CM Revanth Reddy: రేపటి నుంచి భూ భారతి
ABN , Publish Date - Apr 13 , 2025 | 03:36 AM
భూభారతి లోగో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఎంత గొప్ప టెక్నాలజీ అయినా ప్రజలకు కనిపించదని, ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా లోగోను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా..
ప్రజల నుంచి విజ్ఞప్తుల స్వీకరణ, పరిశీలన
ఆరు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా అమలు
తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా లోగో
ఆరు నెలలపాటు ప్రతి రోజూ సమీక్ష
ప్రతి మండలంలో సదస్సులు నిర్వహించాలి
భూ భారతిపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
రేపు శిల్పకళా వేదికలో పోర్టల్ ప్రారంభం
అత్యంత పేదలు.. అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
కమిటీల అనుమతితోనే లబ్ధిదారుల ఎంపిక
అనర్హులు దక్కించుకుంటే రద్దు చేయాలి
ఇందిరమ్మ ఇళ్ల సమీక్షలో ముఖ్యమంత్రి
హైదరాబాద్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): భూభారతి లోగో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఎంత గొప్ప టెక్నాలజీ అయినా ప్రజలకు కనిపించదని, ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా లోగోను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భూపరిపాలనలో భాగంగా ఈ నెల 14న ‘భూభారతి చట్టం-2025’తో పాటు అమలు మార్గదర్శకాలను ప్రభుత్వం అమల్లోకి తేనుంది. ప్రజల నుంచి విజ్ఞప్తుల స్వీకరణ, పరిష్కార ప్రక్రియను మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. ఆ తర్వాత ఆరు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. భూ సమస్యల పరిష్కారం, లావాదేవీల సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉండేలా భూ భారతి పోర్టల్ ఉంటుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. శనివారం భూభారతి చట్టం-2025తోపాటు మార్గదర్శకాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు పది రకాల లోగోలు ప్రదర్శించగా.. సీఎం సున్నితంగా తిరస్కరించారు. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా లోగోకు శనివారం రాత్రికల్లా తుదిరూపు కల్పించి ఆదివారం తనకు అందజేయాలన్నారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. భూభారతిని ప్రారంభించడమే కాకుండా ఆర్నెల్లపాటు నిశితంగా గమనించాలని, రోజువారీ సమీక్ష చే సి, సంస్కరిస్తేనే భూభారతి ఫలాలు ప్రజలకు అందుతాయని అన్నారు. విజ్ఞప్తులను ఆన్‌లైన్‌లో కాకుండా నేరుగా మండల కార్యాలయాల్లో స్వీకరించడం, వాటిని ఏ విధంగా పరిష్కరించాలనే అంశాన్ని ప్రయోగాత్మకంగా మూడు మండలాల్లో అమలు చేయాలని నిర్దేశించారు.
భూభారతిపై ప్రజలకు అవగాహన కల్పించాలి..
భూభారతి చట్టంపై క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్లను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రతి మండలంలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా భూభారతి పోర్టల్ ఉండాలని అధికారులకు సూచించారు. పైలట్ ప్రాజెక్టులో ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు స్వీకరించి పోర్టల్‌ను మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రజలు, రైతులకు అర్థమయ్యేలా, సులభమైన భాషలో పోర్టల్ ఉండాలన్నారు. వెబ్‌సైట్‌తోపాటు యాప్‌ను పటిష్ఠంగా నిర్వహించాలని ఆదేశించారు. కాగా, రెండు గంటలకు పైగా జరిగిన సమీక్షలో భూభారతి కార్యాచరణ మార్గదర్శకాలపై ఏకాభిప్రాయం కుదిరింది. ఈ సమీక్షలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శులు వి.శేషాద్రి, చంద్రశేఖర్‌రెడ్డి, సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, రెవెన్యూ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్దప్రకాష్, సీసీఎల్‌ఏ కార్యదర్శి మంద మకరంద్, భూ చట్టాల న్యాయనిపుణుడు సునీల్ తదితరులు పాల్గొన్నారు. కాగా, భూభారతి చట్టాన్ని సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు శిల్పకళా వేదికలో ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు కొత్త చట్టం అమల్లోకి రానుంది. భూభారతి -2025 చట్టం, పోర్టల్ ప్రారంభ ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేకాధికారిని నియమించారు. ప్రముఖుల బందోబస్తు బాధ్యతలను సైబరాబాద్ కమిషనర్‌కు అప్పగించారు. ప్రొటోకాల్, ఇతర ఏర్పాట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు.
ఇందిరమ్మ ఇళ్లు అర్హులకే దక్కాలి: సీఎం
అత్యంత నిరుపేదలు, అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు దక్కాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గ్రామ స్థాయిలో లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలు జాగ్రత్త వహించాలన్నారు. ఇందిరమ్మ కమిటీ తయారు చేసిన జాబితాను మండల అధికారులతో కూడిన (తహసీల్దార్, ఎంపీడీవో, ఇంజనీర్) బృందం క్షేత్ర స్థాయికి వెళ్లి తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎవరైనా అనర్హులకు ఇళ్లు దక్కితే తక్షణమే దానిని ఇందిరమ్మ కమిటీకి తెలిపి.. ఆ స్థానంలో మరో అర్హునికి ఇల్లు మంజూరు చేయాలన్నారు. శనివారం ముఖ్యమంత్రి తన నివాసంలో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఎవరైనా దందాలు చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అనర్హులు ఎవరైనా ఇల్లు దక్కించుకొని నిర్మించుకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవడంతోపాటు వారు పొందిన మొత్తాన్ని వసూలు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇంటి లబ్థిదారుకు మంజూరైన ఇంటికి అతని సౌలభ్యం మేరకు అదనంగా 50 శాతం మేర నిర్మించుకునే అవకాశం కల్పించాలన్నారు. లబ్ధిదారుకు ఆర్థికపరమైన ఊరట కల్పించేందుకు సిమెంట్, స్టీల్ తక్కువ ధరలకు అందేలా చూడాలని సూచించారు.
ఇవి కూడా చదవండి...
Harassment Of Women: కోరిక తీర్చాలంటూ మహిళను ఎంతలా వేధించారంటే
Case On KTR: కేటీఆర్ ట్వీట్‌పై పోలీసుల రియాక్షన్
Read Latest Telangana News And Telugu News