Bhatti Vikramarka: ఆ మూడు రంగాలకు.. రాష్ట్రం అనుకూలం
ABN , Publish Date - Apr 26 , 2025 | 04:26 AM
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి లైఫ్ సైన్సెస్, టూరిజం, ఐటీ వంటి రంగాలు ఎంతో అనుకూలమని, విదేశీ ప్రతినిధులు తమ దేశాలు, సంస్థల ద్వారా తెలంగాణలో పెట్టుబడులు పెట్టించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

లైఫ్ సైన్సెస్, టూరిజం, ఐటీలో పెట్టుబడులు పెట్టండి.. సులభంగా అనుమతులు ఇస్తాం
విదేశీ ప్రతినిధులకు డిప్యూటీ సీఎం భట్టి పిలుపు
అట్టహాసంగా ‘భారత్ సదస్సు-2025’ ప్రారంభం
100కుపైగా దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు
రాహుల్, ఖర్గే రాకపోవడంతో ప్లీనరీ వాయిదా
నేడు రాహుల్ రాక?.. ప్లీనరీని నిర్వహించే అవకాశం
హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి లైఫ్ సైన్సెస్, టూరిజం, ఐటీ వంటి రంగాలు ఎంతో అనుకూలమని, విదేశీ ప్రతినిధులు తమ దేశాలు, సంస్థల ద్వారా తెలంగాణలో పెట్టుబడులు పెట్టించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. పెట్టుబడులకు ముందుకొచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని.. అన్ని రకాల అనుమతులు సులభంగా అందేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ‘భారత్ సదస్సు-2025’లో భాగంగా విదేశీ ప్రతినిధులకు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, యువజన, పర్యావరణ న్యాయం, ప్రపంచ శాంతి, రాష్ట్రంలోకి పెట్టుబడుల ఆహ్వానం, అహింస అంశాలు ఇతివృత్తంగా కాంగ్రెస్ సర్కారు చేపట్టిన రెండు రోజుల ‘భారత్ సదస్సు-2025’ శుక్రవారం ప్రారంభమైంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లోని నోవాటెల్ హోటల్‌లో జరుగుతున్న ఈ సదస్సుకు 100కుపైగా దేశాల నుంచి 300 మందికిపైగా ప్రతినిధులు దీనికి తరలివచ్చారు. వివిధ దేశాలకు చెందిన మాజీ మంత్రులు, ఎంపీలు, సెనేటర్లు, ప్రగతిశీల రాజకీయ పార్టీల అధ్యక్షులు, నేతలు, వివిధ అంశాల నిపుణులు ఇందులో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం నాలుగు చర్చాగోష్ఠులు (ప్యానెల్ డిస్కషన్స్), ప్లీనరీ జరగాలి. కానీ కీలక నేతలు రాహుల్‌గాంధీ, ఖర్గే రాకపోవడంతో ప్లీనరీ వాయిదా పడింది. ‘లింగ సమానత్వం - ఫెమినిస్ట్ ఫ్యూచర్’.. ‘నిజాలు వర్సెస్ కల్పితాలు: తప్పుడు సమాచారాన్ని నిరోధించడం’.. ‘యువత -రేపటి రాజకీయాలు’.. ‘షేపింగ్ న్యూ మల్టీల్యాటెరిలిజం (బహుళ సంఖ్యలో దేశాల మధ్య ఒడంబడికలు)’పై చర్చాగోష్ఠులు జరిగాయి. సదస్సులో కాంగ్రెస్ జాతీయ నేతలు దిగ్విజయ్‌సింగ్, సల్మాన్ ఖుర్షీద్, గురుదీప్ సింగ్ సప్పల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బలరాం నాయక్, రేణుకా చౌదరి తదితరులు పాల్గొన్నారు.
