Share News

KTR ACB Inquiry: ఫార్ములా ఈ రేస్ కేసు.. ఏసీబీ ఎదుటకు కేటీఆర్

ABN , Publish Date - Jun 16 , 2025 | 10:18 AM

KTR ACB Inquiry: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌.. ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. కేటీఆర్‌ను ముగ్గురు అధికారులు ప్రశ్నిస్తున్నారు.

KTR ACB Inquiry: ఫార్ములా ఈ రేస్ కేసు.. ఏసీబీ ఎదుటకు కేటీఆర్
KTR ACB Inquiry

హైదరాబాద్, జూన్ 16: ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు (Formula E Race Case) సంబంధించి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Former Minister KTR) ఏసీబీ (ACB) విచారణకు హాజరయ్యారు. ఈరోజు ఉదయం (సోమవారం) బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి కేటీఆర్‌ చేరుకోగా.. అధికారులు విచారణను ప్రారంభించారు. ఫార్ములా- ఈ రేస్‌ కేసులో కేటీఆర్‌ ఏ1గా ఉన్నారు. నిధుల దుర్వినియోగం, విదేశీ కంపెనీకి నగదు బదిలీకి సంబంధించి ఆయనపై ఏసీబీ అధికారులు ప్రశ్నలు సంధించనున్నారు. ముగ్గురు అధికారుల బృందం కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు. ఎఫ్‌ఈవో కంపనీకి నగదు బదిలీ చేసిన వ్యవహారంలో ఆ కంపనీని ఏసీబీ ఆన్‌లైన్‌లో విచారణ చేసి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది.


ఈ క్రమంలో ఎఫ్‌ఈవో కంపెనీ ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఏసీబీ ఆఫీస్‌ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఏసీబీ కార్యాలయం దగ్గరకు ఎవరినీ అనుమతించని పరిస్థితి. ఈ క్రమంలో కేటీఆర్‌తో పాటు వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలను నీలోఫర్‌ ఆస్పత్రి దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


వెనక్కి తగ్గేదే లేదు: కేటీఆర్

ఏసీబీ విచారణకు వెళ్లే ముందు కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. విచారణ పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress Govt) వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తానన్నారు. విచారణలు, కమిషన్లు, వేధింపుల నుంచి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు. చట్టాలు, న్యాయస్థానాలపై గౌరవం ఉందని తెలిపారు. జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదన్నారు. కాంగ్రెస్‌ హామీలు, డిక్లరేషన్లపై ఎండగడుతూనే ఉంటామన్నారు. లై డిటెక్టర్‌ సవాల్‌ను సీఎం రేవంత్‌ (CM Revanth Reddy) స్వీకరించాలన్నారు. తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్‌ఎస్సే అని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.


కాగా.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ కార్‌ రేస్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విషయం తెలిసిందే. మొదటి సారి రేస్ విజయవంతంగా జరుగగా.. రెండో సారి మాత్రం రేస్ జరుగకముందే స్పాన్సర్ చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థ తప్పుకుంది. రేస్ నిర్వహణ సంస్థకు హెచ్‌ఎండీఏ చెల్లింపులు జరిపింది. అయితే ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నగదు బదిలీ అయిందని.. దాదాపు రూ.55 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముగ్గురిపై ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ మాజీ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఈ ఏడాది జనవరిలో కేటీఆర్‌‌తో పాటు ఆ ఇద్దరిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. మరోసారి విచారణకు రావాలని పిలువగా.. కేటీఆర్ సమయం కోరారు. దీంతో గత నెల 26న కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది ఏసీబీ. మే 28న విచారణకు రావాల్సిందిగా కోరింది. ఆ సమయంలో కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నందున విదేశాల నుంచి తిరిగి వచ్చాక విచారణకు హాజరవుతానని ఏసీబీకి మాజీ మంత్రి సమాచారం ఇచ్చారు. అందుకు అంగీకారం తెలిపిన ఏసీబీ.. గత వారం మరోసారి నోటీసులు జారీ చేసి ఈరోజు (జూన్ 16) విచారణకు రావాల్సిందిగా పేర్కొంది. ఈ క్రమంలో నేడు ఏసీబీ ముందుకు రెండోసారి విచారణకు హాజరయ్యారు కేటీఆర్. ఇప్పటికే ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసి.. జనవరిలో కేటీఆర్‌ను విచారణ చేసింది.


ఇవి కూడా చదవండి

షార్‌లో తీవ్రవాదులు ఉన్నారంటూ ఫోన్

మేడిన్‌ ఇండియాకు చైనా కంపెనీలు జై

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 16 , 2025 | 11:07 AM