Engineering Courses: సీబీఐటీ.. ఫీజులు పెంచుకోవచ్చు
ABN , Publish Date - Jul 11 , 2025 | 05:25 AM
ఇంజనీరింగ్ కోర్సుల ఫీజులు పెంచుకునేందుకు చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ)కి హైకోర్టు అనుమతి ఇచ్చింది.

టీఏఎఫ్‌ఆర్సీ సిఫార్సుల మేరకే.. పెంపు తుది తీర్పునకు లోబడి ఉండాలి
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
అప్పీలు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
కోర్టును ఆశ్రయించిన మరిన్ని ప్రైవేటు కాలేజీలు.. విచారణ నేటికి వాయిదా
హైదరాబాద్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్ కోర్సుల ఫీజులు పెంచుకునేందుకు చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ)కి హైకోర్టు అనుమతి ఇచ్చింది. 2025-26, 2026-27, 2027-28 విద్యా సంవత్సరాలకు సంబంధించి తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎ్‌ఫఆర్‌సీ) నిర్ధారించిన మేరకు బీటెక్ కోర్సులకు రూ.2.23 లక్షలు, ఎంటెక్ వంటి పీజీ కోర్సులకు రూ.1.51 లక్షలు, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు 1.40 లక్షలు వార్షిక ఫీజు వసూలు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అధికారిక వెబ్‌సైట్లో ఈ కాలేజీకి సంబంధించి కొత్త ఫీజుల వివరాలను ఉంచాలని ఈఏపీసెట్ కన్వీనర్‌ను ఆదేశించింది. ఈ ఫీజుల పెంపు కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది.
జీవో 26ను సవాల్ చేస్తూ..
రాష్ట్రంలోని ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ వృత్తివిద్య కళాశాలల్లో ఫీజులను మూడేళ్లకోసారి(బ్లాక్ పీరియడ్) సవరిస్తారు. టీఏఎ్‌ఫఆర్సీ ఆయా కాలేజీల ఆదాయ, వ్యయాల లెక్కలను పరిశీలించి కొత్త ఫీజులను ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. గత బ్లాక్ పీరియడ్ (2022-25) ముగియడంతో.. ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-26) నుంచి కొత్త ఫీజులు అమల్లోకి రావాల్సి ఉంది. దీనికి సంబంధించి టీఏఎ్‌ఫఆర్సీ కాలేజీల నుంచి ప్రతిపాదనలు తీసుకుని, ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కానీ ఆ ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. కాలేజీల ప్రతిపాదనలను పరిశీలించి, కొత్త ఫీజులను ఖరారు చేస్తామని ప్రకటించింది. ఈ ఏడాదికి పాత ఫీజులే కొనసాగుతాయని పేర్కొంటూ ఉన్నత విద్యాశాఖ జూన్ 30న జీవో 26ను జారీచేసింది. అయితే ఫీజులు పెంచకుంటే ఆర్థికంగా ఇబ్బంది ఎదురవుతుందని, టీఏఎ్‌ఫఆర్సీ నిర్ణయించిన మేరకు ఫీజుల వసూలుకు అనుమతించాలని కోరుతూ.. సీబీఐటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గురువారం జస్టిస్ కే.లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. సీబీఐటీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. టీఏఎ్‌ఫఆర్సీ చట్టబద్ధ సంస్థ అని, ఆ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించడం తప్ప మరో మార్గం లేదని కోర్టుకు నివేదించారు. మరోవైపు టీఏఎ్‌ఫఆర్సీ, ఉస్మానియా యూనివర్సిటీ తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. టీఏఎ్‌ఫఆర్సీ కేవలం సిఫార్సులు చేస్తుందని, అమలు చేయాలా వద్దా? అన్నది ప్రభుత్వం చేతిలోనే ఉంటుందని వివరించారు. ఈ క్రమంలో ప్రభుత్వం జారీచేసిన జీవో 26ను పరిశీలించిన ధర్మాసనం.. అది సాధారణ ఉత్తర్వులా ఉందని, ప్రాథమికంగా పరిశీలిస్తే జీవో 6 (2007)కు విరుద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోందని పేర్కొంది. పాత ఫీజులు కొనసాగించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో పిటిషనర్ (సీబీఐటీ)కు ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది. టీఏఎ్‌ఫఆర్సీ నిర్ణయించిన ఫీజులు వసూలు చేసుకోవడానికి సీబీఐటీని అనుమతించాలని ఈఏపీసెట్ కన్వీనర్‌ను ఆదేశించింది. ఈ వ్యవహారంలో వివరణ ఇవ్వాలంటూ ప్రతివాదులైన ఉన్నత విద్యాశాఖ, టీఏఎ్‌ఫఆర్సీ, ఉన్నత విద్యా మండలి, ఉస్మానియా యూనివర్సిటీ, ఈఏపీసెట్ కన్వీనర్‌లకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ 30కి వాయిదా పడింది. కోర్టు మధ్యంతర ఉత్తర్వులపై డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలిసింది.
ఫీజుల పెంపుకోసం మరిన్ని పిటిషన్లు..
మరికొన్ని ప్రైవేటు కాలేజీలు కూడా ఫీజుల పెంపు కోసం గురువారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిపై విచారణ చేపట్టిన జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం.. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై తగిన సమయంలోగా నిర్ణయం తీసుకోలేరా అని టీఏఎ్‌ఫఆర్సీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫీజుల అంశం ఓ ప్రహసనంలా మారిందని, కౌన్సెలింగ్ పూర్తయి, తరగతులు ప్రారంభమవుతున్నా ఫీజులపై తేల్చడం లేదని పేర్కొంది. ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కొన్ని కాలేజీలు 70శాతం వరకు ఫీజు పెంపును కోరుతున్నాయని, విద్యార్థులపై భారం పడుతుందని నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
సర్పంచ్ పదవులకు 100% రిజర్వేషన్ సరికాదు షెడ్యూల్డ్ ప్రాంతాల్లో రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్
రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో అన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులను గిరిజనులకే రిజర్వు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లికి నాన్‌ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ ఈ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ మాధవీదేవి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది రమణారెడ్డి వాదనలు వినిపిస్తూ.. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీల్లో ఎస్టీలకే 100 శాతం రిజర్వేషన్ కల్పించడం సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకమని పేర్కొన్నారు. అయితే పిటిషనర్ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018ను సవాల్ చేస్తున్నారని, ఈ పిటిషన్‌ను విచారించే పరిధి సింగిల్ బెంచ్‌కు లేదని ధర్మాసనం పేర్కొంది. పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి.
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
గొంతు నొప్పిని తగ్గించే సింపుల్ చిట్కా..
ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి
Read Latest Telangana News and National News