ఉగ్రదాడిపై సదస్సు దిగ్ర్భాంతి
పహల్ గామ్ ఉగ్రవాద దాడిపై భారత్ సదస్సు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. సదస్సులో పాల్గొన్న ప్రతినిధులంతా దీనిపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘‘ఉగ్రదాడితో దిగ్ర్భాంతి చెందాం. 26 మంది అమాయక పౌరులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. భారత ప్రజలకు మేం సంఘీభావం తెలుపుతున్నాం. ఉగ్రదాడిని ఖండిస్తున్నాం. ఇది రాజ్యాంగ విలువలపై జరిగిన ప్రత్యక్ష దాడి’’ అని పేర్కొన్నారు.
భారత్ సదస్సుపై పహల్‌గామ్ ప్రభావం
ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ సదస్సుపై పహల్‌గామ్ ఉగ్రదాడి ఘటన ప్రభావం కనిపించింది. సదస్సు ఊహించిన రీతిలో జరగలేదు. విదేశీ ప్రతినిధులు తరలివచ్చినా.. కాంగ్రెస్ నేతల్లో కాస్త నిరుత్సాహం కనిపించింది. నిజానికి కాంగ్రెస్ మూల సిద్ధాంతం, రాహుల్‌గాంధీ చెప్పే ‘న్యాయ్’ అంశాన్ని ఈ సదస్సు ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ప్రపంచంలో భౌగోళిక, రాజకీయ, ఆర్థికపరంగా పెను మార్పులు సంభవిస్తున్న తరుణంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, పర్యావరణ న్యాయాలపై చర్చించి.. ప్రపంచానికి ఓ సందేశాన్ని పంపాలని కాంగ్రెస్ నేతలు భావించారు. వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రగతిశీల రాజకీయ పార్టీల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులతోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొనే ఈ సదస్సుకు మంచి ప్రచారం వస్తుందని ఆశించారు. మరోవైపు బీజేపీ, ఇతర జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కూడా ఈ సదస్సుపై దృష్టి సారించాయి. చాలా కాలం తర్వాత కాంగ్రెస్ ఇంత పెద్ద సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. దీని ప్రభావం ఏమైనా ఉంటుందా అన్న కోణంలో చూశాయి. కానీ ఉగ్రదాడి ఘటనతో యావత్ దేశం దృష్టి అటువైపే మళ్లింది. రాహుల్, ఖర్గే రాకపోవడంతో కాంగ్రెస్ నేతల్లో కాస్త నిరుత్సాహం కనిపించింది.
నేడు సాయంత్రం ప్లీనరీ!
శనివారం ఉదయం 10.30 నుంచి 12.30 గంటలకు ‘ఓవర్‌కమింగ్ పోలరైజేషన్ విత్ ప్లూరలిజం, డైవర్సిటీ, రెస్పెక్ట్’ అంశంపై, ‘యాక్సలరేటింగ్ క్లైమేట్ జస్టి్‌స’పై మొదటి, రెండో చర్చా గోష్ఠులు ఉంటాయి. మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల వరకు ‘ఎకనామిక్ జస్టిస్ ఇన్ అన్‌సర్టేన్ టైమ్స్’పై, ‘పీస్ అండ్ జస్టిస్ ఇన్ మల్టీపోలార్ వరల్డ్’పై చర్చాగోష్ఠులు ఉంటాయి. సాయంత్రం ప్లీనరీ నిర్వహిస్తారని సమాచారం. ఈ ప్లీనరీలో రాహుల్‌గాంధీ, ఖర్గే పాల్గొనే అవకాశాలున్నాయి. సదస్సు ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పాల్గొంటారు.
ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా...: శ్రీధర్‌బాబు
తెలంగాణ రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. భారత్ సదస్సులో దేశ విదేశాల ప్రతినిధులకు రాష్ట్ర అభివృద్ధిని, ఇక్కడ పెట్టుబడులకు అవకాశాలను వివరిస్తున్నామని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీటీ స్కాన్‌లో బయటపడ్డ షాకింగ్ విషయం..
వృద్ధిరేటులో ఏపీ రాష్ట్రానికి రెండో స్థానం
For More AP News and Telugu News