Kavitha: నాపై అనుచిత వ్యాఖ్యల వెనక పెద్ద నాయకుడు!
ABN , Publish Date - Aug 04 , 2025 | 03:45 AM
బీఆర్‌ఎస్‌లోని పెద్ద నాయకుల తీరుపై కొన్ని నెలలుగా అసంతృప్తి వ్యక్తంచేస్తూ వస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంటి ఆడబిడ్డనని చూడకుండా.. నా మీద నీచంగా వ్యాఖ్యలు చేయిస్తున్నారు
తాత్కాలికంగా శునకానందం పొందొచ్చు
అన్నీ వారికే తిరిగికొట్టే సమయం వస్తుంది
ఇంకో లిల్లీపుట్ నాయకుడు నా గురించి ‘ఆమె ఎవరు’ అంటూ మాట్లాడుతున్నారు
నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎ్‌సను నాశనం చేసిన ఆయన్ను ప్రోత్సహిస్తున్నదెవరో ఆలోచించాలి
మరోసారి ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు!
నేరుగా పేర్లు ప్రస్తావించకుండా కేటీఆర్, జగదీశ్‌రెడ్డిలపై తీవ్ర విమర్శలు?
మీడియా సమావేశంలో ఆవేదన
నేటి నుంచి 72గంటల నిరాహారదీక్ష చేస్తా: కవిత
హైదరాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌లోని పెద్ద నాయకుల తీరుపై కొన్ని నెలలుగా అసంతృప్తి వ్యక్తంచేస్తూ వస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరుగా పేర్లు ప్రస్తావించకుండా.. పరోక్షంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిలను ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఓ పెద్ద నాయకుడు ఇంటి ఆడబిడ్డనని కూడా చూడకుండా తనపై నీచంగా, అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆరోపించారు. పెద్ద నాయకుడి అండతో సొంత పార్టీ నేతలే తనను ఇబ్బంది పెడుతున్నారని.. ఇవన్నీ ఆషామాషీగా చెప్పడం లేదని, ఆవేదనతో చెబుతున్నానని పేర్కొన్నారు. ఆ పెద్ద నాయకుడు తనపై చేస్తున్న కుట్రలు తిరిగి ఆయనకే తగులుతాయని వ్యాఖ్యానించారు. తన దగ్గర ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు మనుషులను పెట్టారన్నారు. నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీని నాశనం చేసిన ఓ లిల్లీపుట్ నాయకుడు తన గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇటీవల జగదీశ్‌రెడ్డి ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కవితను ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందిస్తూ కవిత ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. మీడియా సమావేశంలో కవిత చేసిన వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే.. ‘‘ఇగ ఏం జెప్పాలన్నా.. నా బాధ.. కొందరు నాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. ఒక ఆడబిడ్డగా భావించి యావత్ తెలంగాణ బాధపడింది.
అనేకమంది ఎక్కడికక్కడ స్పందించారు. ఏమైందో ఏమోగానీ.. బీఆర్‌ఎస్ పార్టీలోని అన్నదమ్ములు మాత్రం స్పందించలేదు. దీని వెనుక బీఆర్‌ఎ్‌సకు చెందిన పెద్ద నాయకుడు ఒకరి హస్తం ఉంది. అందుకే పార్టీ నాయకులెవరూ స్పందించలేదని బలంగా నమ్ముతున్నాను. ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు నా దగ్గర ఒక పది మందిని పెట్టి.. నా చుట్టూ జరిగే అంశాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కానీ, బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏమంటే.. అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది. మీరు ఏ సమయంలో ఎవరిని కలిశారు. నామీద వ్యాఖ్యలు చేయడానికి ఎవరిని ప్రోత్సహించారు? మీరు ఎంత కిందకు దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారు.. అన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను. ఇవాళ మీరు తాత్కాలికంగా శునకానందం పొందొచ్చు. కానీ దేవుడున్నాడు. కచ్చితంగా అది మీకు తిరిగికొట్టే సమయం వస్తుంది. ఇగ రెండోది.. ఒక లిల్లీపుట్ నాయకుడు. నల్గొండలో బీఆర్‌ఎస్‌ను నాశనం చేసిన ఆ లిల్లీపుట్ నాయకుడు.. ఆమెవరు, ఈమెవరు..? అని నా గురించి మాట్లాడుతున్నారంటే.. ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నదెవరో ప్రజలు ఆలోచించాలి. ఎన్నడూ ప్రజాఉద్యమాలు చేయలేదాయన.. కేసీఆరే లేకపోతే.. ఆయనెవరు? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడగానే.. ఇంకో చిన్నపిల్లగాడు, నిన్నమొన్ననే మా పార్టీలోకి వచ్చినవాళ్లు కూడా ఎలాపడితే అలా మాట్లాడుతున్నారు. చిన్న పిలగాడివి..చిన్నపిలగాడిలా ఉండుబాబూ.. (కవితపై వ్యాఖ్యలు చేసిన కార్తీక్‌రెడ్డిని ఉద్దేశిస్తూ..). పెద్దవాళ్ల విషయాల్లో తలదూర్చకు. నీ వెనకాల చాలా మంది ఉన్నారని అనుకుంటున్నావేమో? వాళ్ల సంగతికూడా ప్రజల్లోకి వస్తది. సీఎం రమేశ్ ఎందుకు వ్యాఖ్యలుచేశారో నాకు తెలియదు. ఆయన వ్యాఖ్యల వెనుక నేను కేసీఆర్‌కు రాసిన లేఖ లీక్ అవడానికి సంబంధం ఉందనుకుంటున్నాను. నాకు ఎవరి సపోర్ ్టలేదు. మ్యాచ్ ఫిక్సింగ్ నాకు రాదు.. ఆ అలవాటు వాళ్లకేఉంది. ఆవేదనతో చెబుతున్నా.. రాజకీయం చేయొచ్చుగానీ.. నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డమీద ఇటువంటి మాటలు మీరే అనిపించడం ఏమిటి?’’ అని కవిత నిలదీశారు.
నిరాహార దీక్షకు ప్రభుత్వం అనుమతించాలి
బీసీ రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సోమవారం నుంచి 72 గంటలపాటు నిరాహారదీక్ష కొనసాగిస్తానని కవిత తెలిపారు. కొంత సమయమే దీక్ష చేపట్టాలని ప్రభుత్వం సూచించిందని చెప్పారు. కానీ బీసీల్లోని 112 కులాలకు సంబంధించిన సమస్యలు చెప్పుకోవాలంటే.. రోజుకు 40 కులాల ప్రతినిధులు మాట్లాడాల్సి ఉంటుందని, ఇందుకు మూడు రోజుల సమయం పడుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఆంక్షల్లేకుండా అనుమతించాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరం కమిషన్ నివేదికపై కీలక భేటీ.. ఎందుకంటే..
ధర్మస్థలలో మరో షాకింగ్ ఘటన.. దేశవ్యాప్తంగా ఆందోళన
Read latest Telangana News And Telugu News