CM Revanth Reddy: ఈసారి సెంచరీ!
ABN , Publish Date - Jul 05 , 2025 | 03:26 AM
మూడేళ్ల ముందే హామీ ఇస్తున్నా..! రాబోయే ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే సీట్లను గెలుస్తాం. ఇక్కడ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. వంద సీట్లలో ఒక్కటి తగ్గినా నాదే బాధ్యత.

వంద సీట్లు గెలుస్తాం.. మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం.. ఒక్కటి తగ్గినా నాదే బాధ్యత
మూడేళ్ల ముందే నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నా
తెలంగాణ నుంచి ఈసారి 15 మంది ఎంపీల్ని ఢిల్లీకి పంపుతాం
పెరగనున్న ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు.. కొత్తగా 80 మందికి టికెట్లు
రిజర్వేషన్లతో 60 మంది వరకూ మహిళలు అసెంబ్లీలోకి
స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు బాధ్యత నాదే
ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం.. ఒక్కటి తగ్గినా
ఎల్బీ స్టేడియంలో కాళ్ల ముందు క్షమాపణ చెప్పి బయటకు వెళతా
విష ప్రచారం చేస్తున్న బీఆర్‌ఎ్‌సపై సోషల్ మీడియాలో యుద్ధం
సామాజిక న్యాయ భేరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ‘‘మూడేళ్ల ముందే హామీ ఇస్తున్నా..! రాబోయే ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే సీట్లను గెలుస్తాం. ఇక్కడ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. వంద సీట్లలో ఒక్కటి తగ్గినా నాదే బాధ్యత. తెలంగాణ నుంచి 15 మంది ఎంపీలను ఢిల్లీకి పంపుతాం. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు మావంతు సహకారం అందిస్తాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిన పూనారు. ఈసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని 2023 సెప్టెంబరు 17న రంగారెడ్డి జిల్లాలో మాట ఇచ్చామని, ఇచ్చినట్లే.. డిసెంబరులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ సామాజిక న్యాయ సమర భేరి సభలో 31 నిమిషాలపాటు ఆయన మాట్లాడారు. ‘‘చాలామంది నాయకులకు ఒక భయం ఉంది. తమ నియోజకవర్గానికి ఎవరో ఎమ్మెల్యేగా వచ్చారని, భవిష్యత్‌లో తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన చాలామంది నాయకులకు ఉంది. అయితే, వచ్చే ఎన్నికలనాటికి సీట్లు పెరగబోతున్నాయి. 119 నియోజకవర్గాలు 153 కాబోతున్నాయి. పార్లమెంట్ సీట్లు పెరగనున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ తరపున 60-70 మందే ఎమ్మెల్యేలున్నారు. రాబోయే రోజుల్లో కొత్తగా మరో 80 మందికి టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. యువతకు మాట ఇవ్వదల్చుకున్నా. ప్రజల్లో ఉండండి.. కొట్లాడండి. ప్రజాసేవ చేయండి. మీరు అడగాల్సిన పనిలేదు. ఢిల్లీకి వెళ్లాల్సిన పనిలేదు. మీ టికెట్ మీ ఇంటికే వస్తుంది. దారి ఖర్చులిచ్చి మరీ మిమ్మల్ని గెలిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మహిళా రిజర్వేషన్ రాబోతోంది. 60 మంది దాకా మహిళలు అసెంబ్లీలో ఉండబోతున్నారు. వారిలో ఐదారుగురు మంత్రులవుతారు. ప్రజల్లో ఉండే ఆడబిడ్డలను ప్రోత్సహించి టిక్కెట్లిచ్చి గెలిపించుకునే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది’’ అని అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీల ఎన్నికలు అయిపోయాయని, ప్రాణసమానులైన కార్యకర్తల ఎన్నికలు ఉన్నాయని, వాటిలో మిమ్మల్ని గెలిపించే బాఽధ్యత తనదని, సోదరుడిగా మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నూటికి నూరు శాతం కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని, అన్ని పదవులూ భర్తీ చేసే వరకూ విశ్రమించేది లేదని చెప్పారు. కార్యకర్తలను గెలిపించుకునే పూచీ తనదని అన్నారు.
