CM Revanth Reddy: రేషన్‌కార్డు.. పేదల ఆత్మగౌరవ ప్రతీక
ABN , Publish Date - Jul 15 , 2025 | 03:41 AM
తెలంగాణలో ప్రభుత్వం అందించే రేషన్‌కార్డు కేవలం సరుకులు అందించే పత్రం మాత్రమే కాదని, పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఆకలి తీర్చే ఆయుధమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

5.61 లక్షల కుటుంబాలకు కొత్త కార్డులు.. 3.10 కోట్ల మందికి సన్నబియ్యం
దండగన్న సాగును పండగ చేశాం.. రైతుల ప్రతి ధాన్యపు గింజనూ కొన్నాం
మహిళలను ఆర్టీసీ బస్సుల యజమానులను చేశాం
ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లయ్యే నాటికి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలుచేసి తీరుతాం
ప్రాజెక్టుల నాణ్యతపై చర్చకు బీఆర్‌ఎస్ సిద్ధమా?.. 2034 దాకా కాంగ్రె్‌సదే అధికారం
సూర్యాపేట జిల్లాలో కొత్త రేషన్‌కార్డుల పంపిణీ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఇది తెలంగాణ చరిత్రలో నిలిచిన రోజు: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నల్లగొండ/సూర్యాపేట, జూలై 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ప్రభుత్వం అందించే రేషన్‌కార్డు కేవలం సరుకులు అందించే పత్రం మాత్రమే కాదని, పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఆకలి తీర్చే ఆయుధమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కానీ, గత పదేళ్ల పాలనలో బీఆర్‌ఎ్‌సకు ఏనాడూ పేదలకు రేషన్‌కార్డులు ఇవ్వాలని, సన్నబియ్యం అందించాలన్న ఆలోచన కూడా రాలేదని ఆరోపించారు. తాము మాత్రం రాష్ట్రంలో 26 లక్షల మందికి రేషన్‌కార్డులు ఇచ్చామని, 5.61 లక్షల కొత్త కార్డులు ఇస్తున్నామని తెలిపారు. 3.10 కోట్ల మందికి రేషన్‌ద్వారా సన్నబియ్యం అందించి వారి కడుపు నింపుతున్నామని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో బెల్టుషాపులు తెరిస్తే.. తాము రేషన్ షాపులు తెరుస్తున్నామని చెప్పారు. పేదలు సన్నబియ్యం అన్నం తింటుంటే.. బీఆర్‌ఎస్ నాయకులు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని విమర్శించారు. సోమవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పట్టణంలో కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. దండగ అన్న వ్యవసాయాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పండగ చేశామన్నారు. ధాన్యానికి మద్దతు ధర ఇవ్వడమే కాకుండా రూ.500 బోనస్ ఇచ్చామని, 25,55,965 మంది రైతులకు రూ.25 వేల కోట్లు వెచ్చించి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని తెలిపారు. తొమ్మిది రోజుల్లోనే 1.50 కోట్ల ఎకరాలకు, 70 లక్షల మంది రైతులకు రూ.9 వేల కోట్ల రైతుభరోసా అందించి మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. అంతేకాకుండా రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొన్నామని, దేశంలోనే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో 2.85 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి రికార్డు సృష్టించామని అన్నారు.
బస్సులకు యజమానులుగా ఆడబిడ్డలు..
రాష్ట్రంలో 65 లక్షల మంది ఆడబిడ్డలకు రెండు చీరలు అందించామని సీఎం రేవంత్ తెలిపారు. రూ.21 వేల కోట్ల బ్యాంక్ లింకేజీ ఇచ్చి వారి ఉపాధికి తోడ్పాటునందించామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించామని, ఈ పథకం కింద రూ.6500 కోట్లు ఖర్చవుతున్నా.. అది ఆడబిడ్డలపై పెట్టిన పెట్టుబడిగా చూస్తున్నామే తప్ప దానిని ఉచిత పథకంగా చూడడం లేదని చెప్పారు. 600 బస్సులకు ఆడబిడ్డలను యజమానులను చేశామని, వాటిని 1000 బస్సులకు పెంచుతున్నామని అన్నారు. బస్సులను ఆర్టీసీకి అద్దెకివ్వడం ద్వారా ఆడబిడ్డలకు ఆదాయం వస్తోందన్నారు. ఆడబిడ్డలే 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు తయారు చేసేలా వారికి ప్లాంట్లను అప్పజెప్పామని తెలిపారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగ అవకాశం కూడా ఇవ్వలేదని రేవంత్ ఆరోపించారు. తాము వచ్చాక ఇప్పటికే 59 వేల ఉద్యోగాలిచ్చామని, తమ ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయ్యేనాటికి లక్ష ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని ప్రకటించారు.
ప్రాజెక్టుల నాణ్యతపై చర్చకు సిద్ధమా!
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో వారివద్ద రూ.20 లక్షల కోట్లున్నా, లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టినా అది మూడేళ్లలో కూలేశ్వరం అయిందని సీఎం రేవంత్ ఆరోపించారు. ‘‘60, 70 ఏళ్ల క్రితం కాంగ్రెస్ కట్టిన నాగార్జునసాగర్, శ్రీశైలం, మూసీ, జూరాల, దేవాదుల, ఎస్‌ఆర్‌ఎస్పీ, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎలా ఉన్నాయో, మీరు కట్టిన కాళేశ్వరం ఎలా ఉందో చర్చకు సిద్ధమా!’’ అని సవాల్ చేశారు. బీఆర్‌ఎస్ నేతలను కాళేశ్వరం వద్ద ఉరితీసినా తప్పులేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 2034 వరకు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని, ఎవరేం చేసినా తెలంగాణలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్ జెండానే రెపరెపలాడుతుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.
