Share News

CM Revanth Reddy: కోటాపై పోరాడుదాం

ABN , Publish Date - Jul 25 , 2025 | 04:17 AM

తెలంగాణలో తమ ప్రభుత్వం ఇంటింటికీ తిరిగి ప్రజల స్వీయ ధ్రువీకరణ పత్రంతో సేకరించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల (ఎస్‌ఈఈఈపీసీ) సర్వే దేశానికే ఆదర్శం అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

CM Revanth Reddy: కోటాపై పోరాడుదాం

  • బీసీ బిల్లుల ఆమోదానికి ఎంపీలుగా మీరు పార్లమెంటులో కొట్లాడండి

  • నేను, మా ఎమ్మెల్యేలు కలిసి జంతర్‌ మంతర్‌ వద్ద పోరాడుతాం

  • ఇది ‘రేర్‌’ సర్వే.. ‘రేర్‌’ అంటే త్వరలో చెబుతా

  • కుల సర్వే, బీసీ బిల్లుల ఆమోదంపై సోనియా లేఖ.. నాకు నోబెల్‌, ఆస్కార్‌తో సమానం

  • మోదీ కన్వర్టెడ్‌ బీసీ.. బీజేపీ బీసీ వ్యతిరేకి

  • కాంగ్రెస్‌ ఎంపీలకు రేవంత్‌ ప్రజెంటేషన్‌

  • తెలంగాణ సమగ్ర కుల సర్వే డేటా మొత్తం 88 కోట్ల పేజీలు వచ్చిందని వెల్లడి

న్యూఢిల్లీ, జూలై 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో తమ ప్రభుత్వం ఇంటింటికీ తిరిగి ప్రజల స్వీయ ధ్రువీకరణ పత్రంతో సేకరించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల (ఎస్‌ఈఈఈపీసీ) సర్వే దేశానికే ఆదర్శం అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. సమగ్ర వివరాలతో క్షుణ్నంగా చేపట్టిన ఈ సర్వేకు సంబంధించి.. తమ వద్ద 88 కోట్ల పేజీల డేటా ఉందని తెలిపారు. ఈ సర్వేపై కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలకు ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ గాంధీ కుల గణనకు హామీ ఇచ్చారని గుర్తుచేసిన ఆయన.. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఫిబ్రవరి 4న సర్వేను ప్రారంభించి 2025, ఫిబ్రవరి 4నాటికి పూర్తి చేశామని తెలిపారు. అందుకే, ఫిబ్రవరి 4ను సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకొంటున్నామని వెల్లడించారు. కుల గణనకు సంబంధించి తమ ప్రభుత్వం 56 ప్రశ్నలతో ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తి వద్దకు వెళ్లి సమాచారం సేకరించిందని.. సర్వే సమయంలో అందుబాటులో లేనివారికి ఆన్‌లైన్‌ ద్వారా, టోల్‌ ఫ్రీ ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించామని వివరించారు. సర్వే ప్రకారం తెలంగాణలో బీసీలు 56.36 శాతం ఉన్నారని తెలిపారు. సర్వేలో 3.9 శాతం మంది తమకు కులం లేదని చెప్పారని.. ఇది తెలంగాణలో సరికొత్త పరిణామమని రేవంత్‌ అన్నారు. సర్వే ప్రకారం తాము స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లు, విద్యా, ఉపాధి అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరో బిల్లు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని గుర్తుచేశారు. బీజేపీ తొలి నుంచి బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని రేవంత్‌ ఈ సందర్భంగా విమర్శించారు. ప్రధాని మోదీ లీగల్లీ కన్వెర్టెడ్‌ బీసీ అని పునరుద్ఘాటించారు.


రాహుల్‌ వల్లే..

తాము జనగణనతోపాటు కుల గణన చేపట్టబోమని రాజ్‌నాథ్‌ సింగ్‌ పార్లమెంట్లో చెప్పారని సీఎం రేవంత్‌ గుర్తు చేశారు. రైతులకు సంబంధించిన నల్లచట్టాల విషయంలో రాహుల్‌ గాంధీ గళం విప్పిన తర్వాత ప్రధాని మోదీ వాటిని రద్దు చేసి క్షమాపణ చేశారని.. అదే కోవలో ఇప్పుడు రాహుల్‌ గాంధీ ఇచ్చిన మాట మేరకు తెలంగాణ సర్కారు కులగణన చేపట్టిన తర్వాత కేంద్రం కూడా కులగణనకు అంగీకరించిందని.. ఇదంతా రాహుల్‌ ఘనతేనని ఆయన పేర్కొన్నారు. తాము చేపట్టిన సర్వే దేశానికే ఆదర్శం అని... ఇది తెలంగాణ మోడల్‌ అని, తాను దీనిని రేర్‌ (ఆర్‌ఏఆర్‌ఈ) మోడల్‌ అంటున్నానని తెలిపారు. రేర్‌ అంటే ఏమిటో త్వరలో వివరిస్తానన్నారు. తెలంగాణ శాసనసభలో తాము ఆమోదించి కేంద్రానికి పంపిన బీసీ రిజర్వేషన్ల బిల్లులను.. లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదింపజేసేందుకు రాహుల్‌ గాంధీ, ఖర్గే నాయకత్వంలో పోరాడాలని ఎంపీలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. దీనిపై తాను తన మంత్రులు, శాసనసభ్యులతో కలిసి జంతర్‌ మంతర్‌లో పోరాడతానని, ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడాలని కోరారు. కుల సర్వేను కొందరు రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. కుల సర్వే, బీసీ బిల్లుల ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూ సోనియా గాంధీ స్వహస్తాలతో లేఖ రాశారని.. ఆ లేఖ తనకు నోబెల్‌, ఆస్కార్‌, జీవన సాఫల్య పురస్కారం (లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌) అని చెబుతూ రేవంత్‌ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఈ స్థానంలో ఉన్నా లేకున్నా ఆ లేఖ తనకు ప్రత్యేకంగా మిగిలిపోతుందని సీఎం పేర్కొన్నారు. కాగా.. ఈ సర్వేపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏఐసీసీ కార్యాలయంలో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చి ప్రసంగించారు. పీసీసీ అధ్యక్షుడు కార్యక్రమ సంధానకర్తగా వ్యవహరించారు. సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అగ్ర నేతలు దిగ్విజయ్‌ సింగ్‌, జైరాం రమేశ్‌, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, కాంగ్రెస్‌ ఎంపీలు, స్వతంత్ర నిపుణుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తొలుత.. గురువారం ఉదయమే.. సీఎం రేవంత్‌ బృందం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఖర్గే నివాసంలో భేటీ అయ్యారు. సర్వే ప్రక్రియ, అసెంబ్లీలో బిల్లుల ఆమో దం, పార్లమెంట్‌లో వాటి ఆమోదంపై చర్చించారు.


పొరపాట్లు లేకుండా..

రాహుల్‌ గాంధీ ఇచ్చిన హామీ మేరకు.. తెలంగాణలో చేపట్టిన కుల గణన ఒక చరిత్ర అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ మొత్తాన్ని బ్లాక్‌లుగా విభజించి.. ఎలాంటి పొరపాట్లూ లేకుండా సర్వే నిర్వహించామని అన్నారు. ఇక.. ఈ కులగణనకు చట్టపరంగా ఎటువంటి చిక్కులు ఏర్పడ్డా తట్టుకుని అంతిమంగా విజయం సాధిస్తామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే బీసీల సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ అంశాలపై కులగణన చేపట్టి ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ ఇచ్చిన హామీని అమలు చేయడం తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు. దీనిపై ఎవరైనా కోర్టు మెట్లెక్కినా అంతిమంగా విజయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని ధీమా వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రెండు బిల్లులను గవర్నర్‌ ఆమోదించి రాష్ట్రపతికి పంపినా నాలుగు నెలలుగా అవి పెండింగ్‌లో ఉండడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.


ప్రియాంక గాంధీతో రేవంత్‌ భేటీ

కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్‌ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. తెలంగాణ కుల సర్వే వివరాలను ఆమెకు అందించినట్టు తెలిపారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయ పదవుల్లో ఓబీసీలకు 42 శాతం కోటా కల్పించాలనే నిర్ణయాన్ని, సంకల్పాన్ని ప్రియాంక అభినందించారని వెల్లడించారు. ఓబీసీలకు పూర్తి న్యాయం కోసం జరిగే ఈ పోరాటంలో మద్దతుగా నిలుస్తానంటూ ఆమె హామీ ఇచ్చినట్టు చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే

మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఐటీ అధికారుల సోదాలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 04:17 AM