ముణ్ణాళ్ల ముచ్చటేనన్నారు
మూడు రంగుల జెండా పట్టుకుని కల్వకుంట్ల గడీని బద్దలు కొట్టామని, ఆ జెండాను గుండెల్లో నింపుకొని ప్రతి తలుపును తట్టి విజయం సాధించామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ‘‘కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైనప్పుడు ఈ ప్రభుత్వం మూణ్ణాళ్ల ముచ్చటే అన్నారు. మూన్నాళ్లు అయ్యాక.. సర్కారు ఉంటుంది కానీ సంక్షేమం అమలు చేయదని ఎత్తి పొడిచారు. పథకాలను అమలు చేసిన తర్వాత.. కాంగ్రెస్ నేతలు కలిసి ఉండరు. కలహించుకుంటారని అపోహలు సృష్టించారు. ఈరోజు కలిసి ఉండటమే కాదు.. కలిసికట్టుగా ఉంటూ, నవ్విన వారి ముందు తలెత్తుకొని ఉంటున్నాం’’ అని సీఎం గర్వంగా చెప్పుకొచ్చారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని అమలు చేస్తూ దేశానికే మోడల్‌గా తెలంగాణను ఆవిష్కరించామన్నారు. పాదయాత్రలో రాహుల్ హామీ ఇచ్చినట్లు ఏడాదిలోనే కుల, జన గణన పూర్తి చేశామని, సామాజిక న్యాయంలో భాగంగా ఎస్సీ వర్గీకరణ చేశామని వివరించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ, అడుగంటిన రాజ్యాంగ వ్యవస్థలను పునరుద్ధరించుకుంటూ, ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ తెలంగాణను అభివృద్ధి పథంవైపునకు తీసుకువెళ్తున్నామన్నారు. కష్టాలు, ఒడిదొడుకులు వచ్చినా నిటారుగా నిలబడి ముందుకెళ్తున్నామన్నారు. ‘‘18 మాసాల్లో రైతు రుణమాఫీ, భరోసా వంటి పలు సంక్షేమ పథకాల కోసం రూ.1.04 లక్షల కోట్లను ఖర్చు పెట్టిన ఘనత కాంగ్రె్‌సదే. నాడు వరి వేస్తే ధాన్యం కొనుగోలు కేంద్రాలను బంద్ చేశారు. వరి వేస్తే ఉరి వేసుకోవడమేనని, తనకు సంబంధం లేదని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ వచ్చాక.. చివరి గింజ వరకూ కొన్నాం. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి మాట నిలుపుకొన్నాం. రైతు భరోసా విషయంలో కొందరు గోతి కాడ నక్కలా ఎదురుచూశారు. ప్రభుత్వం విఫలమవుతుందని భావించారు. కానీ, 70 లక్షల మంది రైతులకు రూ.9 వేల కోట్లను 9 రోజుల్లో వేశాం. సాగు దండగ కాదు.. పండగని, మాది రైతు రాజ్యమని నిరూపిస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రతి గుండెను తడుతూ ప్రజాపాలన కొనసాగిస్తున్నామన్నారు.
రైతుకు అండగా ఉన్నదెవరో తేల్చుకుందామా?
‘‘రైతురాజ్యం ఎవరు తెచ్చారో అసెంబ్లీలో అయినా.. పార్లమెంటులో అయినా చర్చ పెడదాం. రైతులకు అండగా నిలబడింది ఎవరో తేల్చుకుందాం. చర్చకు కేసీఆర్, కేటీఆర్, కిషన్‌రెడ్డి, మోదీ ఎవరు వస్తారో చెప్పాలి. కాంగ్రెస్ కార్యకర్తలతో నేను వస్తాను’’ అని సీఎం రేవంత్ సవాల్ విసిరారు. ఇందిరాగాంధీ అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించి.. ఇందిరమ్మ నాడు తెచ్చిన సంక్షేమం, అభివృద్ధి పేదవారి జీవితంలో వెలుగులు నింపాయని చెప్పారు. అందుకే ప్రతి సంక్షేమ పథకానికి ఇందిరమ్మ పేరు పెడుతున్నామన్నారు. ‘‘హైదరాబాద్ లో పేదవారికి రూ.5 భోజనం పెడదామని ఇందిరమ్మ పేరుతో క్యాంటీన్స్ పెడితే ఈ దద్దమ్మలు ఆమె పేరు ఎలా పెడతారని ధర్నాలు చేశారు. ఒక్కొక్కర్ని బట్టలిప్పదీసి కొడితే తప్ప.. ఇందిరమ్మ గొప్పతనం వారికి అర్థం కాదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణమే కాకుండా, వారికి వేయి బస్సులు కొనిచ్చి యజమానులను చేశామని, ఒకనాడు పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్స్ అంటే అదానీ, అంబానీలకే పరిమితమని, మన ఆడబిడ్డలకు పెట్రోల్ బంకులిచ్చి వ్యాపారం చేయిస్తున్నామని, అమ్మ ఆదర్శ పాఠశాలల పెత్తనం మహిళలకే ఇచ్చామని గుర్తు చేశారు. స్కూల్ యూనిఫామ్‌లు కుట్టే బాధ్యతను బీఆర్‌ఎస్ హయాంలో ప్రైవేటు వాళ్లకు ఇస్తే తాము ఆడబిడ్డలకు అప్పగించామని, హాస్టల్‌లో బియ్యం, ఇతరాత్రా కాంట్రాక్టులూ వారికే ఇచ్చామని, ఇందిరమ్మ రాజ్యం కాబట్టే ఆడబిడ్డలను ఆర్థికంగా ఎదగనిచ్చామని చెప్పారు. కోటీశ్వరులను చేసే బాధ్యతను రేవంత్ అన్న తీసుకుంటాడని, ప్రతి మహిళా స్వయం సహాయక సంఘాల్లో చేరాలని పిలుపునిచ్చారు.