దేశానికి ఆదర్శంగా నిలిచాం..
రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక ఎస్సీ వర్గీకరణ చేపట్టామని సీఎం రేవంత్ అన్నారు. దేశ చరిత్రలో వందేళ్ల తర్వాత జనగణనలో కులగణన చేపట్టి ఆదర్శంగా నిలిచామని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ వర్తింపజేసి తీరుతామని, బలహీనవర్గాల వారిని రాజ్యాధికారం వైపు నడిపించే పయనం ఆగదని ప్రకటించారు. ఈ సందర్భంగా సూర్యాపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. తమ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ఆయన చెబుతున్నారని, ఒక్కసారి అడ్డుకొని చూస్తే కాంగ్రెస్ కార్యకర్తల తడాఖా ఏంటో ఆయనకు తెలుస్తుందని అన్నారు. మూడు రోజుల్లో గోదావరి నీళ్లు తెస్తానంటున్న వ్యక్తి.. పదేళ్లు అఽధికారమిస్తే తుంగతుర్తికి గోదావరి నీళ్లు ఎందుకు తేలేదని ప్రశ్నించారు. ‘గోదావరి నీళ్లు తేవడమంటే.. మందులో సోడా పోసినట్లు కాదు’ అని సీఎం వ్యాఖ్యానించారు. ఆనాడు గంజికి కూడా కష్టమైన జగదీశ్‌రెడ్డికి నేడు బెంజి కారు ఎక్కడి నుంచి వచ్చిందో ప్రజలు ఆలోచించాలన్నారు. నల్లగొండ జిల్లాలో ఆయన ఓ గంజాయి మొక ్క అని, వచ్చే ఎన్నికల్లో ఈ మొక్కను పీకి పారేయలాల్సిన బాధ్యత జిల్లా ప్రజలపై ఉందని అన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని, ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలనే గెలిపించి ఆశీర్వదించాలని కోరారు.
చరిత్రలో నిలిచిపోయే రోజు..
‘‘రాష్ట్రంలో ఈరోజు 5.10 లక్షల మందికి కొత్త రేషన్‌కార్డులు, 3.10 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఈరోజు తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రోజు’’ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదని, మునుగోడు, హుజూరాబాద్ వంటి ఉప ఎన్నికల సమయంలో కొందరికి నామమాత్రంగా కార్డులిచ్చారని విమర్శించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రూ.12 వేల కోట్లతో ప్రతి గ్రామానికీ బీటీ రోడ్డు వేసేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపారు. కాగా, కొత్త రేషన్‌కార్డుల పంపిణీతో పేదల కళ్లలో ఆనందం కనిపిస్తోందని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమశాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. అంతకుముందు రూ.39.50 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులు మంత్రులతో కలిసి సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో శాసనసభ స్పీకర్ ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం సభ సక్సె్‌సతో కాంగ్రెస్‌లో ఆనందం
సీఎం రేవంత్‌రెడ్డి సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నేతల్లో ఆనందం వ్యక్తమైంది. ఈ సభకు తుంగతుర్తి, సూర్యాపేట, హుజూర్‌నగర్ నియోజకవర్గాలతోపాటు వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున జనం తరలివచ్చారు. మహిళలు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లో తరలి రావడంతో సీఎం తన ప్రసంగంలో సైతం మహిళలనుద్దేశించి ఎక్కువ సమయం మాట్లాడారు. ఎమ్మెల్యే మందుల సామేలును సీఎం రేవంత్‌రెడ్డి ప్రశంసించిన ప్పుడు జనం ఈలలు వేశారు.
పేదల సుదీర్ఘ నిరీక్షణకు తెర: సీఎం రేవంత్
హైదరాబాద్: ‘‘రాష్ట్రంలో పేదల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో గ్రామీణ ప్రాంతాల్లోని రేషన్ దుకాణాలు సందడిగా మారాయి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ‘ఎక్స్’లో పేర్కొన్నారు. కొత్త కార్డులు పొందిన ప్రతి లబ్ధిదారుడికి ఆరు కిలోల చొప్పున ఉచిత సన్నబియ్యం పంపిణీ చేస్తామని, ఇది పేదల సంక్షేమం పట్ల తమ వజ్ర సంకల్పమని తెలిపారు. గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది పేద కుటుంబాల ఆశలు నేడు ఫలించబోతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. కాగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. ఇందుకోసం 2047 విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నామని, అందులో సినిమా రంగానికి ఒక ప్రత్యేక చాప్టర్ ఉంటుందని చెప్పారు. సోమవారం రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించిన ‘శ్రీమద్భాగవతం పార్ట్-1’ ఫిల్మ్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మల్లు రవి పుట్టినరోజు విందులో సీఎం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి నివాసానికి వెళ్లారు. పుట్టినరోజు సందర్భంగా సోమవారం రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఎంపీ రవి ఏర్పాటుచేసిన విందుకు సీఎం హాజరయ్యారు. అంతకుముందే తన పుట్టినరోజు సందర్భంగా మల్లు రవి సీఎం నివాసానికి వెళ్లి రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. విందుకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, పలువురు మంత్రులతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి
నీరు తేవడమంటే.. గ్లాస్‌లో సోడా పోసినట్లు కాదు '
తిరుపతి రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం.. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చెలరేగిన మంటలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి