Share News

RTC Women Bus Owners: మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు: డిప్యూటీ సీఎం భట్టి

ABN , Publish Date - Jul 05 , 2025 | 03:08 PM

RTC Women Bus Owners: కోటి మంది మహిళలను కోటీశ్వరీమణులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను గ్రౌండ్ లెవెల్లో తెలిసేలా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.

RTC Women Bus Owners: మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు: డిప్యూటీ సీఎం భట్టి
RTC Women Bus Owners

హైదరాబాద్, జులై 5: ఆర్టీసీలో 151 మండల మహిళా సంఘాల గ్రూప్‌లకు (అద్దె బస్సుల యజమానులకు) రూ.1.05 కోట్ల రూపాయల చెక్కును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క అందజేశారు. అనంతరం మహిళా రచయితలు, కవులు రాసిన మహాలక్ష్మి (మహిళా సాధికారత లో ప్రగతి చక్రాలు) పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మహిళా సమాఖ్యలను పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని.. ఇప్పటికే మహిళల అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. త్వరలో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని వెల్లడించారు.


అవకాశాలు ఉన్న ప్రతీ దగ్గర వ్యాపారం కోసం మహిళా సమాఖ్యలకు ఇస్తామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరీమణులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను గ్రౌండ్ లెవెల్లో తెలిసేలా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈనెల 10 నుంచి 16 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీలేని రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రజలదన్నారు. కుటుంబ పెద్దలు ఆర్థికంగా ఎదిగేలా చేస్తే.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళా అభివృద్ధిలో తెలంగాణను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.


నష్టాల నుంచి లాభాల్లోకి ఆర్టీసీ: మంత్రి పొన్నం

ponnam-farmers.jpg

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ మరోసారి బతికిందన్నారు. త్వరలోనే దాదాపు 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసిన రికార్డు నమోదు కాబోతుందని తెలిపారు. 6500 కోట్ల రూపాయల విలువైన ఉచిత ప్రయాణం నమోదు కాబోతుందని.. ఈ డబ్బులను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా గ్రామ గ్రామాన సంబరాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ మహాలక్ష్మి పథకం విజయవంతం కావడం కోసం డ్రైవర్లు, కండక్టర్‌లు చాలా కష్టపడుతున్నారని వారికి అభినందనలు తెలియజేశారు. ఆర్టీసీలో కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని.. కొత్త నియామకాలు చేస్తున్నామని చెప్పారు. మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టీసీ ఉచిత బస్సును వాడుకుంటున్నారన్నారు. ఆర్టీసీ నష్టాల నుంచి లాభాల్లోకి వెళ్తోందని మంత్రి ప్రభాకర్ వెల్లడించారు.


మహిళల ఎదుగుదలే సమాజ ఎదుగుదల: మంత్రి సీతక్క

seethakka-minister.jpg
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 24 గంటల్లోపే మహిళలకు ఉచిత బస్సు పథకం తెచ్చిందని మంత్రి సీతక్క అన్నారు. ఉచిత ప్రయాణమే కాదు మహిళలను బస్సులకు ఓనర్లను చేసిందన్నారు. మహిళల ఎదుగుదలనే సమాజ ఎదుగుదల అని చెప్పుకొచ్చారు. ఆ స్పూర్తితోనే తమ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. గతంలో పావలా వడ్డీ రుణాలు ఇవ్వలేదని.. వడ్డీలేని రుణాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన మహిళల అనుభవాలను తెలిపే పుస్తకం ఆవిష్కరించడం సంతోషకరమన్నారు. మండల సమాఖ్యలో ఉన్న మహిళల కోరికలు నెరవేరుతున్నాయన్నారు. మహిళా సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారని మంత్రి చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి 25 వేల కోట్ల రుణాలను మహిళా సంఘాలు పొందాయని పేర్కొన్నారు. తీసుకున్న రుణాలను ఎప్పటికప్పుడు చెల్లిస్తుండడంతో బ్యాంకులు ఇబ్బందులు లేకుండా రుణాలు ఇస్తున్నాయన్నారు. మహిళలందరూ ఎల్లుండి నుంచి సంబరాలు చేయాలని.. ప్రభుత్వ ప్రోత్సహకాలన్నీ సంఘాలు ఉపయోగించుకోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి

గంజాయి స్మగ్లింగ్‌లో సరికొత్త పంథా.. చూస్తే షాక్‌ అవ్వాల్సిందే

పుట్టిన రోజు వేడుకలకు దూరంగా జగ్గారెడ్డి.. ఎందుకంటే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 05 , 2025 | 04:30 PM