CM Revanth Reddy: ఫోర్త్ సిటీకి మెట్రో అనుమతులు.. పరుగెత్తించండి
ABN , Publish Date - Apr 12 , 2025 | 03:33 AM
ఫోర్త్ (ఫ్యూచర్) సిటీ వరకు మెట్రో రైలును విస్తరించాలని, అందుకు అవసరమైన తుది ప్రతిపాదనలను తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

డీపీఆర్ సిద్ధం చేయండి
రెండో దశ అనుమతుల కోసం కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు
మూసీ పనుల్లో వేగం పెంచండి
మీర్ ఆలం ట్యాంక్‌పై
వంతెన అద్భుతంగా ఉండాలి
వందేళ్ల అవసరాలకు తగినట్లుగా డ్రై పోర్టు
ఆర్‌ఆర్‌ఆర్ పనులు వేగవంతం చేయాలి
అధికారులతో సమీక్షల్లో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): ఫోర్త్ (ఫ్యూచర్) సిటీ వరకు మెట్రో రైలును విస్తరించాలని, అందుకు అవసరమైన తుది ప్రతిపాదనలను తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మెట్రో రెండో దశ విస్తరణ పనులకు సంబంధించిన పురోగతిపై ఆరా తీశారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మెట్రో రైలు విస్తరణ పనులు, మూసీ పునరుజ్జీవం పనులు, జాతీయ రహదారుల నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) పురోగతిపై ముఖ్యమంత్రి ఆయా శాఖల అధికారులతో వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారు. మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉందని, ఇప్పటికే ఢిల్లీలో సంబంధిత అధికారులను కలిసి సంప్రదింపులు జరిపినట్లు రాష్ట్ర అధికారులు సీఎంకు వివరించారు. మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు(36.8కి.మీ), రాయదుర్గం-కోకాపేటనియోపోలీ్‌స(11.6కి.మీ), ఎంజీబీఎ్‌స-చాంద్రాయణగుట్ట(7.5కి.మీ), మియాపూర్- పటాన్‌చెరు(13.4కి.మీ), ఎల్‌బీనగర్-హయత్‌నగర్(7.1కి.మీ)వరకు మొత్తం 76.4కిలోమీటర్లకు రూ.24,269 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలను కేంద్రానికి పంపినట్లు తెలిపారు. కేంద్రం నుంచి అనుమతులు సాధించేందుకు నిరంతరం ప్రయత్నం చేయాలని, అనుమతులు రాగానే పనులు ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉండాలని సీఎం ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ డెవల్‌పమెంట్ యూనివర్సిటీ వరకు 40 కి.మీ మేర మెట్రో ప్రాజెక్టును విస్తరించాల్సి ఉందన్నారు. సుమారు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు నగర విస్తరణ అవసరాల దృష్ట్యా మెట్రోను మీర్‌ఖాన్‌పేట్ వరకు పొడిగించాలని, అందుకు అవసరమయ్యే అంచనాలతో డీపీఆర్ తయారు చేసి కేంద్రానికి పంపాలని ఆదేశించారు. హెచ్‌ఎండీఏ, ఫ్యూచర్ సిటీ డెవల్‌పమెంట్ అథారిటీ సంస్థలను మెట్రో విస్తరణలో భాగస్వాములు చేయాలని ఆయన సూచించారు.
