Share News

High Court: గ్రూప్-1 పిటిషనర్లపై హైకోర్ట్ సీరియస్.. ఇదేం పద్ధతంటూ ఆగ్రహం..

ABN , Publish Date - Apr 28 , 2025 | 09:55 PM

గ్రూప్‌-1 రీవాల్యుయేషన్ మార్కులను పారదర్శకంగా వెల్లడించాలని కోరిన పిటిషనర్లకు తెలంగాణ హైకోర్టు జరిమానా విధించింది. తప్పుడు పత్రాలతో కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

High Court: గ్రూప్-1 పిటిషనర్లపై హైకోర్ట్ సీరియస్.. ఇదేం పద్ధతంటూ ఆగ్రహం..
Telangana High Court

హైదరాబాద్: గ్రూప్‌-1 రీవాల్యుయేషన్ మార్కులను పారదర్శకంగా వెల్లడించాలని కోరిన పిటిషనర్లకు తెలంగాణ హైకోర్టు జరిమానా విధించింది. తప్పుడు పత్రాలతో కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు రూ.20 వేల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-1 పరీక్షల వ్యవహారాన్ని తొలి నుంచీ వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ అంశం హైకోర్టు, సుప్రీంకోర్టులకు సైతం చేరింది.


చివరికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయని అనుకున్న తరణంలో రివాల్యుయేషన్ మార్కుల గురించి 19 మంది అభ్యర్థులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం ఇవాళ (సోమవారం) విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ జారీ చేసిన మార్కుల మెమోకు, వెబ్‌సైట్‌లో ఉన్న మార్కులకు తేడాలున్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రీవాల్యుయేషన్‌ చేపట్టి మార్కులను టీజీపీఎస్సీ పారదర్శకంగా వెల్లడించాలని కోరారు. దీనికి సంబంధించిన పత్రాలను కోర్టు ముందు ఉంచారు.


అయితే పిటిషనర్లు తప్పుడు ధ్రువపత్రాలు చూపించారంటూ టీజీపీఎస్సీ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అందుకు సంబంధించిన ఆధారాలను సైతం కోర్టులో ప్రవేశపెట్టారు. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం ప్రాథమిక వివరాలను పరిశీలించి అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని నిర్ధారించారు. ఈ మేరకు వాస్తవాలను దాచి కోర్టును తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. పిటిషనర్లపై చట్టప్రకారం తగు చర్యలు తీసుకోవాలని జ్యూడిషియల్ రిజిస్ట్రార్‌ను జస్టిస్ నగేశ్ ఆదేశించారు. అలాగే వారికి రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి:

KCR: జిమ్‌లో వర్కవుట్లు చేస్తుండగా కేటీఆర్‌కు గాయం..

TGPSC: గ్రూప్‌-1 నియామకాలపై హైకోర్టులో టీజీపీఎస్సీ అప్పీలు

Updated Date - Apr 28 , 2025 | 09:59 PM