Share News

Health Scheme: ఆరోగ్యశ్రీ అనుసంధానం పైసలిస్తే పరిపూర్ణం

ABN , Publish Date - Jun 30 , 2025 | 02:58 AM

ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకంలో వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొందరికి కాసుల వర్షం కురిపిస్తోంది.

Health Scheme: ఆరోగ్యశ్రీ అనుసంధానం పైసలిస్తే పరిపూర్ణం

ఒక్కో ప్రైవేటు ఆస్పత్రి నుంచి రూ.3-5 లక్షల వసూలు.. ఇటీవల కాలంలో ఎంప్యానలైన 60కిపైగా ఆస్పత్రులు

  • 8 పడకలను బట్టి రేటు.. రూ.3 కోట్ల వరకు వసూలు

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకంలో వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొందరికి కాసుల వర్షం కురిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు లభించేలా చూడాలన్న సంకల్పంతో ‘ఎంప్యానెలింగ్‌’ ప్రక్రియకు ఈ ఏడాది మొదట్లో శ్రీకా రం చుట్టింది. ఆయా ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చే ఈ అనుసంధాన ప్రక్రియ కొందరు ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయ అధికారులకు, జిల్లాస్థాయిలో పనిచేసేవారికి వరంగా మారింది. మార్చి నాటికి తెలంగాణ వ్యాప్తంగా 409 ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్నాయి. వాటి సంఖ్యను వెయ్యికి పెంచాలని ప్రభుత్వం భావించింది. దీనికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అప్పటి ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో కర్ణన్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు. సుమారు 164 ప్రైవేటు ఆస్పత్రులకుపైగా దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం సౌకర్యాలు ఉన్నాయా లేవా అనేది ఆరోగ్యశ్రీ అధికారుల బృందం పరిశీలిస్తుంది. నిబంధనల ప్రకారం పడకల సంఖ్య, వైద్యులు, వైద్య సిబ్బంది, పరీక్షా యంత్రాలు అందుబాటులో ఉన్న ఆస్పత్రులకు అనుమతులు మంజూరు చేయవచ్చని ఆ బృందం ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. తర్వాత వాటిని ఎంప్యానెల్‌ ఆస్పత్రుల జాబితాలో చేరుస్తారు. ఈ క్రమంలోనే ప్రైవేటు ఆస్పత్రుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.


ఒక్కో ఆస్పత్రి నుంచి రూ.3-5 లక్షలు!

గతంలో ఏదైనా ప్రైవేటు ఆస్పత్రి ఆరోగ్యశ్రీలో ఎంప్యానెల్‌ కావాలంటే 13 అంచెలను దాటుకొని రావాలి. ఎక్కడైనా చిన్న ఆటంకం ఏర్పడినా సదరు దరఖాస్తును తిరస్కరించేవారు. ఎంప్యానెల్‌ అయ్యేందుకు పెద్దగా అవకాశం ఉండేది కాదు. దాంతో అనుసంధాన ఆస్పత్రులుగా మారడం క్లిష్టంగా ఉండేది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 13 అంచెలను 10కి కుదించారు. ఆస్పత్రులకు అనుమతిపై నిర్ణయం తీసుకునే ఈడీసీ (ఎంప్యానెల్‌ డిసిప్లినరీ కమిటీ)ని తొలగించారు. నిబంధనల మేరకు మౌలిక సదుపాయాలు, అర్హత గల వైద్యులు ఉన్న ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీకి అనుసంధానం చేయాలని నిర్ణయించారు. దీంతో చిన్న చిన్న పట్టణాల్లోని ప్రైవేటు ఆస్పత్రులూ దరఖాస్తు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఆస్పత్రిలోని పడకల స్థాయిని బట్టి ‘రేటు’ నిర్ణయించి, తమ వద్ద నుంచి వసూలు చేసినట్లు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. కనిష్ఠంగా రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పైచిలుకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఉన్న జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి ఎంప్యానెల్‌ చేసేందుకు రూ.5లక్షలు, దక్షిణ తెలంగాణ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి రూ.3 లక్షలు వసూలు చేశారు. దరఖాస్తు చేసుకున్న వాటిలో ఎంప్యానెల్‌కు అర్హత ఉన్న ఏ ఒక్క ఆస్పత్రినీ వదల్లేదని సమాచారం. ఇటీవల కాలంలో మొత్తం60కి పైగా ఆస్పత్రులను ఎంప్యానెల్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల నుంచి సుమారు రెండున్నర నుంచి మూడు కోట్ల వరకు వసూలు చేసినట్లు వాటి యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి.


సమగ్ర విచారణ జరపాలి

ఆరోగ్యశ్రీ సిబ్బంది, ఒకరిద్దరు అధికారుల తీరు వల్ల సర్కారుకు చెడ్డపేరు వస్తోందని వైద్యవర్గాలు అంటున్నాయి. ఎంప్యానెల్‌ పేరిట వసూళ్లపై విజిలెన్స్‌తో సమగ్ర విచారణ జరిపించాలని ఉద్యోగులు, ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు కోరుతున్నాయి.

చక్రం తిప్పిన ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారి

ఈ మొత్తం తతంగాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలోని ఓ అధికారి నడిపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాస్థాయిలో పనిచేసే ఆరోగ్యశ్రీ సిబ్బంది ద్వారా ఈ దందా నడిపిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోగా కర్ణన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్యాలయంలో దీర్ఘకాలికంగా పాతుకుపోయిన వారందరికీ స్థానచలనం కల్పించారు. కానీ ఒకరిద్దరు అధికారులు మాత్రం తమకున్న పరపతిని ఉపయోగించి అక్కడే తిష్ట వేసుకున్నారు. అందులో ఒకరు ఈ వసూళ్ల దందాకు పాల్పడుతున్నట్లు వైద్య వర్గాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. కొత్తగా 163 ప్యాకేజీలను చేర్చడంతో వాటి సంఖ్య 1835కు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో 1,042 సర్కారీ దవాఖానాలు ఉండగా ప్రైవేటు ఆస్పత్రుల సంఖ్య 436కు పెరిగింది.

Updated Date - Jun 30 , 2025 | 02:58 AM