Share News

Chamala Kiran Kumar Reddy: నాలుగేళ్లలో పథకాలన్నీ అమలు చేసి చూపిస్తాం

ABN , Publish Date - Jan 18 , 2025 | 04:33 AM

‘మా ప్రభుత్వానికి ఇంకా నాలుగేళ్ల టైమ్‌ ఉంది. ఈ నాలుగేళ్లలో అన్ని స్కీములూ అమలు చేసి చూపిస్తం’ అని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నాలుగేళ్లలో పథకాలు అమలు చేయకుంటే ప్రజలే తమకు బుద్ధి చెబుతారన్నారు.

Chamala Kiran Kumar Reddy: నాలుగేళ్లలో పథకాలన్నీ అమలు చేసి చూపిస్తాం

  • కేటీఆర్‌కు నోటి దురుసు: చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

  • ప్రజల దృష్టిని మరల్చేందుకు రైతు దీక్ష : జీవన్‌రెడ్డి

హైదరాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ‘మా ప్రభుత్వానికి ఇంకా నాలుగేళ్ల టైమ్‌ ఉంది. ఈ నాలుగేళ్లలో అన్ని స్కీములూ అమలు చేసి చూపిస్తం’ అని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నాలుగేళ్లలో పథకాలు అమలు చేయకుంటే ప్రజలే తమకు బుద్ధి చెబుతారన్నారు. కేటీఆర్‌కు నోటి దురుసు ఎక్కువైందని, అతి త్వరలో ఆయన చేసిన స్కామ్‌లన్నీ బయటికి రాబోతున్నాయని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. త్వరలోనే కేటీఆర్‌ పిచ్చాసుపత్రికి వెళ్లడం ఖాయమన్నారు. 2014, 2018 ఎన్నికల మ్యానిఫెస్టోల్లోని అంశాల్లో 20 శాతం కూడా బీఆర్‌ఎస్‌ అమలు చేయలేదన్నారు. కేటీఆర్‌కు చేయాల్సింది లై డిటెక్టర్‌ టెస్టు కాదని, నార్కో అనాలసిస్‌ టెస్టు అని ఎమ్మెల్యే మధుసూధన్‌రెడ్డి అన్నారు.


గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసింది రుణమాఫీ కాదని, వడ్డీ మాఫీనేనని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఏకకాలంలో రూ.2 లక్షల మేరకు రుణమాఫీ చేశామని.. సన్న వడ్లకు బోనస్‌ ఇస్తున్నామని చెప్పారు. ఈనెల 26 నుంచి రైతు భరోసా, ఆత్మీయ భరోసాల కింద ఏడాదికి రూ.12 వేలు చొప్పున ఇవ్వనున్నట్లు గుర్తు చేశారు. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేటీఆర్‌ రైతు దీక్ష పేరిట నాటకాలాడుతున్నారని విమర్శించారు. కాగా, నిండు సభలో అంబేడ్కర్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అవమానిస్తే.. ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ దేశాన్నే అవమానించారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు మండిపడ్డారు.

Updated Date - Jan 18 , 2025 | 04:33 AM