Share News

CM Revanth Reddy: 25 నుంచి రేషన్‌కార్డులు

ABN , Publish Date - Jul 22 , 2025 | 04:17 AM

రాష్ట్రంలో రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు నిర్వహించనున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 15 రోజుల పాటు మండలాల వారీగా రేషన్‌కార్డుల పంపిణీ చేపట్టాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

CM Revanth Reddy: 25 నుంచి రేషన్‌కార్డులు

  • ఆగస్టు 10 వరకు మండలాల వారీగా పంపిణీ

  • జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు పాల్గొనాలి

  • మనకు రైతులే ముఖ్యం.. వారికంటే ఎవరూ ఎక్కువకాదు

  • అన్నదాతలకు నష్టం జరిగే పని ఎవరు చేసినా ఉపేక్షించం

  • ఎరువుల లభ్యతను ఎప్పటికప్పుడు రైతులకు తెలపాలి

  • కలెక్టర్లు ఉదయం 7 గంటలకే ఫీల్డ్‌లో ఉండాలి

  • ఏ రోజు ఏం చేశారనే వివరాలు నాకు పంపాలి

  • వాతావరణ వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలపాలి

  • కలెక్టర్లకు అత్యవసర ఖర్చుల కింద వారి ఖాతాలో కోటి

  • కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

  • బీసీ రిజర్వేషన్లకు నమూనాగా తెలంగాణ!

  • దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్న ఏఐసీసీ

  • 24న ఢిల్లీకి రేవంత్‌రెడ్డి.. రాహుల్‌గాంధీ, ఖర్గేతో భేటీ

హైదరాబాద్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు నిర్వహించనున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 15 రోజుల పాటు మండలాల వారీగా రేషన్‌కార్డుల పంపిణీ చేపట్టాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక ఎమ్యెల్యేల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాలకు జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. ప్రభుత్వానికి రైతులే ప్రాధాన్యమని, వారి కంటే ఎవరూ ఎక్కువ కాదని స్పష్టం చేశారు. అన్నదాతలకు కష్టం, నష్టం జరిగే పని ఎవరు చేసినా ఉపేక్షించేదని లేదని హెచ్చరించారు. పంటల సాగుకు తగ్గట్టుగా ఎరువులను అందుబాటులోకి తీసుకురావాలని, ఎరువుల లభ్యత వివరాలను ప్రజలకు తెలియజేసేలా ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎరువుల అంశంపై రైతులు ఫిర్యాదు చేసేందుకు వీలుగా టోల్‌ ఫ్రీ నంబరుతో బోర్డులను బస్‌స్టా్‌పలు, జనం తిరిగే ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలన్నారు. వానాకాలం సన్నద్ధత, వ్యవసాయం, నీటి పారుదల, సీజనల్‌ వ్యాధులు, విపత్తు నిర్వహణ, రేషన్‌కార్డుల పంపిణీ అంశాలపై సోమవారం సాయంత్రం సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాల కలెక్టర్లు ఉదయం 7 గంటలకే ఫీల్డ్‌కు వెళ్లాలన్నారు. ఏ రోజు ఏ కలెక్టర్‌ ఏం చేస్తున్నారనే విషయాలను తనకు తెలియజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి రామకృష్ణారావును ఆదేశించారు. వానాకాలంలో వరదలు, అంటువ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షంతో వచ్చే నీటిని ఒడిసిపట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వాతావరణ వివరాలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. అవసరమైతే ఒక వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకుని, రాష్ట్ర స్థాయి అధికారులతో, వాతావరణ శాఖ అధికారులతో చర్చించాలని, కనీసం 3గంటల ముందుగా ప్రజలకు వాతావరణం, వర్షం వివరాలను తెలియజేయాలన్నారు. తద్వారా ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూసే అవకాశం ఉంటుందన్నారు.


నిరంతర ప్రక్రియగా రేషన్‌కార్డులు..

రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ప్రభుత్వం రేషన్‌కార్డులు ఇస్తుందని, ఇది నిరంతర ప్రక్రియ అని సీఎం రేవంత్‌ అన్నారు. 7లక్షల మందికి కొత్త కార్డులు ఇచ్చామని, ప్రస్తుతం రాష్ట్రంలో 96,95,299 కార్డులున్నాయని, దాదాపు 3.12 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. సన్నబియ్యం పంపిణీతో రేషన్‌కార్డుకు విలువ పెరిగిందన్నారు. రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు.. ఆయా జిల్లాలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో ఒక మండలంలో కావాలని సూచించారు. పూర్తి స్థాయిలో డిజిటల్‌ కార్డు ఇవ్వడానికి సమయం పడుతుందని, అందుకే ముద్రించిన కార్డులు ఇస్తున్నామని తెలిపారు. ఇక వర్షాలు, అంటువ్యాధులు, వ్యవసాయం, రేషన్‌కార్డులు, నీటిపారుదల విషయాల్లో ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు కూడా ఆయా జిల్లాల సమీక్షల్లో ప్రణాళికలు తయారు చేసుకుని కలెక్టర్లకు సూచనలివ్వాలని సీఎం అన్నారు. జాయింట్‌ కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్లు, లేదా జిల్లా స్థాయి అధికారులకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బాధ్యత అప్పగించాలన్నారు.


ఎరువుల దారి మళ్లింపుపై నిఘా పెట్టండి..

రాష్ట్రంలో 20-25 శాతం ఎరువులు వ్యవసాయేతర అవసరాలకు మళ్లుతున్నట్టు గుర్తించామని కేంద్రమంత్రి జేపీ నడ్డా చెప్పిన విషయాన్ని సీఎం రేవంత్‌ ప్రస్తావించారు. ముఖ్యంగా డీజిల్‌ ద్వారా వచ్చే పొగను తగ్గించడానికి, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారని చెప్పినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి చెప్పేవరకు కూడా ఇది తన దృష్టికి రాలేదన్నారు. దీనిపై కలెక్టర్లు ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. అవసరమైతే మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో కూడా పోలీసులను అప్రమత్తం చేయాలన్నారు. వ్యాపారాలకు కొనుగోలు చేయాల్సిన కమర్షియల్‌ విధానంలో కాకుండా.. రాయితీలో వ్యవసాయానికి అందించే యూరియాను దారిమళ్లించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఏ స్థాయి వారైనా సరే కేసులు నమోదు చేయాలని, ఈ విషయంలో ఎవరినీ వదలవద్దని అన్నారు. ఎరువుల దుకాణాల్లో స్టాక్‌ ఎంత ఉంది, ఆరోజు ఎంత ఇవ్వగలుగుతారనే వివరాలతో దుకాణాల బయట బోర్డు పెట్టించాలన్నారు. ప్రతి ఎరువుల దుకాణం వద్ద ఇద్దరు పోలీసులు, రెవెన్యూ సిబ్బందిని పెట్టాలని ఆదేశించారు. ఎరువులు కచ్చితంగా అందుతాయని, ప్రభుత్వం ఇస్తుందనే విషయాన్ని రైతులకుచెప్పాలని సూచించారు. కొందరు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, ఈ విషయంలో కలెక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


నీటిని ఒడిసి పట్టుకోవాలి..

గత ఏడాది వర్షాల సమయంలో వ్యవస్థలు సరిగా లేకపోవడంతో విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నామని సీఎం తెలిపారు. ఇకపై నీటిని ఒడిసి పట్టుకొని జాగ్రత్తగా వినియోగించుకునేలా చేసే బాధ్యత నీటిపారుదల శాఖ అధికారులతో పాటు కలెక్టర్లపైనా ఉందన్నారు. ప్రస్తుత సీజన్‌లో జూన్‌ 21 నుంచి జూలై 21 వరకు దాదాపు 21శాతం వర్షపాతం తక్కువ నమోదైందని, కానీ... మూడు రోజులుగా వర్షం బాగా కురుస్తోందని చెప్పారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలతో సమస్యలు తలెత్తుతున్నాయని, ట్రాఫిక్‌ జామ్‌లు, అంటువ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కోసం హైడ్రా, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 300 చొప్పున బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.


ఈసారి వానలు బాగానే కురిసే అవకాశం..

రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ ప్రాంతాల్లో వర్షం వస్తుందంటే కమిషనర్లతో సహా అందరూ క్షేత్రస్థాయిలో ఉండాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. దీనిని కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలన్నారు. ఈసారి వానలు బాగానే కురుస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. గోదావరి బేసిన్‌లో వరద కొంత తక్కువ గా ఉన్నా.. కృష్ణాలో బాగానే ఉందని చెప్పారు. తెలంగాణ రైతులు వరి ఉత్పత్తిలో పోటీ పడుతున్నారని, గతేడాది దేశంలోనే అత్యధికంగా 2.85 లక్షల మెటిక్ర్‌ టన్నుల వరి పండించి మొదటి స్థానంలో నిలిచామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి నిర్వహణ చేయాలన్నారు. వివిధ జిల్లాల్లో నాట్లు వేసే దగ్గర్నుంచి నీటి నిర్వహణ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎరువుల అవసరాన్ని కూడా అంచనా వేసుకుంటూ రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే వానలు, పిడుగు పడే సమయంలో ప్రజలు, మూగజీవాలు చనిపోకుండా ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు వర్షాలతో వచ్చే వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. వారికి రవాణా సౌకర్యాలు లేకపోవడం, వైద్యం సరిగా అందకపోవడం వల్లనే సమస్యలు వస్తున్నాయన్నారు. అందుకే పీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో డాక్టర్లంతా అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. పశువుల విషయంలో పశు సంవర్ధక శాఖను అప్రమత్తం చేయాలన్నారు.


కలెక్లర్లు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే..

జిల్లాల కలెక్టర్లు ఉదయం 7 గంటలకు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందేనని సమావేశంలో సీఎం సూచించారు. ఆస్పత్రులను విధిగా పర్యవేక్షించాలని, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. సీఎంవోలోని అధికారులకూ జిల్లాల బాధ్యతలు ఇస్తున్నామని, వీరు.. ఆయా కలెక్టర్లు ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు తనకు నివేదిక ఇవ్వాలని అన్నారు. దీనిని సీఎస్‌ పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆదివాసీలు, గిరిజనులు ఉండే అటవీ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో మందులు, డాక్టర్ల హాజరుపై దృష్టి సారించాలన్నారు. ఏదైనా అత్యవసరంగా ఖర్చు చేయాల్సి వస్తే.. కలెక్టర్లు తమ వద్ద ఉండే నిధులను వాడుకోవాలని, ఇంకా అవసరమైతే సీఎ్‌సకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అత్యవసర సమయాల్లో ఖర్చు చేసేందుకు కలెక్టర్లకు పరిస్థితిని బట్టి.. రూ.కోటి వరకు వారి ఖాతాల్లో నగదు ఉండేలా చూడాలని సీఎ్‌సను ఆదేశించారు. చిన్న చిన్న అవసరాలకు కలెక్టర్లు నిధుల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండకూడదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ వివరాలను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా తెలుసుకోవాలని, దానిని వెంటనే రైతులకు తెలియజేయాలని అన్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ఆస్తి, ప్రాణనష్టం సంభవించినా.. అధికారులపై చర్యలుంటాయని అన్నారు.


కనీసం పదేళ్లయినా సీఎంగా రేవంత్‌..! కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

హైదరాబాద్‌, జూలై 21(ఆంధ్రజ్యోతి): కనీసం పదేళ్లయినా రాష్ట్రానికి సీఎంగా రేవంత్‌రెడ్డి ఉంటారని, గరిష్ఠంగా ఎన్నేళ్లయినా ఉండొచ్చునని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వ్యాఖ్యానించారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో 31 జెడ్పీ సీట్లనూ కాంగ్రెస్‌ గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దొంగ సర్వేలతో అబద్ధాలు ప్రచారం చేస్తున్న హరీశ్‌రావు.. ముందుగా సొంత జిల్లా సిద్దిపేట జెడ్పీని గెలిపించుకోవాలన్నారు. చచ్చిన పాము లాంటి బీఆర్‌ఎ్‌సకు ఎన్ని లేపనాలు పూసినా ఏ ఉపయోగం లేదన్నారు. సానుభూతి కోసం కేటీఆర్‌ ఆడుతున్న డ్రామాలను ప్రజలు నమ్మబోరని చెప్పారు. బీసీలంతా ఐక్యంగా ఉండాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఇద్దరు బీసీలు కొట్టుకుంటే.. ఆ పదవి అగ్రవర్ణాలకు పోయిందన్న విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు. బీసీల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే.. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌కు సవరణ చేసి రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం సీలింగ్‌ను ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 22 , 2025 | 06:19 AM