Share News

Bonalu Festival Hyderabad : బోనమెత్తిన భాగ్యనగరం

ABN , Publish Date - Jul 21 , 2025 | 03:19 AM

శివసత్తుల ఊరేగింపులు, పోతరాజుల విన్యాసాలు, తీన్మార్‌ డప్పులతో స్టెప్పులు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, జానపద గీతాలు.. ఎటు చూసినా భక్త జనసందోహం, సందడే సందడి... వెరసి భాగ్యనగరం ఆదివారం ఆషాడ బోనల జాతర శోభ సంతరించుకుంది.

Bonalu Festival Hyderabad : బోనమెత్తిన భాగ్యనగరం

  • హైదరాబాద్‌లో వైభవంగా బోనాల వేడుకలు

  • అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

  • 2,783 ఆలయాల్లో బోనాలకు 20కోట్లు: భట్టి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) : శివసత్తుల ఊరేగింపులు, పోతరాజుల విన్యాసాలు, తీన్మార్‌ డప్పులతో స్టెప్పులు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, జానపద గీతాలు.. ఎటు చూసినా భక్త జనసందోహం, సందడే సందడి... వెరసి భాగ్యనగరం ఆదివారం ఆషాడ బోనల జాతర శోభ సంతరించుకుంది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ హైదరాబాద్‌ నగర వీధులన్నీ బోనాల ఉత్సవాలతో సందడిగా కనిపించాయి. హైదరాబాద్‌లో ఉన్న అన్ని అమ్మవారి ఆలయాల్లో బోనాల జాతరలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు అమ్మవార్లకు బోనం సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అయితే, ప్రధాన ఆలయాల వద్ద దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. లాల్‌దర్వాజాలోని సింహవాహని ఆలయం, హరిబౌలి అక్కన్నమాదన్న మహంకాళి, చార్మినార్‌ భాగ్యలక్ష్మి, గౌలిపురా కోటమైసమ్మ, బేలాచందూలాల్‌ ముత్యాలమ్మ, మీర్‌ఆలంమండి మహంకాళి, కార్వాన్‌దర్బార్‌ మైసమ్మ, ఎల్‌బీనగర్‌ ఖిల్లామైసమ్మ తదితర ఆలయాల్లో అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పించింది. లాల్‌దర్వాజా సింహవాహని అమ్మవారికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, అక్కన్నమాదన్న ఆలయంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌, గౌలిపురాలో మంత్రి వాకిటి శ్రీహరి, మీర్‌ఆలంమండి ఆలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎల్‌బీనగర్‌లోని ఖిల్లామైసమ్మ ఆలయంలో మంత్రి సీతక్క, ఉప్పుగూడ మహంకాళి ఆలయంలో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాలిబండ బంగారు మైసమ్మ ఆలయంలో ప్రభుత్వం తరఫున మేయర్‌ విజయలక్ష్మిపట్టువస్త్రాలు సమర్పించారు.


లాల్‌దర్వాజాలో పట్టువస్త్రాల సమర్పణ అనంతరం ఉపముఖ్యమంత్రి భట్టి మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.1290 కోట్లు వ్యయం చేస్తోందని తెలిపారు. రాజధానిలోని 2,783ఆలయాల్లో బోనాల నిర్వహణకు రూ.20కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. కాగా, లాల్‌దర్వాజా సింహవాహని అమ్మవారికి మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌, ఎంపీ చామల కిరణ్‌, మండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాష్‌, డిప్యూటి స్పీకర్‌ రామచంద్రనాయక్‌, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, రాజాసింగ్‌, టీటీడీ చైర్మన్‌ బీఆర్‌నాయుడు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌, బీజేపీ నేత లక్ష్మణ్‌ తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. బోరబండలోని శ్రీపోచమ్మ ఆలయంలోని అమ్మవారికి సినీనటి, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ విజయశాంతి బంగారు బోనం సమర్పించగా.. మంత్రులు తుమ్మల, పొన్నం పట్టువస్త్రాలు సమర్పించారు. హరియాణా మాజీ గవర్నర్‌ దత్తాత్రేయ నివాసంలో జరిగిన బోనాల వేడుకల్లోగవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు.


గవర్నర్‌, సీఎం శుభాకాంక్షలు

బోనాల పండుగ సందర్భంగా గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ, సీఎం రేవంత్‌ వేర్వేరుగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణతోపాటు దేశ ప్రజలందరికీ శాంతి, ఆరోగ్యం, శ్రేయస్సు ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్ధిస్తున్నట్టు గవర్నర్‌ తెలిపారు. ఇక, జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో మొదలైన ఉత్సవాలు లాల్‌దర్వాజా సింహవాహని అమ్మవారికి బోనం సమర్పించడంతో ముగుస్తాయని పేర్కొన్న సీఎం.. ఉత్సవాలు విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

త్వరలో యాదగిరి ఆధ్యాత్మిక మాసపత్రిక, టీవీ చానల్‌

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 21 , 2025 | 03:19 AM