KTR Vs Revanth Reddy: మన ఖర్మ కాలి రేవంత్ రెడ్డి..
ABN , Publish Date - Jul 27 , 2025 | 04:34 PM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. మన ఖర్మ కాలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యాడన్నారు. అటు ఇటు కానోడు పరిపాలిస్తే.. ఇలాగే ఉంటుందని చెప్పారు.

భూపాలపల్లి, జులై 27: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏపీలోని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అలాంటి వేళ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఏ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదని ఆయన కుండ బద్దలు కొట్టారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయితేనే మన కష్టాలు పోతాయని తెలంగాణ ప్రజలకు ఆయన తెలిపారు.
ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లిలో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎరువుల కోసం యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు. నల్లబెల్లిలో మహిళా రైతుపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇదేనా ప్రభుత్వం నడిపే పద్ధతి..? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.
పాలిచ్చే బర్రెను పక్కన బెట్టి తన్నే దున్నపోతును తెచ్చుకున్నారంటూ వ్యాఖ్యానించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏమైంది..? అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. కరోనా సంక్షోభంలోనూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగ లేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అన్నీ ఉన్నా.. పథకాలు మాత్రం అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అటు ఇటు కానోడు పరిపాలిస్తే ఇలాగే ఉంటుందంటూ రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి ఇజ్జత్ లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే చూస్తున్నానని ఆయన వ్యంగ్యంగా అన్నారు. మన ఖర్మ కాలి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడన్నారు. ప్రభుత్వం ఎటుంటే పోలీసులు అటుంటరని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించాలంటూ పార్టీ కేడర్‌కు ఆయన స్పష్టం చేశారు. తద్వారా అధికార కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆయన సూచించారు.
మరోవైపు సెప్టెంబర్ 30వ తేదీ లోపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. ఇంకోవైపు ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని అటు అధికార పార్టీ కాంగ్రెస్.. ఇటు ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ ఎవరికి వారు.. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకొని.. దూసుకు వెళ్తున్నాయి. ఆ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు.