Raja Singh Resignation Reaction: నా రాజీనామా అందుకోసం కాదు.. రాజాసింగ్ ట్వీట్
ABN , Publish Date - Jul 11 , 2025 | 04:16 PM
Raja Singh Resignation Reaction: దేశ సేవ, హిందుత్వాన్ని రక్షించేందుకు 11 ఏళ్ల క్రితం బీజేపీలో చేరినట్లు రాజాసింగ్ తెలిపారు. బీజేపీ తనకు మూడు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందని గుర్తుచేశారు.

హైదరాబాద్, జులై 11: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh) గత నెల 30న ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి.. ఆ లేఖను రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి పంపించారు. ఈ క్రమంలో ఈరోజు (శుక్రవారం) రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా (BJP National president JP Nadda) ఆమోదం తెలిపారు. రాజీనామా ఆమోదంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాజాసింగ్ స్పందించారు. హిందుత్వాన్ని రక్షించాలనే లక్ష్యంతో బీజేపీలో చేరానని.. ఏ పదవి, అధికారం ఆశించి రాజీనామా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. చివరి శ్వాస వరకు హిందూ సమాజ హక్కల కోసం తన గళం వినిపిస్తూనే ఉంటానని రాజాసింగ్ ట్వీట్ చేశారు.
రాజాసింగ్ ట్వీట్ ఇదే..
‘సరిగ్గా 11 సంవత్సరాల క్రితం నేను భారతీయ జనతా పార్టీలో చేరాను. ప్రజలకు సేవ చేయడం, దేశానికి సేవ చేయడం, హిందుత్వాన్ని రక్షించడం అనే లక్ష్యంతో నేను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాను. బీజేపీ నన్ను నమ్మి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గోషామహల్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఇందుకు బీజేపీ నాయకత్వానికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నా రాజీనామాను ఆమోదించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కలతో పగలు, రాత్రి పని చేస్తున్న లక్షలాది మంది బీజేపీ కార్యకర్తల బాధను నేను ఢిల్లీకి తెలియజేయలేకపోవచ్చు. నేను ఈ నిర్ణయం ఏ పదవి, అధికారం లేదా వ్యక్తిగత ఆసక్తి కారణంగా తీసుకోలేదని స్పష్టం చేయాలనుకుంటున్నాను. నేను హిందుత్వానికి సేవ చేయడానికి పుట్టాను. నా చివరి శ్వాస వరకు హిందుత్వం కోసం పని చేస్తూనే ఉంటాను. హిందుత్వం, జాతీయత, సనాతన ధర్మాన్ని రక్షించడానికి నేను ఎల్లప్పుడూ పూర్తి భక్తి, నిజాయితీతో పని చేస్తాను. నా చివరి శ్వాస వరకు సమాజ సేవ, హిందూ సమాజ హక్కుల కోసం నా గొంతుకను వినిపిస్తూనే ఉంటాను. జై శ్రీ రామ్’ అంటూ రాజాసింగ్ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఇవి కూడా చదవండి
నైజీరియన్ యువతులతో డ్రగ్స్ దందా..
హెచ్‌సీఏ స్కామ్.. రంగంలోకి ఈడీ
Read Latest Telangana News And Telugu News