Share News

Telangana CS Ramakrishna Rao: తెలంగాణ నూతన సీఎస్ నేపథ్యమిదే..

ABN , Publish Date - Apr 29 , 2025 | 03:46 PM

Telangana CS Ramakrishna Rao: తెలంగాణ నూతన సీఎస్‌గా రామకృష్ణారావును రేవంత్ ప్రభుత్వం నియమించింది. రామకృష్ణారావు ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా గుత్తి కోటకు చెందినవారు. ఆయన కుటుంబం ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడ్డారు.

Telangana CS Ramakrishna Rao: తెలంగాణ నూతన సీఎస్ నేపథ్యమిదే..
Telangana CS Ramakrishna Rao

తెలంగాణ సీఎస్‌గా గుత్తివాసి రామకృష్ణారావు

తాత చంద్రమౌళీశ్వర రావు స్వాతంత్య్ర సమరయోధుడు

తండ్రి రైల్వే ఉద్యోగి.. హైదరాబాద్‌లో స్థిరపడిన కుటుంబం

తెలంగాణ సీఎస్‌గా కొడిగెనహళ్లి పూర్వ విద్యార్థి

గుత్తి, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): గుత్తి కోట వీధిలో ఒకప్పుడు ఓనమాలు దిద్దిన కె. రామకృష్ణారావు తెలంగాణ ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. వీరిది స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబం. గుత్తి పట్టణంలోని కోట ప్రాంతంలో వీరి కుటుంబం ఉండేది. రామకృష్ణారావు తాత(తండ్రికి తండ్రి) కూట్లిగి చంద్రమౌళీశ్వర రావు స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. తల్లిదండ్రులు గురునాథరావు, భాగ్యలక్ష్మి దంపతులు. గురునాథరావు రైల్వే ఉద్యోగి కావడంతో బదిలీలపై వేర్వేరు ప్రాంతాలకు వెళ్లారు. చివరకు హైదరాబాదులో స్థిరపడ్డారు.


గుత్తి నుంచే ప్రస్థానం..

రామకృష్ణారావు గుత్తి కోట వీధిలోని పట్టు కేశవపిళ్లై ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదివారు. శ్రీసత్యసాయి జిల్లా (ఉమ్మడి అనంతపురం జిల్లా) పరిగి మండలంలోని కొడిగెనహళ్లి ఏపీఆర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివారు. నాగార్జున సాగర్‌లో ఇంటర్‌, కాన్పూర్‌ ఐఐటీలో బీటెక్‌, ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్‌, డ్యూక్‌ యూనివర్శిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. 1991లో ఐఏఎస్‌ సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నల్గొండ, మహబూబ్‌నగర్‌, నిజామబాద్‌ జిల్లాల సబ్‌ కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌గా, గుంటూరు, అదిలాబాద్‌ జిల్లాల కలెక్టర్‌గా, విద్యాశాఖ కమిషనర్‌గా, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించారు.


జ్ఞాపకాలే మిగిలాయి..

గుత్తి కోట వీధిలో రామకృష్ణారావు కుటుంబానికి సొంత ఇల్లు ఉండేది. ఇదే మండలంలోని కొత్తపేట గ్రామ పరిధిలో భూములు ఉండేవి. ఇంటిని అమ్మేశారు. భూములను కూడా విక్రయించారని తెలిసింది. ప్రస్తుతం ఇక్కడ వారికి బంధువులు ఎవరూ లేరు. ప్రాథమిక పాఠశాలలో కలిసి చదువుకున్న చిన్ననాటి స్నేహితులు నాగరాజు, సిఖందర్‌ తదితరులు ఉన్నారు. 2014లో కుటుంబ సమేతంగా రామకృష్ణారావు గుత్తికి వచ్చారు. తాను చదువుకున్న పాఠశాలకు వెళ్లి ఆనందంగా గడిపారు. స్నేహితులను కలిశారు. ఆ తరువాత గుత్తికి మరోమారు రాలేదని ఆయన స్నేహితులు తెలిపారు.


గర్వంగా ఉంది..

నా చిన్ననాటి స్నేహితుడు తెలంగాణ సీఎస్‌ కావడం గర్వంగా ఉంది. మేము ఐదో తరగతి వరకూ కలిసి చదువుకున్నాం. చిన్నప్పుడే విడిపోయినా స్నేహాన్ని కొనసాగిస్తున్నాం.

-నాగరాజు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జిల్లా సహకార శాఖ అధికారి


ఆనందంగా ఉంది..

నా చిన్ననాటి స్నేహితుడు తెలంగాణ రాష్ట్రానికి సీఎస్‌ కావడం ఆనందంగా ఉంది. ఆయన కుటుంబసమేతంగా గుత్తికి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చారు. మేము చదువుకున్న పాఠశాలకు వెళ్లి ఆనందంగా గడిపాము. చిన్ననాటి జ్ఞాపకాలను నేమరువేసుకున్నాము.

- సిఖందర్‌, స్నేహితుడు


ఇవి కూడా చదవండి

Rahul letter to PM: పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధానికి రాహుల్ లేఖ

Pakistani Citizens: హైదరాబాద్‌ను వీడిన పాకిస్థానీలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 29 , 2025 | 04:00 PM