Share News

Sigachi Industry: చివరి ఆశలూ ఆవిరే!

ABN , Publish Date - Jul 04 , 2025 | 05:06 AM

పాశమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ విషయంలో బాధితుల ఆశలు ఆవిరవుతున్నాయి. ప్రమాదం జరిగి నాలుగు రోజులైనా కూడా పది మంది ఆచూకీ లభించలేదు.

Sigachi Industry: చివరి ఆశలూ ఆవిరే!

సిగాచి పరిశ్రమలో కూలిన భవనం శిథిలాలన్నీ తొలగించినా దొరకని మృతదేహాలు

  • 4 రోజులైనా ఆచూకీ లేని పది మంది

  • ‘కనీసం మా వాళ్ల ఎముకలైనా ఇవ్వండి’ అంటూ కన్నీళ్లు పెడుతున్న కుటుంబాలు

  • ప్రమాద సమయంలో ప్లాంటులో సమావేశం.. అందుకే భారీగా మరణాలు

  • ఇప్పటివరకు 31 మృతదేహాల గుర్తింపు

సంగారెడ్డి ప్రతినిధి/పటాన్‌చెరు/పటాన్‌చెరు రూరల్‌/రామచంద్రాపురం టౌన్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): పాశమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ విషయంలో బాధితుల ఆశలు ఆవిరవుతున్నాయి. ప్రమాదం జరిగి నాలుగు రోజులైనా కూడా పది మంది ఆచూకీ లభించలేదు. దుర్ఘటన జరిగిన స్థలంలో గురువారం సాయంత్రానికి శిథిలాలన్నీ తొలగించినా మృతదేహాలేవీ లభించలేదు. శిథిలాలను కాస్త దూరంగా ఖాళీ స్థలంలో పోసి, అణువణువు జల్లెడపడుతున్నారు. ఈ క్రమంలో కొన్ని కాలిపోయిన చిన్న చిన్న మాంసపు ముద్దలు, ఎముకల ముక్కలు మాత్రమే లభించినట్టు తెలిసింది. అధికారులు, ఫోరెన్సిక్‌ నిపుణులు ఆ భాగాలను పరిశీలన కోసం పంపించారు. మరోవైపు బాధిత కుటుంబాల ఆందోళనకు అంతులేకుండా పోయింది. వారంతా పరిశ్రమ, మార్చురీ, క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల వద్ద ప్రతి ఒక్కరికీ సెల్‌ఫోన్లలో తమవారి ఫొటోలను చూపిస్తూ.. జాడ కోసం తిరుగుతున్నారు. నాలుగు రోజులుగా పడిగాపులు కాస్తున్నామని, ఎక్కడా తమవారి ఆనవాళ్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమవారి శరీర భాగాలైనా, ఎముకలైనా అప్పగిస్తే.. అంతిమ సంస్కారాలు నిర్వహించుకుంటామంటూ అధికారులను ప్రాధేయపడుతున్నారు. మరోవైపు.. సిగాచి పరిశ్రమలో కూలిన ప్లాంటుతోపాటు మూడంతస్తుల భవన శిథిలాల తొలగింపు పూర్తయింది. శిథిలాల్లో శరీర భాగాలు, ఎముకలు, ఇతర ఆధారల కోసం ఫోరెన్సిక్‌ నిపుణులు గాలిస్తున్నారు. గురువారం పలువురు మృతులు, క్షతగాత్రుల గుర్తింపుకార్డులు, సెల్‌ఫోన్లు, పర్సులు, ఇతర వస్తువులతోపాటు కాలిపోయిన కొన్ని మాంసం ముద్దలు, ఎముకల ముక్కలు మాత్రమే లభ్యమైనట్టు సమాచారం.


ఆ పది మంది పరిస్థితి ఏమిటి?

ప్రమాద సమయంలో పరిశ్రమలో మొత్తం 143 మంది కార్మికులు, సిబ్బంది ఉండగా.. 60 మంది సురక్షితంగా బయటపడ్డారు. 35 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, మరో 38 మంది మృతి చెందినట్టు చెబుతున్నారు. మిగతా 10మంది ఆచూకీ లభించలేదు. వారు ప్రమాదం జరిగిన సోమవారం ఉదయం విధుల్లోకి వెళ్లినట్లుగా కుటుంబసభ్యులు చెబుతున్నారు. కంపెనీ రికార్డుల్లోనూ వారు హాజరైనట్టు ఉంది. మార్చురీలో గుర్తించని మృతదేహాల సంఖ్య కంటే ఆచూకీ తెలియనివారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారు ఏమయ్యారన్నదానిపై అధికారుల వద్ద సమాధానం కరువైంది. తమ వారి ఆచూకీ చెప్పాలంటూ మార్చురీకి వస్తున్న ప్రతి ఒక్కరి నుంచి రక్త నమూనాలను వైద్య సిబ్బంది సేకరించి, డీఎన్‌ఏ పరీక్షలకు పంపిస్తున్నారు. అయి తే పలు సాంకేతిక కారణాలతో ఫలితాలు రావడంలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు.

31 మృతదేహాల గుర్తింపు

అధికారులు గురువారం మరో 13 మృతదేహాలను గుర్తించారు. దీంతో గుర్తించిన మృతదేహాల సంఖ్య 31కి చేరింది. మరో 7 మృతదేహాలు పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రి మార్చురీలో ఉన్నాయి. గుర్తించిన మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించి, రూ.లక్ష తక్షణ సహాయంగా అందించి, స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు గాయాలతో మియాపూర్‌ ప్రణమ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 18 మందిలో 11 మందిని గురువారం డిశ్చార్జి చేశారు. మిగతా ఏడుగురిలో ఐదుగురు ఐసీయూలో, ఇద్దరు జనరల్‌ వార్డులో చికిత్స పొందుతున్నారు.


మీటింగ్‌ వల్లే మృతుల సంఖ్య పెరిగిందా?

ప్రమాద సమయంలో ప్లాంటు పైన ఉన్న క్వాలిటీ కంట్రోల్‌ విభాగంలో 25 మంది సిబ్బందితో నెలాఖరు సమీక్ష జరుగుతుండగా పేలుడు జరిగి భవనం కుప్పకూలడంతో వారంతా మంటల్లో చిక్కుకున్నట్టు తెలిసింది. ఇప్పటివరకు గుర్తించిన మృతదేహాల్లో క్వాలిటీ కంట్రోల్‌ విభాగానికి చెందినవారే ఎక్కువగా ఉండటం దీనికి సాక్ష్యమని అంటున్నారు. కాగా, ప్రమాదంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ గురువారం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. సుమారు మూడు గంటల పాటు పరిశ్రమలోని అన్ని విభాగాలను సందర్శించి, పలు నమూనాలను సేకరించింది. పరిశ్రమ అధికారులు, సిబ్బందిని ప్రశ్నించింది.

అస్థికలు ఇచ్చినా వెళ్లిపోతాం..

సిగాచీ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా జీ.సింగడం మండలం పాలకన్యం గ్రామానికి చెందిన కెమిస్ట్‌ వెంకటేశ్‌ (27) ఆచూకీ గల్లంతైంది. వెంకటేశ్‌ అస్ధికలు ఇచ్చి నా, తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు చేసుకుంటామని కుటుంబ సభ్యులు అధికారులను వేడుకుంటున్నారు.

29.jpgశిథిలాల్లో బయటపడిన శరీర భాగాలు


తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో.. తర్వాత మాయం!

29.jpg

ప్రమాదం జరిగిన రోజు తీవ్రంగా గాయపడిన కార్మికుడు చోటేలాల్‌ (27)ను ఇస్నాపూర్‌ కాకతీయ ఆస్పత్రికి తరలించారు. ఆయన బెడ్‌పై చికిత్స తీసుకుంటున్న దృశ్యాలను కొందరు సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు కూడా. తర్వాత ఆయన పరిస్థితి విషమించడంతో అదే రోజున పటాన్‌చెరులోని ధ్రువ ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. కానీ ఆ తర్వాతి నుంచి చోటేలాల్‌ ఎక్కడున్నాడో తెలియదని ఆయన భార్య సంజూదేవి కన్నీళ్లు పెడుతున్నారు. మార్చురీలో తన భర్త మృతదేహం లేదని, ఒకవేళ చికిత్స పొందుతూ మృతి చెందితే సమాచారం ఉంటుందని కదా అని ఆమె ప్రశ్నిస్తున్నారు. పోలీసులు చోటేలాల్‌ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాకు చెందిన చోటేలాల్‌ భార్య, ఇద్దరు పిల్లలతో కలసి ఇస్నాపూర్‌లో నివాసం ఉంటున్నారు.


9 మంది ఆచూకీ తెలియడం లేదు

  • సంగారెడ్డి కలెక్టర్‌ ప్రావీణ్య

పటాన్‌చెరు, జూలై 3 (ఆంధ్రజ్యోతి): తొమ్మిది మంది ఆచూకీ తెలియడం లేదని, వారి కోసం అన్వేషణ కొనసాగుతోందని సంగారెడ్డి కలెక్టర్‌ ప్రావీణ్య ప్రకటించారు. పరిశ్రమ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇప్పటివరకు మొత్తంగా 31 మంది కార్మికులను గుర్తించామని, మరో 7 మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు.


అల్లుడికి తీవ్ర గాయాలు.. సొమ్మసిల్లిన మామకు రూ. లక్ష బిల్లు

తీవ్రంగా గాయపడి పటాన్‌చెరులోని ధృవఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మూన్‌మూన్‌ చౌదరి అనే కార్మికుడిని చూసేందుకు ఆయన మామ బీరేంద్రచౌదరి బుధవారం బిహార్‌ నుంచి వచ్చారు. ఆస్పత్రిలో అల్లుడిని చూసి షాక్‌లో కుప్పకూలిపోయాడు. అదే ఆస్పత్రిలో బీరేందర్‌ను చేర్చి చికిత్సఅందించారు. ఒక్కరోజుకే రూ.లక్ష బిల్లువేసి, అందులో రూ.75వేలు వసూలు చేశారని, ఆపత్కాలంలో దోపిడీకి తెగబడ్డారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి

రాయచోటిలో ఉగ్రవాదులు అరెస్ట్.. కీలక అప్ డేట్..

తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారు.. కేసీఆర్, హరీష్‌లపై మహేష్ గౌడ్ ఫైర్

టాలీవుడ్‌లో పైరసీ గుట్టు రట్టు.. ఒకరి అరెస్ట్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 04 , 2025 | 05:06 AM