Share News

Chilkuru Balaji Temple: చిలుకూరు అర్చకుడిపై దాడి

ABN , Publish Date - Feb 10 , 2025 | 03:58 AM

రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు సీఎస్‌ రంగరాజన్‌పై ‘రామరాజ్యం’ అనే సంస్థ ప్రతినిధులు దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా.. రామరాజ్య స్థాపనకు కృషి చేయడం లేదంటూ దూషించారు.

Chilkuru Balaji Temple: చిలుకూరు అర్చకుడిపై దాడి

  • సీఎస్‌ రంగరాజన్‌పై రామ రాజ్యం సేన ఘాతుకం

  • ప్రైవేటు సైన్యం ఏర్పాటుకు ఆర్థిక సాయానికి డిమాండ్‌

  • ఆలయ బాధ్యతలను అప్పగించాలని దౌర్జన్యం

  • ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి అరెస్టు

  • మిగతా వారి కోసం గాలింపు

మొయినాబాద్‌: ఫిబ్రవరి 9 (ఆంరఽధజ్యోతి): రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు సీఎస్‌ రంగరాజన్‌పై ‘రామరాజ్యం’ అనే సంస్థ ప్రతినిధులు దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా.. రామరాజ్య స్థాపనకు కృషి చేయడం లేదంటూ దూషించారు. ఈ ఘటనపై ఆలయ మేనేజింగ్‌ కమిటీ చైర్మన్‌ ఎంవీ సౌందర్‌రాజన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొయినాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. చిలుకూరు బాలాజీ ఆలయానికి వంశపారంపర్యంగా అర్చకుడిగా వ్యవహరిస్తున్న రంగరాజన్‌.. ధార్మిక వ్యవహారాలపై తరచూ స్పందిస్తూ ఉంటారు. సికింద్రాబాద్‌ ముత్యాలమ్మ ఆలయం ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని సందర్శించి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ చేసిన సనాతన హిందూబోర్డు ఏర్పాటు డిమాండ్‌కు ఆయన మద్దతిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి రామరాజ్యం పేరుతో హిందూధర్మంపై జరిగే దాడులను ఖండిస్తుంటారు. అయితే.. శుక్రవారం వీర రాఘవరెడ్డి 20 మంది రామరాజ్యం సభ్యులతో కలిసి చిలుకూరుకు వచ్చారు. నేరుగా బాలాజీ ఆలయ ప్రాంగణంలోని రంగరాజన్‌ ఇంటికి వెళ్లారు. ‘‘రామరాజ్య స్థాపనకు సహకరించాలి. ఉగాదిలోగా నేను ఏర్పాటు చేయాలనుకుంటున్న రామరాజ్య సైన్యానికి ఆర్థిక సాయం చేయాలి.


చిలుకూరు ఆలయాన్ని నాకు అప్పగించాలి’’ అంటూ రంగరాజన్‌ను బెదిరించారు. లేనిపక్షంలో అంతుచూస్తానంటూ హెచ్చరించారు. దానికి రంగరాజన్‌ తీవ్రంగా స్పందిస్తూ.. తాను నిబంధనల ప్రకారమే నడుచుకుంటానని, అడ్డదారిలో ఎవరికీ సహకరించేది లేదని తేల్చిచెప్పారు. దాంతో.. వీర రాఘవరెడ్డి ఆయనపై చేయిచేసుకున్నారు. రంగరాజన్‌ను ఓ మూలన కూర్చోబెట్టి.. తనకొచ్చిన శ్లోకాలు, పద్యాలను వల్లిస్తూ.. కాలంచెల్లిన భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ), భారతీయ నేర శిక్షాస్మృతి(సీఆర్‌పీసీ)లోని పలు సెక్షన్లను గురించి చెబుతూ.. దూషించారు. ‘‘నీకేం తెలుసు? నీకేం తెలియదు. అన్నీ తెలిసినట్లు ప్రవర్తిస్తున్నావ్‌’’ అంటూ తీవ్ర స్వరంతో బెదిరించారు. ఉగాది వరకు సమయమిస్తున్నామని హెచ్చరించి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ దారుణంపై ఎంవీ సౌందర్‌ రాజన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. అదే సమయంలో సైబరాబాద్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌(ఎ్‌సవోటీ) సమాంతర దర్యాప్తు ప్రారంభించి, సీసీకెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించింది. ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని ఆదివారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించింది. ఇతర నిందితుల అరెస్టుకు వేర్వేరు బృందాలు పనిచేస్తున్నాయని మొయినాబాద్‌ పోలీసులు తెలిపారు.

Updated Date - Feb 10 , 2025 | 03:58 AM