవెన్యూ అధికారులతో మాట్లాడలేదన్నారు. పంట నష్టపోయిన రైతులందరికీ ఎకరానికి రూ.20 వేలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సోనియా, రాహుల్‌పై ఈడీ కేసులు నమోదు చేస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టిందని, కానీ.. సీఎం రేవంత్‌రెడ్డికి మాత్రం కనీసం ట్విట్టర్‌లో పోస్టు పెట్టేందుకూ తీరిక లేకుండా పోయిందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో భక్తరామదాసు ప్రాజెక్టు పూర్తిచేసి వేల ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త ప్రాజెక్టు చేపట్టలేదన్నారు. వరంగల్‌లో జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు ఖమ్మం నుంచి ప్రజలు భారీగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.