‘మూసీ’కి అనుగుణంగా జూపార్కు అప్‌గ్రేడ్
మూసీ పునరుజ్జీవన పనుల్లో వేగం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. మీర్ ఆలం ట్యాంక్‌పై వంతెన నిర్మాణ పనులకు జూన్‌లో టెండర్లు పిలవాలని, ఈలోపు అందుకు అవసరమైన సర్వేలు చేపట్టాలని, నివేదికలు, ప్రతిపాదనలు, డిజైన్లతో డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ బాపూఘాట్‌లో నిర్మించతలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టు, మీర్ ఆలం ట్యాంక్‌పై నిర్మించనున్న వంతెన నమూనాలను పరిశీలించారు. మీర్ ఆలం ట్యాంక్‌పై నిర్మించే రెండున్నర కిలోమీటర్ల పొడవైన వంతెనను అద్భుతంగా నిర్మించాలని, సందర్శకులు, ప్రయాణికుల రక్షణకు అత్యంత ప్రాధాన్యముండే డిజైన్లను ఎంచుకోవాలని సీఎం సూచించారు. సింగపూర్‌లోని ‘గార్డెన్స్ బై ది బే’ను తలపించేలా బర్డ్స్ ప్యారడైజ్, వాటర్ ఫాల్స్ లాంటివి ఉండేలా మీర్ ఆలం చెరువులోని మూడు ఐలాండ్స్‌ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. వెడ్డింగ్ డెస్టినేషన్‌కు వీలుగా ఉండే కన్వెన్షన్ సెంటర్లతోపాటు అడ్వెంచర్ పార్క్, థీమ్ పార్క్, అంపీథియేటర్ ఏర్పాటు చేసేందుకు వీలుగా డిజైన్లు ఉండాలని సూచించారు. చెరువులో నీటిని శుద్ధి చేయడంతోపాటు ఐలాండ్‌ను అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని ప్రతిపాదనలతో డీపీఆర్ సిద్ధం చేయాలని, పీపీపీ విధానంలో ఐలాండ్స్ అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. మీర్ ఆలం వంతెన అభివృద్ధి పనులతోపాటు ఐలాండ్స్ జోన్ ఆనుకుని ఉన్న జూపార్క్‌ను అనుసంధానం చేయాలని సూచించారు. ఐలాండ్స్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని జూ పార్క్‌ను కూడా అప్‌గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
జాతీయ రహదారులకు భూసేకరణపై దృష్టి
రానున్న వందేళ్ల అవసరాలకు అనుగుణంగా డ్రై పోర్టుకు రూపకల్పన చేయాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. రీజినల్‌రింగ్‌రోడ్ సమీపంలో సరైన ప్రాంతంలో ఈ పోర్టు ఉండాలని పేర్కొన్నారు. జాతీయ రహదారులకు భూసేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి సంబంధించిన భూ సేకరణ పూర్తి చేయాలని, దక్షిణభాగం డీపీఆర్ నివేదికను త్వరగా తెప్పించాలన్నారు. హైదరాబాద్ నగరాన్ని ఛత్తీ్‌సగఢ్ రాజధాని రాయ్‌పూర్‌తో అనుసంధానించే జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు పంపేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు కొత్త జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలూ తయారు చేయాలన్నారు. భూసేకరణలో సమస్యలుంటే ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడాలని, సాంకేతిక, న్యాయ సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి కృషి చేయాలని సీఎస్ శాంతి కుమారికి సూచించారు. సమీక్షల్లో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాస్‌రాజు, అధికారులు పాల్గొన్నారు.
లేక్ వ్యూ పార్కులో జ్యోతిరావు ఫూలే విగ్రహం
స్థలాన్ని పరిశీలించిన సీఎం
సంఘ సంస్కర్తకు ఘన నివాళులు
హైదరాబాద్ సిటీ/గోల్నాక, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): హుస్సేన్‌సాగర్ తీరాన ఇందిరాగాంధీ రోటరీ పక్కన గల లేక్‌వ్యూ పార్కులో సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం ఫూలే జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి లేక్‌వ్యూ పార్కును సందర్శించారు. ఫూలే విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు. స్థలాన్ని పూర్తిస్థాయిలో సర్వేచేసి విగ్రహ ఏర్పాటుకు అవసరమైన ప్రణాళికను అందించాలని సీఎం హెచ్‌ఎండీఏ అధికారులకు ఆదేశించారు. మరోవైపు.. అంబర్‌పేటలోని ఫూలే చౌరస్తాలో ఫూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం రేవంత్‌రెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహే్‌షకుమార్‌గౌడ్, మాజీ ఎంపీ వి.హనుమంతరావులతో కలిసి ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..
సిట్ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here