Hyderabad Metro: మెట్రోలో వెళ్తున్నారా.. ఈ వార్త మీకోసమే
ABN , Publish Date - Jan 29 , 2025 | 09:26 AM
Hyderabad Metro: హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. పలు మార్గాల్లో మెట్రో రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. మెట్రో రైలు రాకపోకలకు గంట సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్, జనవరి 29: హైదరాబాద్ మెట్రో రైళ్లు (Hyderabad Metro Rail) నిలిచిపోయాయి. బుధవారం ఉదయం అమీర్‌పేట నుంచి హైటెక్ సిటీ, నాగోల్ నుంచి సికింద్రాబాద్, మియాపూర్ నుంచి అమీర్‌పేట మధ్య మెట్రో రైళ్లు నిలిచాయి. మెట్రో రైళ్లలో సాంకేతిక లోపమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మెట్రో రైళ్ల రాకపోకలకు మరో గంట సమయం పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మెట్రోలో ప్రయాణించేందుకు ఉదయమే మెట్రో స్టేషన్లకు చేరుకున్న ప్రయాణికులు.. మెట్రో రైళ్లు నిలిచిపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఆఫీసులకు వెళ్లే సమయంలో మెట్రో రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి.
ఇదే సమస్య...
నాగోల్ నుంచి రాయదుర్గం మార్గంలో బ్లూ లైన్‌లో అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఉదయం 6:30 గంటల నుంచే మెట్రో రైళ్లన్నీ చాలా ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు గంట పాటు మెట్రో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. సిగ్నలింగ్ ఇష్యూ రావడంతో మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మెట్రో రైళ్ల రాకపోకలలో అంతరాయం ఏర్పడటంతో వెంటనే ఎల్ అండ్ టీ అధికారులు అక్కడకు చేరుకున్నారు. టెక్నికల్ సమస్యలను పరిష్కరించేందుకు ఎల్ అండ్ టి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా బ్లూ లైన్ రూట్‌లో మెట్రో రైళ్లు స్లోగా నడుస్తున్న పరిస్థితి. మరికాసేపట్లో కాసేపట్లో సిగ్నలింగ్ సమస్యను పరిష్కారం అవుతుందని మెట్రో అధికారులు చెబుతున్నారు. ఉదయాన్నే ఆఫీస్ వేళలు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్ మెట్రో రైళ్లలో ఐదు లక్షల మందికిపైగా ప్రయాణికులు వారివారి గమ్యస్థానాలకు చేరుతుంటారు. ఎల్బీనగర్ నుంచి మియాపూర్, అమీర్‌పేట నుంచి హైటెక్ సిటీ మార్గంలో ఉదయం సమయంలో ప్రయాణికులతో మెట్రో స్టేషన్లలో విపరీతమైన రద్దీ ఉంటుంది. ఇలాంటి సమయంలో సాంకేతిక కారణాలతో మెట్రో సేవలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఒకింత అసహనానికి గురవుతున్నారు. మెట్రో స్టేషన్లలో కూడా రద్దీ పెరిగిపోయింది. తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు టికెట్ తీసుకున్న ప్రయాణికులు మెట్రో రైలు కోసం పడిగాపులు కాస్తున్నారు. అయితే ఐదు పది నిమిషాల ఆలస్యానికే మెట్రో స్టేషన్ల వద్ద రద్దీ విపరీతంగా ఉంటుంది. అలాంటిది ఆఫీసులకు వెళ్లే సమయం కావడం, మెట్రో రైళ్లు ఆలస్యంగా నడవడంతో మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికుల రద్దీ బాగా పెరిగిపోయింది. సాంకేతిక సమస్యలను పరిష్కరించే పనిలో ఉన్నారు ఎల్ అండ్ టీ అధికారులు. మరికాసేపట్లో మెట్రో సేవలు పునరుద్దరిస్తామని మెట్రో అధికారులు చెబుతున్నారు.
గతంలో కూడా ఎన్నో సార్లు మెట్రో రైళ్లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రతీ మూడూ నెలలకోసారి మెట్రో సేవల్లో అంతరాయం ఏర్పడటం జరుగుతూనే ఉంది. అయితే ప్రతీ సారి కేవలం ఐదు నిమిషాలు ఆలస్యంగా మెట్రో రైళ్లు నడువగా.. ఈ సారి మాత్రం దాదాపు రెండు గంటల నుంచి మెట్రో సేవలు నిలిచిపోవడం ఇదే తొలిసారి.
ఇవి కూడా చదవండి...
High Court: ఉస్మానియా ఆస్పత్రిని తరలిస్తే తప్పేంటి..
జగన్ హయాంలో పాఠశాలల బాగు ఉత్తుత్తే..
Read Latest Telangana News And Telugu News