Gachibowli: గచ్చిబౌలి పబ్‌లో పోలీసులపై కాల్పులు
ABN , Publish Date - Feb 02 , 2025 | 03:35 AM
అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులపై ఓ దొంగ కాల్పులు జరిపిన ఉదంతమిది. గచ్చిబౌలి ఠాణా పరిధిలోని ప్రిజమ్ పబ్‌లో జరిగిన ఈ ఘటనలో ఓ హెడ్‌కానిస్టేబుల్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి.

8 నిందితుడి అరెస్టు.. అతడిపై ఏపీ, తెలంగాణల్లో 80 పైగా చోరీ కేసులు
రాయదుర్గం, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులపై ఓ దొంగ కాల్పులు జరిపిన ఉదంతమిది. గచ్చిబౌలి ఠాణా పరిధిలోని ప్రిజమ్ పబ్‌లో జరిగిన ఈ ఘటనలో ఓ హెడ్‌కానిస్టేబుల్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం సాయంత్రం 8 గంటల సమయంలో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న బత్తుల ప్రభాకర్ అనే దొంగకు సంబంధించిన సమాచారాన్ని అందుకున్న మాదాపూర్ సీసీఎస్ హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామిరెడ్డి, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ప్రాంతానికి వెళ్లారు. వీరిని చూసిన ప్రభాకర్ తప్పించుకునే క్రమంలో ప్రిజమ్ పబ్‌లోకి దూరాడు. పోలీసులు అతణ్ని వెంబడించగా.. ప్రభాకర్ పబ్‌లో దేశవాళీ పిస్టల్‌తో పోలీసులపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వెంకట్రామిరెడ్డి తొడలోకి తూటా దూసుకెళ్లింది. ఇద్దరు పబ్ బౌన్సర్లకు గాయాలయ్యాయి. ఇద్దరు కానిస్టేబుళ్లు వెంటనే ప్రభాకర్‌ను పట్టుకుని, అతని చేతుల్లోని తుపాకీని లాక్కొన్నారు. ఆ పిస్టల్‌లో 23 తూటాలున్నాయని.. దుండగుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రభాకర్ జాకెట్‌లో మరో తుపాకీ లభించినట్లు చెప్పారు. తూటా గాయాలైన వెంకట్రామిరెడ్డిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
కాగా.. బత్తుల ప్రభాకర్‌పై తెలుగు రాష్ట్రాల్లో 80 దోపిడీ, ఇంటి దొంగతనాల కేసులున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాశ్ మొహంతి వెల్లడించారు. ఇంజనీరింగ్ కళాశాలలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను అతను లక్ష్యంగా చేసుకుంటాడన్నారు. అడ్మిషన్లు, పరీక్షలు.. ఇలా ఏడాదంతా నగదు లావాదేవీలు జరుగుతాయనే కారణంతో అతను ఆ ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుంటాడని వివరించారు. ఇటీవల మొయినాబాద్ ఠాణా పరిధిలో జరిగిన చోరీ కేసులో అతని వేలిముద్రలు దొరికాయని, ఆ డేటాతో సీసీకెమెరాలను జల్లెడ పట్టి, రెండేళ్లుగా అతను తప్పించుకు తిరుగుతున్న ప్రభాకర్ వివరాలను రాబట్టామన్నారు. ‘‘ప్రభాకర్ తెలివిగా సీసీకెమెరాలకు చిక్కకుండా మాస్కులను ధరిస్తాడు. చోరీ సొత్తును జల్సాలకు కేటాయిస్తాడు. ఈ క్రమంలో ప్రిజమ్ పబ్‌కు తరచూ వస్తుంటాడనే సమాచారం మాదాపూర్ సీసీఎస్ పోలీసులకు అందింది’’ అని వివరించారు. కాగా, ప్రభాకర్ 2022లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. అనకాపల్లి కోర్టు నుంచి వైజాగ్ కేంద్ర కారాగారానికి తరలిస్తుండగా.. ఎస్కార్టు పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. ఈ ఘటనపై ఓ కేసు ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు వివరించారు.
ఇవీ చదవండి:
సచిన్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం.. ఈ అవార్డు చాలా స్పెషల్
ఒకే రోజు ముగ్గురు స్టార్ల సెంచరీలు మిస్.. ఇది ఊహించలేదు
చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు బిగ్ షాక్.. అసలైనోడు దూరం
మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి