Share News

Hyderabad: మేం మారేదే లే!

ABN , Publish Date - Jun 16 , 2025 | 04:20 AM

మా శాఖలో మేమే సర్వం.. మేం చెప్పినట్లే జరగాలి’ అన్నట్లుగా రాష్ట్రంలో పనిచేస్తున్న కొందరు ఐఏఎ్‌సల తీరు ఉంటోంది. వారు తీసుకునే నిర్ణయాలతోపాటు వ్యవహరిస్తున్న తీరు కూడా చర్చనీయాంశంగా మారుతోంది.

Hyderabad: మేం మారేదే లే!

  • ఇష్టారాజ్యంగా కొందరు ఐఏఎ్‌సల తీరు!.. సీఎం సూచించినా.. మారని ధోరణి

  • ప్రభుత్వాన్నీ ఇరుకునపెడుతున్న వైనం.. పాలసీల రూపకల్పనలో ముందుచూపు కరువు

  • అధికారులు, ఉద్యోగుల పట్ల కూడా దురుసు ప్రవర్తన

  • జిల్లా కలెక్టర్‌ నుంచి రాష్ట్ర స్థాయి పోస్టుల్లోకి వచ్చిన ఐఏఎ్‌సల తీరు మరింత ఇబ్బందికరం!

హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): ‘మా శాఖలో మేమే సర్వం.. మేం చెప్పినట్లే జరగాలి’ అన్నట్లుగా రాష్ట్రంలో పనిచేస్తున్న కొందరు ఐఏఎ్‌సల తీరు ఉంటోంది. వారు తీసుకునే నిర్ణయాలతోపాటు వ్యవహరిస్తున్న తీరు కూడా చర్చనీయాంశంగా మారుతోంది. కొంతమేర ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలోకి నెడుతోంది. కొందరు సీనియర్‌ ఐఏఎ్‌సలు తమ సహచర అధికారుల పట్ల ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, కొందరైతే ఏకంగా నోటికీ పనిచెబుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కిందిస్థాయి ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, దురుసు వ్యాఖ్యలు చేస్తున్నారని సచివాలయంలో చెప్పుకొంటున్నారు. మరికొందరు ఐఏఎ్‌సలు.. పలు అంశాలపై ముఖ్యమంత్రి చేసిన సూచనల్ని కూడా పట్టించుకోవడంలేదని అంటున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్‌ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పోస్టుల్లోకి వచ్చిన పలువురు అధికారుల తీరు మరింత ఇబ్బందికరంగా ఉంటోందని ఆయా శాఖల్లో పనిచేసే ఉద్యోగులు చెబుతున్నారు. రాష్ట్ర స్థాయిలో పనిచేసే అధికారులు చాలా హుందాగా వ్యవహరించాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. సచివాలయం కేంద్రంగా జరిగే ప్రతీ పని జనంతో కూడుకుని ఉంటుందని, ఇక్కడ రూపొందే పాలసీలు ప్రభుత్వాలపై ప్రభావం చూపుతాయని, ప్రజలకు ఎంత ప్రయోజనం చేకూరితే ప్రభుత్వాలకు అంత మంచి జరుగుతుందని పేర్కొంటున్నారు. కానీ, పాలసీల రూపకల్పన నుంచి ఉద్యోగులతో వ్యవహరించే విధానం వరకు ఏ విషయంలోనూ కొందరు ఐఏఎ్‌సల వ్యవహారం సరిగా ఉండడంలేదనే భావన ఇటీవల వ్యక్తమవుతోంది. పలు సమీక్షల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా అధికారులకు సూచనలు చేయడంతోపాటు అలసత్వం ప్రదర్శించిన వారిని హెచ్చరించారు. అయినా వారి తీరు మారడంలేదని సచివాలయ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.


కొందరు ఐఏఎ్‌సలు తమ శాఖల పరిధిలో తీసుకునే నిర్ణయాల విషయంలో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉదాహరణకు.. ఓ శాఖ పరిధిలో ఉన్న భూములను లీజుకు ఇవ్వకూడదని ఉమ్మడి ఏపీలోనే నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఆ ఉత్తర్వులు వచ్చేనాటికే ఏవైనా భూములను లీజుకు ఇస్తే.. వాటి గడువు పూర్తయ్యాక శాఖ పరిధిలోకి తీసుకోవాలనే నిబంధన ఉంది. కానీ, సదరు శాఖ ఉన్నతాధికారి మాత్రం బర్కత్‌పురలో ఉన్న సంస్థ భూమి గడువు సమయం పూర్తికాకముందే.. మళ్లీ లీజు గడువు పొడిగించేందుకు నిర్ణయం తీసుకోవడంతోపాటు, ఆ ఫైలును క్యాబినెట్‌ ముందు ఉంచారు. ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో మంత్రి కూడా అలా ఎలా నిర్ణయాలు తీసుకుంటారంటూ సదరు అధికారిని మందలించినట్లు తెలిసింది. తన శాఖలో పనిచేసే ఇతర ఉద్యోగులు, అధికారుల పట్ల కూడా ఆ ఉన్నతాధికారి దురుసుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఓ అంశంపై చర్చించేందుకు సచివాలయంలో ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఓ మహిళా ఉద్యోగి పట్ల ‘బుద్ధి ఉందా’ అంటూ దురుసుగా మాట్లాడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళా ఉద్యోగి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి బయటకు వె ళ్లినట్లు, ఆయనపై మంత్రికి, ముఖ్య అధికారులకు ఫిర్యాదు చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలిసింది. కాగా, సదరు అధికారి ఆ శాఖ బాధ్యతలు తీసుకున్న మొదట్లోనూ ఒకరిద్దరిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు, దీనిపై ఉద్యోగులు మంత్రికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఆ అధికారిని మంత్రి పిలిపించుకొని తీరు మార్చుకోవాలని సూచించినట్లు తెలిసింది.


ఐఏఎస్‌ వర్సెస్‌ ఐపీఎస్‌..

ఒక కీలకశాఖలో ముఖ్య ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్‌ ఉండగా.. అదే శాఖకు అనుబంధంగా ఉన్న ఒక సంస్థకు ఐపీఎస్‌ అధికారి బాధ్యతల్లో ఉన్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ఉన్న శాఖ వాస్తవానికి చాలా మంచి ఫలితాలను ఇవ్వాలి. కానీ, ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ముఖ్యమైన అంతర్జాతీయ కార్యక్రమ నిర్వహణ విషయంలో ఇద్దరి మధ్య పొంతన కుదరలేదని, ఒకానొక సమయంలో ఇద్దరి మధ్య ఢీ అంటే ఢీ అనే స్థాయిలో వ్యవహారం నడిచిందనే ఆరోపణలున్నాయి. అంతర్జాతీయ కార్యక్రమ నిర్వహణకుగాను ముఖ్యమంత్రి పలు సూచనలు చేయగా.. వాటి ప్రకారమే ఐపీఎస్‌ అధికారి ప్రజెంటేషన్‌ రూపొందించి సీఎంకు వివరించారు. అయితే ఆ సమావేశం ముగిశాక, ‘‘ఈ విషయాన్ని సీఎం దగ్గర ఎందుకు చెప్పావు? ముందుగా నాకెందుకు చెప్పలేదు?’’ అంటూ ఐఏఎస్‌ అధికారి ప్రశ్నించడంతోపాటు నోటికి కూడా పనిచెప్పినట్టు తెలిసింది. ఇద్దరూ సీనియర్లు కావడంతో మిగతా అధికారులు ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోవాల్సి వచ్చిందని సమాచారం. సదరు ఐపీఎస్‌ అధికారిని ప్రభుత్వం ఇటీవల బదిలీ చేయడంతో ఆ శాఖలో ఐఏఎస్‌, ఐపీఎ్‌సల మధ్య వైరం ముగిసిందని ఉద్యోగులు చెప్పుకొంటున్నారు.