దుబాయ్‌లో ఆఫీసులు పెట్టి విష ప్రచారం
కాంగ్రెస్ అఽధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో విజయాలు సాఽధించినా, తాము పనిలో పడి ప్రచారం చేసుకోవడం మర్చిపోయామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేసిందంటే ఆశ్చర్యంతో నోరు తెరిచి చూస్తున్నారని, మరి, వీటిని ఎందుకు ప్రచారం చేసుకోలేకపోతున్నామని క్యాడర్‌ను ప్రశ్నించారు. కానీ, వాళ్లు (బీఆర్‌ఎస్) కిరాయి మనుషులను పెట్టి, దుబాయ్‌లో ఆఫీసులు పెట్టి విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి వచ్చిన వేలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తలే బ్రాండ్ అంబాసిడర్లని, ప్రచార కార్యకర్తలుగా మారాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారి, సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించాలని అన్నారు. కాంగ్రెస్ చేసే యుద్ధంలో కల్వకుంట్ల గడీ తునకలు అయిపోవాలని పిలుపునిచ్చారు.
ఒకటి తగ్గినా..
‘‘కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. ఇదే ఎల్బీ స్టేడియం సాక్షిగా తొలి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలిచ్చాం. కేసీఆర్, కిషన్ రెడ్డి, నరేంద్ర మోదీకి సవాల్ విసురుతున్నా. మీకు దమ్ముంటే, ధైర్యముంటే, చిత్తశుద్ధి ఉంటే రండి. 60 వేల మందిని ఎల్బీ స్టేడియానికి తీసుకువచ్చి తలలు లెక్కపెట్టిస్తా. ఒక్కటి తగ్గినా మీ కాళ్ల ముందు క్షమాపణ చెప్పి బయటకు వెళ్తా. ఇది మా నిజాయితీ’’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి విపక్షాలకు సవాల్ విసిరారు. ప్రైవేటు కంపెనీలు, కార్పొరేట్ కంపెనీల్లో లక్ష ఉద్యోగాలిచ్చామని, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని వివరించారు. తెలంగాణ ఉద్యమం అంటేనే నిరుద్యోగుల పోరాటమని, కేసీఆర్ మాత్రం ఉద్యోగాలివ్వకుండా గొర్రెలు, బర్రెలు పంచిపెట్టి, ఆయన, ఆయన కొడుకు రాజ్యాలు ఏలడం న్యాయమా? అని ప్రశ్నించారు. వందలాదిమంది బలిదానాలతో తెలంగాణ తెచ్చుకున్నది గొర్రెలు, బర్రెలు, చేపల కోసమా అని కేసీఆర్‌ను నిలదీశారు. ‘‘ఉన్న పాఠశాలలు సరిపోవని రూ.20 వేల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రారంభించుకున్నాం. ఏటా 1.15 లక్షల మంది ఇంజనీరింగ్ పాసైనా నైపుణ్యం లేక జాబ్స్ రావడం లేదు. అందుకే వారికి శిక్షణ ఇచ్చేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించాం. స్కిల్స్ నేర్పించి, వారికి ఉపాధి కల్పించబోతున్నాం. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్స్ సాధించేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభించుకున్నాం. 2034 ఒలింపిక్స్‌లో తెలంగాణ నుంచి బంగారు పతకం తెచ్చే బాఽధ్యత తెలంగాణ యువత తీసుకుంటుందని ప్రధాని మోదీకి చెబుతున్నా’’ అని సీఎం అన్నారు.
ఇవి కూడా చదవండి
స్టాక్ మార్కెట్‌లో భారీ కుంభకోణం..జేన్ స్ట్రీట్‌పై సెబీ చర్యలు
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి