Share News

Golconda Fort: రేపటి నుంచి గోల్కొండ కోటలో ‘నో యువర్‌ ఆర్మీ’ మేళా

ABN , Publish Date - Jan 02 , 2025 | 04:04 AM

భారత సైన్యం 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హైదారాబాద్‌లోని గోల్కొండ కోటలో ‘నో యువర్‌ ఆర్మీ’ మేళా నిర్వహిస్తుంది.

Golconda Fort: రేపటి నుంచి గోల్కొండ కోటలో ‘నో యువర్‌ ఆర్మీ’ మేళా

అల్వాల్‌, జనవరి 1(ఆంధ్రజ్యోతి): భారత సైన్యం 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హైదారాబాద్‌లోని గోల్కొండ కోటలో ‘నో యువర్‌ ఆర్మీ’ మేళా నిర్వహిస్తుంది. తెలంగాణ, ఆంధ్రా సబ్‌ ఏరియా ప్రధాన కార్యాలయం(టాసా) ఆధ్వర్యంలో ఆర్టిలరీ సెంటర్‌ సమన్వయంతో చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా ఆర్మీడే పరేడ్‌ 2025కు భారత సైన్యం నాందికి పలుకుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పౌరులందరికీ అవకాశం కల్పిస్తుంది. సాయుధ దళాల్లో చేరడానికి యువతను ప్రేరేపించడమే ఈ మేళా లక్ష్యం. ఇందులో ఆర్టిలరీ గన్‌లు, చిన్న ఆయుధాలు, అధునాతన ఆపరేషనల్‌ టూల్స్‌, కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌, ఇంజనీరింగ్‌ సాధనాలు, న్యూక్లియర్‌ బయోలాజికల్‌ కెమికల్‌, వార్‌ఫేర్‌ సూట్‌లతో కూడిన చిన్న పరికరాల(మైనర్‌ ఎక్వి్‌పమెంట్‌) స్టాల్‌ల పదర్శన ఏర్పాటు చేస్తారు.


సైనిక దళాల ప్రత్యేక పదర్శనలు, గ్యాలంటరీ(శౌర్య) పతకాల ప్రదర్శనలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మిలటరీ పరికరాలతో ఫొటోలు దిగేందుకు, సాయుధ దళాలలో కెరీర్‌ అవకాశాల గురించి తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ విషయాలను వివరించడానికి ప్రతీ స్ట్టాల్‌ వద్ద ఆర్మీ సిబ్బంది ఉంటారని రక్షణశాఖ పౌరసంబంధాల అధికారి శివ హరినాయక్‌ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

Updated Date - Jan 02 , 2025 | 04:04 AM