Liquor Shops Closed: నేటి నుంచి వైన్స్ బంద్.. అమల్లో 144 సెక్షన్
ABN , Publish Date - Nov 09 , 2025 | 07:29 PM
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేటితో ఎన్నికల ప్రచారం ముగియడంతో.. నియోజకవర్గం వ్యాప్తంగా అధికారులు అప్రమత్తం అయ్యారు.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా మద్యం దుకాణాలను అధికారులు మూసివేశారు. మంగళవారం ఉపఎన్నికకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఇవాళ్టి(ఆదివారం) నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకూ వైన్ షాపులు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే.. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉన్నందున ఆ రోజు ఉదయం నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు బంద్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్సైజ్ చట్టం 1968 సెక్షన్ 20 ప్రకారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వైన్ షాపులు, కల్లు దుకాణాలు సహా రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు, స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్స్ లోని బార్లను అధికారులు మూసివేశారు.
మరోవైపు ఇవాళ్టితో ఎన్నికల ప్రచారం పర్వం ముగియడంతో.. అధికారులు అలర్ట్ అయ్యారు. ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. శాంతిభద్రతల నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండటం నిషేధమని చెప్పుకొచ్చారు. ఓట్ల లెక్కింపు రోజున రోడ్లు, జనావాసాల్లో టపాసులు కాల్చడం నిషేధమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆదేశాలని ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలు హోరాహోరీగా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి సునీత పోటీ చేస్తున్నారు. బీజేపీ పార్టీ తరఫున లంకల దీపక్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలో గెలిచి నగరంలో తమ సత్తా నిరూపించుకోవాలని చూస్తూంటే.. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుని పూర్వ వైభవం తెచ్చేకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోంది.
అలాగే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ పార్టీ, ఈ స్థానంలో గెలిచి పార్టీ బలం మరింత పెంచే దిశగా కసరత్తు చేస్తోంది. అయితే జరుగుతుంది.. ఉపఎన్నిక అయినా అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో .. ఎన్నికలో ఎవరు గెలుస్తారనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి..
కర్ణాటకలో నాయకత్వ పోరుపై బీజేపీ పేరడీ వీడియో
హిందూ ధర్మం కూడా ఎక్కడా నమోదు చేసుకోలేదు.. ఆర్ఎస్ఎస్ చట్టబద్ధతపై మోహన్ భాగవత్