ఆయనకు తిట్టడమే పని..!

రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం ఓ కీలకశాఖకు ముఖ్య కార్యదర్శి హోదాలో ఉన్న ఓ ఐఏఎస్‌ అధికారి.. గతంలో పనిచేసిన మరో విభాగంలో అత్యంత విచక్షణా రహితంగా వ్యవహరించేవారనే ఆరోపణలున్నాయి. ఆయన వ్యవహరిస్తున్న తీరుపై జిల్లా అధికారులు, డిప్యూటీ అ ధికారులు, ఉద్యోగులు తట్టుకోలేక ఏకంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. కొన్ని సమయాల్లో ఆయన నోటి నుంచి బూతు పురాణం తప్ప మరొకటి రాదనే ఆరోపణలూ ఉన్నాయి. ఇక పని విషయంలో కిందిస్థాయి ఉద్యోగులను తీవ్రంగా వేధించేవారని, టెలీ కాన్ఫరెన్స్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లు, సమావేశాల్లోనూ ఇష్టారీతిన వ్యవహరిస్తారనే అభియోగాలున్నాయి. ఆయన తీరుతో ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తోందని అధికారులు, ఉద్యోగులు చెబుతున్నారు. శాఖలో కొన్ని నిర్ణయాలూ ఇష్టారీతిన ఉంటున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక ఎంతో మందితో కూడుకుని ఉన్న ఓ కీలక శాఖకు ముఖ్య అధికారిణిగా పనిచేసే మరో ఐఏఎస్‌ వ్యవహారం.. ఆ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రోజూ ఏదో ఒక అంశంపై కాన్ఫరెన్స్‌లతో తీవ్ర ఇబ్బందికి గురిచేస్తున్నారని ఇతర అధికారులు, ఉద్యోగులు వాపోతున్నారు. ఆ శాఖకు మరోచోట కూడా కార్యాలయం ఉండడంతో.. అక్కడి నుంచి సచివాలయానికి రావడం, మళ్లీ అక్కడికి వెళ్లడానికే తమకు సరిపోతుందని అంటున్నారు. సమావేశాలు, సర్య్కులర్‌లంటూ హడావిడి చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఆశించిన ఫలితం పెద్దగా కనిపించడంలేదని చెబుతున్నారు.


ఎవరిష్టం వారిదే..

పలు శాఖలకు ముఖ్య, ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న అఽధికారుల తీరు మరింత చర్చనీయాంశమవుతోంది. వారి తీరు పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమీక్షల సమయంలో ఆయన బహిరంగంగా అసహనం వ్యక్తం చేస్తుండడమే ఇందుకు నిదర్శనం. అయినా అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని అంటున్నారు. మరోవైపు జిల్లాల్లోని కలెక్టర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. పలుమార్లు నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో.. క్షేత్రస్థాయికి వెళ్లాలని, ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లాలని, ప్రజలతో మమేకం కావాలని సీఎం సూచించినా.. పెద్దగా పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. మరోవైపు ఇటు రాష్ట్రస్థాయిలో పనిచేసే అధికారులు వారి శాఖల్లో తీసుకునే నిర్ణయాలు కూడా ఇష్టారీతిన ఉంటున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌ నగరంలో ఓ అథారిటీ పరిధిలో పనిచేసే అధికారి.. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఓ ముఖ్య అధికారితోపాటు మరికొంతమందికి మేలు చేసేలా కోట్ల రూపాయలు వెచ్చించి వారు నివాసం ఉంటున్న ప్రాంతంలో సీసీ రోడ్లు వేయించడం చర్చనీయాంశమైంది. ఈ విషయం సీఎంవోకు కూడా చేరినట్లు తెలిసింది. వెరసి ఉన్నత, ముఖ్య అధికారుల తీరు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

నీట్ యూజీ టాపర్లకు అభినందనలు తెలిపిన సీఎం

మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం..

For Telangana News And Telugu News

Updated Date - Jun 16 , 2025 | 04:20 AM