Share News

CM Revanth Reddy Urges Voters: మంచివారిని ఎన్నుకుంటేనే.. గ్రామాల అభివృద్ధి..

ABN , Publish Date - Dec 03 , 2025 | 04:16 AM

గ్రామ సర్పంచ్‌లుగా మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. హాఫ్‌కు, ఫుల్‌కు ఆశపడి ఓటు వేస్తే గ్రామాలు దెబ్బతింటాయన్నారు. అందుకే రాజకీయ కక్షలు మాని.....

CM Revanth Reddy Urges Voters: మంచివారిని ఎన్నుకుంటేనే.. గ్రామాల అభివృద్ధి..

  • ప్రభుత్వం అమలు చేస్తున్న విద్య, సాగునీటి విధానాలతోనే రాష్ట్రానికి దేశంలో ప్రథమ స్థానం

  • దేశం గర్వించేలా మన్మోహన్‌సింగ్‌ ఎర్త్‌సైన్సెస్‌ వర్సిటీ

  • నెహ్రూ స్ఫూర్తితో యూనివర్సిటీల స్థాపన

  • బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్లక్షానికి గురైన ప్రాజెక్టులు

  • కేసీఆర్‌ ఇంట్లో మాత్రం కనకవర్షం: సీఎం రేవంత్‌రెడ్డి

  • కొత్తగూడెంలో ఎర్త్‌సైన్సెస్‌ యూనివర్సిటీ ప్రారంభం

ఖమ్మం/కొత్తగూడెం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): గ్రామ సర్పంచ్‌లుగా మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. హాఫ్‌కు, ఫుల్‌కు ఆశపడి ఓటు వేస్తే గ్రామాలు దెబ్బతింటాయన్నారు. అందుకే రాజకీయ కక్షలు మాని.. మంత్రులతో కలిసి పనిచేసే వారిని, అభివృద్ధి చేసేవారిని సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీని సీఎం రేవంత్‌ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎడ్యుకేషన్‌, ఇరిగేషన్‌ పాలసీలే తెలంగాణను దేశంలో మొదటి స్థానంలో నిలుపుతున్నాయన్నారు. తెలంగాణ ఉద్యమానికి పునాదులుగా నిలిచిన పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతంలోనే.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన మన్మోహన్‌సింగ్‌ పేరుతో యూనివర్సిటీని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. దీనిని దేశం గర్వించేలా, ప్రపంచ దేశాల్లో గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ కోసం భూములు కోల్పోయిన వారికి కాకుండా.. ఇతర ప్రాంతాల వారికి నాడు ఉద్యోగాలిస్తే తెలంగాణ ఉద్యమానికి పాల్వంచ ప్రాంతంలోనే పునాదులు పడ్డాయని తెలిపారు. 1969లో తెలంగాణ ఉద్యమానికి ఇక్కడే పునాదిరాయి పడిందని గుర్తు చేశారు. ఎడ్యుకేషన్‌, ఇరిగేషన్‌లకు తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రాధాన్యమిచ్చి భారతావనిని ప్రపంచ చిత్రపటంలో నిలబెట్టారని, దేశంలో ఆకలి కేకలను తీర్చేందుకు కృషి చేశారని సీఎం రేవంత్‌ అన్నారు. నేడు దేశంలో అత్యధిక ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసి ప్రతి వ్యక్తికీ అన్నం పెడుతున్న ఘనత తెలంగాణకే దక్కిందని తెలిపారు. భాక్రానంగల్‌ నుంచి నాగార్జునసాగర్‌ వరకు, శ్రీశైలం నుంచి శ్రీరాంసాగర్‌ వరకు ప్రాజెక్టులన్నీ నాటి ప్రధాని నెహ్రూ హయాంలో ప్రారంభమైనవేనన్నారు. ఆనాడే అత్యధిక యూనివర్సిటీలను నెహ్రూ ప్రారంభించారని, తమ ప్రభుత్వం అదే స్ఫూర్తితో ముందుకెళుతోందని చెప్పారు. ప్రపంచంలోని ఖనిజ సంపదపై పరిశోధనలు జరగాలని, సింగరేణి లాంటి సంస్థలను పెంపొందించుకునేందుకు కొత్తగూడెంలో ఈ యూనివర్సిటీ స్థాపించామని అన్నారు. కృష్ణా, గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు తరలించి ఇక్కడ పంటలు పండించి సిరులు కురిపించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అందుకే ఈ ప్రాంత ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అనేక ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి, అవినీతికి గురయ్యాయని ఆరోపించారు. కేసీఆర్‌ ఇంట్లో కనకవర్షం కురిసిందే తప్ప.. ఖమ్మం జిల్లాకు నీళ్లు పారలేదని అన్నారు.


revanth-new.jpg

ఆయువుపట్టు లాంటి శాఖలన్నీ ఆ ముగ్గురి వద్దే..

పాలనకు ఆయువుపట్టు అయిన శాఖలన్నీ ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల వద్దనే ఉన్నాయని సీఎం రేవంత్‌ తెలిపారు. ఆ ముగ్గురు అనుకుంటే ప్రభుత్వంలో జరగనిదేమీ ఉండదన్నారు. ప్రజలు పదేళ్లు తమకు అండగా ఉంటే... రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో నిలబెడతామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, ఎంపీలు రఘురాంరెడ్డి, బలరాం నాయక్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మంగళవారం పీసీసీ సమావేశం జరగడంతో.. కొత్తగూడేనికి సీఎం రాక ఆలస్యమైంది. దీంతో యూనివర్సిటీ ప్రారంభోత్సవం, బహిరంగ సభా కార్యక్రమాలను చకచకా కానిచ్చేశారు. సాయంత్రం 4.50 గంటలకు సీఎం కొత్తగూడెం చేరుకోగా.. తిరిగి 5.46 గంటలకే వెళ్లిపోయారు. కేవలం 12 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు.

నేడు హుస్నాబాద్‌కు సీఎం

సీఎం రేవంత్‌ బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు రానున్నారు. పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ సభాస్థలిలోనే దాదాపు రూ.262.68 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సీఎం సభ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సీఎంగా రేవంత్‌రెడ్డి తొలిసారి హుస్నాబాద్‌కు వస్తుండటంతో నియోజకవర్గం నుంచి ప్రజలు ఈ సభకు తరలివస్తారని భావిస్తున్నారు.

Updated Date - Dec 03 , 2025 | 06:51 AM