Jubilee Hills by-election: ఎవరి ముచ్చట వారిదే.. జూబ్లీహిల్స్‌లో అంతుచిక్కని ఓటరు నాడి
ABN , Publish Date - Oct 31 , 2025 | 08:06 AM
రాష్ట్రంలో ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటరు నాడి అంతుచిక్కడం లేదు. నామినేషన్ల పర్వం ముగిసి వారం రోజులు గడిచినా.. ప్రధాన పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నా.. ఓటర్ల మనసులో ఏముందన్న విషయంపై స్పష్టత రాని పరిస్థితి.
- ప్రధాన అభ్యర్థులందరికీ జై కొడుతున్న జనం
- అయోమయానికి గురవుతున్న పార్టీ ముఖ్యనేతలు
హైదరాబాద్ సిటీ: రాష్ట్రంలో ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills by-election)లో ఓటరు నాడి అంతుచిక్కడం లేదు. నామినేషన్ల పర్వం ముగిసి వారం రోజులు గడిచినా.. ప్రధాన పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నా.. ఓటర్ల మనసులో ఏముందన్న విషయంపై స్పష్టత రాని పరిస్థితి. ప్రచారానికి ఏ పార్టీ అభ్యర్థి వెళ్లినా మా మద్దతు మీకేనంటూ హామీ ఇస్తున్నారు. భరోసా ఇచ్చిన వారు పోలింగ్ రోజున అదే మాటపై ఉంటారో.. మాట తప్పుతారో తెలియక పరేషాన్ అవుతున్నారు.

దీంతో నియోజకవర్గంలోని కాలనీలు, బస్తీలు, గల్లీలు, సామాజిక వర్గాల వారీగా తమకు ఎన్ని ఓట్లు నమ్మకంగా పడుతాయనే అంచనాకు రాలేక అభ్యర్థులు, పార్టీ ముఖ్యనాయకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీల నాయకులు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు క్షేత్రస్థాయిలో ముమ్మరంగా తిరుగుతున్నారు. అధికార పార్టీకి చెందిన మంత్రులు,
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతోపాటు ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులకు డివిజన్లు, కాలనీలు, బస్తీల వారీగా బాధ్యతలు అప్పగించి తిప్పుతున్నారు. 1000-1200 ఓట్లకు ఓ ముఖ్యనాయకుడికి పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఆయన కింద దాదాపు 50 మంది పనిచేసే విధంగా ఏర్పాటు చేశారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రచారం నిర్వహిస్తున్నారు.

మాటంటే మాటే!
ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న అభ్యర్థులకు ఓటర్లు మా ఓట్లు మీకేనని, చుట్టుపక్కల వారితో మరో 50 ఓట్లు తప్పకుండా వేయిస్తామని చెబుతున్నారు. మనది మాటంటే.. మాటేనని, ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లేనని, ఇందులో ఏ మాత్రం అనుమానం పడొద్దని, మీ గెలుపు పక్కా.. అని భరోసా ఇస్తున్నారు. దీంతో ప్రచారానికి వెళ్లిన నాయకులు తమ పార్టీ విజయం గ్యారంటీ అని నమ్ముతున్న పరిస్థితి నెలకొంటుంది. ఇలా ఏ పార్టీ అభ్యర్థి వెళ్లినా, అభ్యర్థి తరపు నాయకులు ప్రచారం చేసినా.. అదే ముచ్చట చెబుతుండడం ఆసక్తికరంగా మారింది.
ఎవరు గెలిస్తే వారే మావోళ్లు
ప్రచారానికి ఎవరు వెళ్లినా వారికే ప్రజలు మద్దతు తెలుపుతుండడంతో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. మాట ఇచ్చిన వారిలో ఎంతమంది నమ్మకంగా ఓట్లు వేస్తారోననే అభ్యర్థులు, పార్టీ ముఖ్యనాయకులు, వారి అనుచరులు సందిగ్దంలో పడుతున్నారు. ఇదిలా ఉండగా, అందరికీ మద్దతు ఇస్తూ మా ఓట్లన్నీ తప్పకుండా మీకే వేస్తామని మాట ఇస్తున్న వారిలో కొంతమంది పక్కా ప్రణాళికతో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల్లో తాము ఓటు ఎవరికి వేశామో ఎవరికీ తెలియదని.. ఎవరు గెలిస్తే వారికే మా ఓట్లు వేశామని చెబితే సరిపోతుందనే భావనతో ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుఫానును ఆపలేం... నష్టం తగ్గించాం
Read Latest Telangana News and National News