CM Revanth Met PM Modi: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఏం చర్చించారంటే..
ABN , Publish Date - Feb 26 , 2025 | 11:00 AM
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఎస్ఎల్‌బీసీ ప్రమాదం సహా అనేక అంశాలపై చర్చించారు.

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ ఇవాళ (బుధవారం) ఉదయం ప్రధాని అధికారిక నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై ప్రధానితో రేవంత్ చర్చించారు. తెలంగాణలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పెండింగ్ నిధులూ విడుదల చేయాలని కోరారు.
ఫేస్-2 మెట్రో లైన్, ఎయిర్‌పోర్ట్ పొడగింపు.. దానికి కావాల్సిన ఆర్థిక సహాయం.. అనుమతులు, మూసీ నది సుందరీకరణ నిధులు, కేంద్రం నుంచి వెనకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు, తెలంగాణకు ఐటీఐఆర్, ఐఐఎం, రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు, ఆర్థిక సహాయం వంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను ప్రధాని దృష్టికి తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. వాటిని త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
అయితే చర్చ సందర్భంగా ఎస్ఎల్‌బీసీ ప్రమాదం గురించి ప్రధాని మోదీ అడిగారు. పరిస్థితి ఎలా ఉందంటూ ఆరా తీశారు. టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రేవంత్ చెప్పారు. భారీగా నీరు, బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డితోపాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, డీజీపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం పలువురు కేంద్రమంత్రులనూ రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
KTR: సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కామెంట్స్..
Komatireddy Venkatreddy: వారి క్షేమం కోసం మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు