Minister Seethakka: అవే కాంగ్రెస్‌ను గెలిపించాయ్.. జూబ్లీహిల్స్ ఫలితంపై మంత్రి సీతక్క
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:14 PM
బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని మంత్రి సీతక్క అన్నారు. కాంగ్రెస్ చేపట్టిన సంక్షేమ పథకాలే కాంగ్రెస్ గెలుపుకు కారణమని అన్నారు.
హైదరాబాద్, నవంబర్ 14: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ గెలుపు దాదాపు ఖాయమవడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఫలితంపై మంత్రి సీతక్క ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఎవరేమి చేశారో జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుసన్నారు. 10 ఏళ్లు ఏమి చేయలేని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసినా కూడా ప్రజలు విశ్వసించలేదని అన్నారు. మంత్రివర్గం, కార్యకర్తలు ప్రజలతో ఉన్నారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి పక్కా లోకల్ బీసీ బిడ్డ అని.. అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సెంటిమెంట్‌ను రగిలించినా కూడా ప్రజలు విశ్వసించలేదని తెలిపారు.
మాగంటి గోపీనాథ్ సతీమణి, పిల్లలను ముందు పెట్టినా కూడా ప్రజలు విశ్వసించలేదన్నారు. గతంలో పీజేఆర్ చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసని చెప్పుకొచ్చారు. కేటీఆర్ బుల్డోజింగ్ అని ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదన్నారు. తాము ఎవరిని బుల్డోజ్ చేయలేదని స్పష్టం చేశారు. నగరం మునిగిపోకుండా ఉండేందుకు ప్రజల ప్రయోజనాల దృష్టిలో హైడ్రాను ఏర్పాటు చేశామని వెల్లడించారు. నవీన్ యాదవ్‌కు ప్రజలు అవకాశం ఇచ్చారని తెలిపారు.
హైదరాబాద్‌లో బీఆర్ఎస్ అభివృద్ధి చేయలేదని విమర్శించారు. డ్రగ్స్ క్లబ్స్ పబ్స్‌ను కేటీఆర్ తెచ్చారని ఆరోపించారు. వాటికి ముగింపు పలకాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారని అన్నారు. అందుకే ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారని తెలిపారు. తాము చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే కాంగ్రెస్‌ను గెలిపించాయని అన్నారు. సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు తమ గెలుపు మంత్రాలుగా పనిచేశాయన్నారు. సీఎం, కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరుకు ఈ విజయం ఫలితమన్నారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని మంత్రి సీతక్క వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
అతిథులకు ఆహ్వానం పలుకుతూ సీఎం ట్వీట్
చిన్నారులకు చంద్రబాబు, పవన్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు
Read Latest Telangana News And Telugu News