Share News

HMDA: శివార్లలో భారీ లే అవుట్లు

ABN , Publish Date - Jan 18 , 2025 | 03:34 AM

హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) భారీ ఎత్తున భూ సమీకరణకు (ల్యాండ్‌ పూలింగ్‌) సిద్ధమైంది. స్థిరాస్తి సంస్థల తరహాలో భూములను అభివృద్ధి చేసే ప్రక్రియను వేగవంతం చేసింది.

HMDA: శివార్లలో భారీ లే అవుట్లు

హైదరాబాద్‌ తూర్పువైపున హెచ్‌ఎండీఏ అభివృద్ధి ప్రణాళిక .. వేగంగా అడుగులు.. అధికారులతో ప్రచారం

  • భూములిచ్చేందుకు ముందుకొచ్చిన రైతులు

  • ఐదు ప్రాంతాల్లో 515 ఎకరాల సమీకరణ

  • అభ్యంతరాల స్వీకరణపై నోటిఫికేషన్ల జారీ

  • గడువు ముగిసిన తర్వాత రైతులతో ఒప్పందం

  • రైతులకు, హెచ్‌ఎండీఏకు 60:40 నిష్పత్తిలో వాటాలు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) భారీ ఎత్తున భూ సమీకరణకు (ల్యాండ్‌ పూలింగ్‌) సిద్ధమైంది. స్థిరాస్తి సంస్థల తరహాలో భూములను అభివృద్ధి చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. గతంలో ఉప్పల్‌ భగాయత్‌ను అభివృద్ధిపరిచినట్లుగా.. నగరం తూర్పు వైపునా రియల్‌ ఎస్టేట్‌ను పరుగులెక్కించేందుకు సరికొత్త లే అవుట్లకు హెచ్‌ఎండీఏ కసరత్తు ప్రారంభించింది. దీంట్లో భాగంగా పెద్ద అంబర్‌పేట్‌, ఘట్‌కేసర్‌, బాలాపూర్‌ మండలాల పరిధిలో.. భూ సమీకరణ పథకం కింద 515 ఎకరాల్లో భారీ లేఅవుట్లను చేసేందుకు తాజాగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. కొర్రెముల, తిమ్మాయిగూడ, కుత్బుల్లాపూర్‌, కుర్మల్‌గూడ, నాదర్‌గుల్‌ ప్రాంతాల్లో లేఅవుట్లు చేయనున్న భూములపై అభ్యంతరాలను స్వీకరిస్తోంది.


హెచ్‌ఎండీఏ లే అవుట్లకు భారీ డిమాండ్‌

హెచ్‌ఎండీఏ అనుమతులతో ప్రైవేటు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు చేసే స్థలాలకు భారీ డిమాండ్‌ ఉంటోంది. హెచ్‌ఎండీఏనే స్వయంగా విక్రయించే భూములు, స్థలాలు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతుంటాయి. హైదరాబాద్‌ శివార్లలో రియల్‌ ఎస్టేట్‌ రంగం శరవేగంగా ముందుకుపోతుండడంతో చాలా మంది రైతులు, భూ యజమానులు తమ స్థలాలను అభివృద్ధి చేయడానికి రియల్‌ ఎస్టేట్‌ సంస్థలను ఆశ్రయించటం, ఈ క్రమంలో పలువురు మోసపోయిన దాఖలాలున్నాయి. ఇటువంటి మోసాలకు తావు లేకుండా.. హెచ్‌ఎండీఏ లేఅవుట్లను అభివృద్ధి చేయడానికి ఉమ్మడి రాష్ట్రంలో భూసమీకరణ పథకాన్ని చేపట్టారు. హెచ్‌ఎండీఏకు తలమానికంగా నిలిచిన ఉప్పల్‌ భగాయత్‌ లేఅవుట్‌కు.. భూసమీకరణ పథకం కిందనే రైతుల నుంచి భూములను సేకరించారు. అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో విలువైన స్థలాలను రైతులకు అందించారు. ఇదే విధానాన్ని కొనసాగించేందుకు గత ప్రభుత్వ హయాంలో భూసమీకరణ పథకం-2017 పేరుతో మార్గదర్శకాలను రూపొందించారు. ఈ పథకం కింద ఇన్ముల్‌నర్వా, లేమూరు ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ లేఅవుట్లను అభివృద్ధి చేసింది.


ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ప్రభుత్వం

కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూసమీకరణ పథకంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అధికారులకు లక్ష్యాలను విధించి శివారు ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేసింది. ఈ క్రమంలో హెచ్‌ఎండీఏ ల్యాండ్‌ పూలింగ్‌ అధికారులు వివిధ ప్రాంతాల్లో రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. భూసమీకరణ పథకం వల్ల ప్రయోజనాలను వివరించడంతో పెద్దఎత్తున రైతులు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తిమ్మాయిగూడలో 156 ఎకరాలు, అదే మండలంలోని కుత్బుల్లాపూర్‌లో 130 ఎకరాలు, బాలాపూర్‌ మండలం కుర్మల్‌గూడ, నాదర్‌గుల్‌ గ్రామాల పరిధిలో 115 ఎకరాలు, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం కొర్రెములలో 114 ఎకరాలను అభివృద్ధి చేయాలని హెచ్‌ఎండీఏ సంకల్పించింది. మొత్తంగా 515 ఎకరాల భూములిచ్చేందుకు రైతులు అంగీకరించడంతో ఆయా సర్వే నెంబర్ల ఆధారంగా అధికారులు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఐదు ప్రాంతాల్లో నాలుగు భారీ లేఅవుట్లకు వేర్వేరుగానే అభ్యంతరాల స్వీకరణకు హెచ్‌ఎండీఏ తుది నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆయా సర్వే నెంబర్లపై ఎలాంటి అభ్యంతరాలున్నా 30 రోజుల్లో తమకు తెలియజేయాలని స్పష్టం చేసింది. గడువు తర్వాత వచ్చే అభ్యంతరాలను తిరస్కరిస్తామని పేర్కొంది. ఈ 30 రోజుల్లోనే భూ వివాదాలు, కోర్టు కేసులు, యజమాన్య హక్కుల అంశాలను పరిగణలోకి తీసుకుని హెచ్‌ఎండీఏ అధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు.


60:40 నిష్పత్తిలో వాటాలు

నోటిఫికేషన్లలో ప్రకటించిన ఆయా భూములపై అభ్యంతరాల స్వీకరణ పూర్తవగానే హెచ్‌ఎండీఏ.. రైతులతో ఒప్పందం చేసుకోనుంది. ఈ భూములను అభివృద్ధి చేసిన తర్వాత లేఅవుట్లలో రైతులకు 60 శాతం వాటా ఇవ్వనుండగా.. హెచ్‌ఎండీఏ 40 శాతం వాటాను తీసుకోనుంది. ఈ మేరకు ఆరు నెలల వ్యవధిలో ఒప్పంద ప్రక్రియను, డ్రాఫ్ట్‌ లేఅవుట్లను రూపొందించడానికి హెచ్‌ఎండీఏ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆ తర్వాతే హెచ్‌ఎండీఏ డెవల్‌పమెంట్‌ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో లేఅవుట్లను 30 అడుగులు, 40 అడుగులు, 60 అడుగుల రోడ్లు, అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ, నీటి సరఫరా వ్యవస్థ, పార్కులతో అభివృద్ధి చేయనున్నారు. ఈ లేఅవుట్లకు 100 అడుగుల అప్రోచ్‌ రోడ్డు ఉండేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఈ భారీ లేఅవుట్ల అభివృద్ధికి మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Updated Date - Jan 18 , 2025 | 03:34 AM