Share News

Road Accident: బతుకులు ఛిద్రం..

ABN , Publish Date - Jan 27 , 2025 | 04:32 AM

డ్రైవింగ్‌ సీట్లో కూర్చున్నోడు పూటుగా మద్యం తాగి, ఆ మత్తులో నడుపుతున్నాడు! అతడి ఈ నిర్లక్ష్యమే ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైంది! ఓ నిండు కుటుంబాన్ని ఛిద్రం చేసింది.

Road Accident: బతుకులు ఛిద్రం..

  • పల్టీకొట్టిన భారీ కంటెయినర్‌ నేరుగా 2 ఆటోలపై పడ్డ

  • అందులోని ఉక్కు స్తంభాలు నలుగురి దుర్మరణం.. మరో నలుగురికి తీవ్రగాయాలు

  • వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై ఘటన

  • కంటెయినర్‌ డ్రైవర్‌ మద్యం మత్తు వల్లే..

  • మృతులంతా వలస జీవులు.. ఒకే కుటుంబ సభ్యులు

  • ఘటనపై రేవంత్‌ దిగ్ర్భాంతి

మామునూరు/వరంగల్‌ క్రైం, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): అది పద్దెనిమిది టైర్ల భారీ కంటెయినర్‌! పెద్ద పెద్ద ఉక్కు స్తంభాల లోడ్‌తో వెళుతోంది. డ్రైవింగ్‌ సీట్లో కూర్చున్నోడు పూటుగా మద్యం తాగి, ఆ మత్తులో నడుపుతున్నాడు! అతడి ఈ నిర్లక్ష్యమే ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైంది! ఓ నిండు కుటుంబాన్ని ఛిద్రం చేసింది. మద్యం మత్తులో జోగుతున్న డ్రైవర్‌, కంటెయినర్‌పై నియంత్రణ కోల్పోవడంతో అది అదుపు తప్పి పల్టీకొట్టింది. ఆలోపు.. అందులోని ఉక్కు స్తంభాలు పక్కనుంచే వెళుతున్న రెండు ఆటోలపై పిడుగుల్లా పడ్డాయి. ఆ ఆటోల్లో ప్రయాణిస్తున్నవారు చీమల్లా నలిగిపోయారు. ప్రమాదంలో తండ్రి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు.. ఇలా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఇంటి పెద్ద భార్య, మరో కుమారుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం... వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై మా మునూరు పోలీసు పెట్రోలు బంకు వద్ద ఆదివారం ఉదయం సంభవించింది. రోడ్డంతా నెత్తురు.. ఛిద్రమైన శరీర భాగాలతో ఒళ్లు జలదరించేలా అక్కడ భీతావహంగా మారింది.


మృతులు, క్షతగాత్రులంతా మధ్యప్రదేశ్‌ నుం చి వచ్చిన వలస జీవులు.. వంట కోసం ఉపయోగించే కత్తిపీటలు, కత్తులు తయారు చేసి, అమ్ముకొని పొట్టపోసుకునే బడుగుజీవులు! మధ్యప్రదేశ్‌ భోపాల్‌లోని లలితానగర్‌ ప్రాం తానికి చెందిన లోపిట సంతోష్‌ చౌహాన్‌ (48).. భార్య చామా బాయి (40), కుమారు లు ముకేశ్‌ చౌహాన్‌, కన్నా చౌహాన్‌ (7), కూతుళ్లు ఆర్తి చౌహాన్‌ (20), కిరణ్‌ చౌహాన్‌ (12)తో కలిసి తొమ్మిదినెలల క్రితం వరంగల్‌ శివారులోని మామునూరుకొచ్చారు. ఆయన కుటుంబంతో పాటు భోపాల్‌ నుంచి మరో ఆరు కుటుంబా లు వలసొచ్చాయి. వీరంతా తాము తయారు చేస్తున్న వస్తువులను వరంగల్‌కు తీసుకెళ్లి అమ్ముతుంటారు. ఆదివారం సంతోష్‌ చౌహాన్‌, ఆయన కుటుంబసభ్యులం తా ఒకే ఆటోలో మామునూరు నుంచి వరంగల్‌కు బయలుదేరారు. ఇక కరీమాబాద్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ తోట ప్రాంతానికి చెందిన మరో ఆటో ఐనవోలు నుంచి వరంగల్‌ వైపు వెళుతోంది.


ఈ రెండు ఆటోలు మామునూరు పెట్రోలుబంకు వద్ద ఘోర ప్రమాదానికి గురయ్యాయి. విశాఖపట్టణం నుంచి వరంగల్‌ వైపు భారీ ఉక్కు స్తంభాల లోడుతో వెళుతున్న కంటెయినర్‌ అదుపు తప్పి పడిపోయింది. అందులోని స్తంభాలన్నీ నేరుగా రెండు ఆటోలపై పడ్డాయి. ఈ ఘటనలో సంతోష్‌, ఆర్తి, కిరణ్‌ అక్కడికక్కడే మృతిచెందారు. సంతోష్‌ భార్య చామాబాయి, కుమారులు కన్నా చౌహాన్‌, ముకేశ్‌తో పాటు మరో ఆటోలోని డ్రైవర్‌ రాపర్తి సాగర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నా చౌహాన్‌ ప్రాణాలొదిలాడు. ఈ ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారిని తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని వరంగల్‌ కలెక్టర్‌, పోలీసు అధికారులకు ఆదేశాలు జారీచేశారు.


పంపిస్తే మా ఊరెళ్లిపోతాం

మృతులు, క్షతగాత్రుల సంబంధీకుల రోదనలతో ఎంజీఎం ఆస్పత్రి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. మిగతా రోగుల బంధువులు వారికి భోజనం అందించబోగా వారు తీసుకోలేదు. ‘మేం ఎలా తినగలం? మా నోట్లోకి మంచినీళ్లు కూడా పోవడం లేదు. మా సొంతూరికి పంపిస్తే వెళ్లిపోతాం’అని చేతులు జోడిస్తూ విలపించారు. ఆస్పత్రి వద్ద మృతుల సంబంధీకులను మంత్రి కొండా సురేఖ పరామర్శించారు. మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఎంజీఎంలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ప్రైవేటు ఆస్పత్రికి తరలించి నట్లు అధికారులు పేర్కొన్నారు.


సత్వర వైద్యం అందించాలి: హరీశ్‌రావు

హైదరాబాద్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) : వరంగల్‌జిల్లా మామునూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు ఆదివారం ఎక్స్‌వేదికగా ఆయన తన సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి తక్షణ వైద్య ేసవలు అందించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని హరీ్‌షరావు కోరారు.

Updated Date - Jan 27 , 2025 | 04:32 AM