Share News

Chiranjeevi: అవమానాలను పట్టించుకోలేదు..

ABN , Publish Date - Jan 06 , 2025 | 03:20 AM

కెరీర్‌ తొలినాళ్లలో తనకు ఎన్ని అవమానాలు ఎదురైనా పట్టించుకోలేదని, వాటిని అనుకూలంగా మలుచుకున్నానని మెగాస్టార్‌ చిరంజీవి తెలిపారు.

Chiranjeevi: అవమానాలను పట్టించుకోలేదు..

  • మన కష్టమే మనను నంబర్‌ వన్‌ చేస్తుంది.. ‘ఆప్తా’ సదస్సులో మెగాస్టార్‌ చిరంజీవి

హైదరాబాద్‌ సిటీ, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): కెరీర్‌ తొలినాళ్లలో తనకు ఎన్ని అవమానాలు ఎదురైనా పట్టించుకోలేదని, వాటిని అనుకూలంగా మలుచుకున్నానని మెగాస్టార్‌ చిరంజీవి తెలిపారు. ‘విజయం సాధించాలనుకుంటే నెగెటివిటీ అసలు ఉండకూడదు. మీ పాజిటివ్‌ ఆలోచనా తీరే మీ బలం కావాల’ని యువ వ్యాపారవేత్తలకు సూచించారు. ఆదివారం మాదాపూర్‌లోని హైటెక్స్‌లో అమెరికన్‌ ప్రోగ్రెసివ్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆప్తా) అంతర్జాతీయ వ్యాపార సదస్సు ముగింపు కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడారు. చెన్నై పాండీ బజార్‌లో తనకు ఎదురైన అనుభవాల గురించి చెబుతూ అక్కడ కుంగిపోయేలా మాట్లాడేవారని, నమ్మకం సడలిపోయేదన్నారు. తాను నమ్ముకున్న ఆంజనేయ స్వామితోనే సంభాషించేవాడినని, ఆయన తనకు సలహాలు ఇస్తున్నారని అనిపించేందన్నారు. లక్ష్య సాధనకు కష్టాన్ని నమ్ముకుని ముందుకెళితే అదే మనను నంబర్‌ వన్‌ స్థానంలో నిలబెడుతుందన్నారు.


‘మీ అభిరుచిని గుర్తించండి. లక్ష్యం ఎంచుకోండి. అవకాశాలు ఎన్నో ఉంటాయి. కానీ, మీకు అనుకూలమైనది ఏదో గుర్తించాలి. డబ్బు ముఖ్యం కాదు. నిలదొక్కుకోవడమే ముఖ్యం. తరువాత డబ్బే మన వద్దకు వస్తుంది. ఇగో, హర్ట్‌ కావడం వంటివి వదిలేయండ’ని యువ పారిశ్రామికవేత్తలకు సూచించారు. కొంత రిస్క్‌ తీసుకోండి... మార్కెట్‌ అవసరాలను తెలుసుకుని ముందుకు సాగండి అని చెప్పారు. జీవితంలో తాను సంపాదించుకున్నది పవన్‌ కళ్యాణ్‌, రామ్‌చరణ్‌ అని చెప్పి అభిమానులను ఉత్సాహపరిచారు. పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల తన దగ్గరకొచ్చి ‘అన్నయ్యా మీరు నిష్కల్మష మనసుతో మాట్లాడతారు. మీరు ఒకప్పుడు మన కుటుంబం కూడా కపూర్‌ ఫ్యామిలీలా సినీ పరిశ్రమలో ఉండాలని చెప్పారు. ఇప్పుడు మన కుటుంబంలో అందరూ ఈ రంగంలోనే ఉన్నామ’ని చెబితే చాలా సంతోషంగా అనిపించింద’న్నారు. తమ మెగా కుటుంబంలో 9-10 మంది సినీ రంగంలోనే ఉన్నారంటూ ఇటీవల ఓ పత్రిక ‘కపూర్‌ ఫ్యామిలీ ఆఫ్‌ సౌత్‌ సినిమా’ అని కీర్తించిందన్నారు. భగవంతుని ఆశీర్వాదం, ప్రేక్షకుల ఆదరణ వల్లే ఇది సాధ్యమైందన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా సహా 10 దేశాల నుంచి 1,000 మంది తెలుగు ఎన్‌ఆర్‌ఐలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక నుంచి వచ్చినవారితో వేదిక కళకళలాడింది.


చిన్నబుచ్చుకున్న ఏపీ మంత్రి దుర్గేష్‌

ఆప్తా సదస్సులో పర్యాటక అంశంపై కీలకోపన్యాసం చేయడానికి వచ్చిన ఏపీ మంత్రి దుర్గేష్‌... ఏపీ ప్రభుత్వ విధానాలను వివరిస్తుండగా... నిర్వాహక బృందం ఆయన దగ్గరకొచ్చి త్వరగా ముగించాలని కోరారు. దీంతో చిన్నబుచ్చుకున్న ఆయన ముందుగా చెప్పకపోవడంతో సమయం తీసుకున్నానని, అందుకు క్షంతవ్యుడనంటూ వేదిక దిగిపోయారు. నిర్వాహకులు సర్ది చెప్పడానికి ప్రయత్నించినా ప్రాంగణం నుంచి వడివడిగా వెళ్లిపోయారు.

Updated Date - Jan 06 , 2025 | 03:20 AM