CV Anand: సైబర్ నేరాల్లో బ్యాంకు సిబ్బంది!
ABN , Publish Date - Jan 30 , 2025 | 05:09 AM
సైబర్ నేరగాళ్ల ఆగడాలకు కొందరు బ్యాంకు ఉద్యోగులు దన్నుగా ఉంటున్నారు. ఖాతా వివరాలు అడిగో.. ఓటీపీ నంబరు అడిగో... లేదంటే డిజిటల్ అరెస్టు అయ్యారని భయపెట్టో అమాయక ప్రజలను మోసం చేసి..

‘మ్యూల్’ ఖాతాలు.. ప్రతి లావాదేవీకి కమీషన్
వేర్వేరు బ్యాంకులకు చెందిన నలుగురి అరెస్ట్
20 సైబర్ నేరాల్లో ప్రమేయం.. చైనా, నేపాల్
సైబర్ క్రిమినల్స్‌కు రూ.23 కోట్ల చేరవేత
దర్యాప్తులో నిగ్గుతేల్చిన పోలీసులు
ఏపీ, తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో 52 మంది సైబర్ నేరగాళ్ల అరెస్టు: సీపీ సీవీ ఆనంద్
బ్యాంకర్లూ జాగ్రత్త.. నేరగాళ్లకు సహకరిస్తే
అరెస్టులే: సైబర్ సెక్యూరిటీ బ్యూరో
హైదరాబాద్ సిటీ, హైదరాబాద్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరగాళ్ల ఆగడాలకు కొందరు బ్యాంకు ఉద్యోగులు దన్నుగా ఉంటున్నారు. ఖాతా వివరాలు అడిగో.. ఓటీపీ నంబరు అడిగో... లేదంటే డిజిటల్ అరెస్టు అయ్యారని భయపెట్టో అమాయక ప్రజలను మోసం చేసి.. వారి నుంచి కోట్లు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్ల విశృంఖలతకు ఆ ఉద్యోగులే గొడుగు పడుతున్నారు. సైబర్ నేరగాళ్ల కోసం మ్యూల్ ఖాతాలను సృష్టించి.. ఆ దొంగ డబ్బు దాచుకునేలా.. ఆ ఖాతాలనుంచి వేర్వేరు ఖాతాలకు బదిలీ చేయించుకునేలా అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ఇదంతా పెద్ద సంఖ్యలో సైబర్ నేరగాళ్ల అరెస్టు ద్వారా తేటతెల్లమైంది. తెలుగు రాష్ట్రాలు సహా గుజరాత్, కర్ణాటక, న్యూఢిల్లీ, యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బిహార్‌లో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించి 52 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. ఈ సైబర్ నేరగాళ్లు తెలంగాణలో 74 సైబర్ నేరాలు సహా దేశవ్యాప్తంగా 576 నేరాలకు పాల్పడి రూ.88.32 కోట్లు కొల్లగొట్టారని పోలీసులు తేల్చారు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 33 సైబర్ నేరాలకు పాల్పడటం గమనార్హం. దర్యాప్తులో సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న వేర్వేరు బ్యాంకులకు చెందిన నలుగురు ఉద్యోగులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ నలుగురు నేపాల్, చైనాల్లోని ప్రధాన సైబర్ క్రిమినల్స్ ఖాతాలకు రూ.23కోట్లు తరలించినట్లు, దేశవ్యాప్తంగా 20 కేసుల్లో వీరి పాత్ర ఉన్నట్లు తేలింది. ఈ మేరకు బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వివరాలు వెల్లడించారు. సైబర్ క్రిమినల్స్ వద్ద రూ.47.90 లక్షల నగదు, మరో రూ.40లక్షల విలువైన క్రిప్టో కరెన్సీ కలిపి మొత్తం రూ. 87.90లక్షలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నేరస్థుల ఖాతాల్లో రూ.2.87కోట్లు ఫ్రీజ్ చేశామన్నారు. ఈ నేరగాళ్లు నగరంలో చేసిన నేరాల్లో మూడు కేసులను వెల్లడించారు.
ఆ మూడు కేసులు ఇవీ..
హైదరాబాద్ గుడిమల్కాపూర్‌కు చెందిన ఓ ప్రముఖ వైద్యురాలు సైబర్ నేరగాళ్ల ముఠా బెదిరింపులకు భయపడి రూ.3 కోట్లు ఇచ్చుకుంది. వీడియో కాల్ చేసి మనీలాండరింగ్ కేసులో ఉన్నారని, డిజిటల్ అరెస్టు అయ్యారని ఆమెను బెదిరించారు. తమను తాము ఢిల్లీ క్రైం బ్రాంచ్ అధికారులమని చెప్పుకొన్నారు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బు మొత్తం ఆర్బీఐ చూపించిన ఖాతాల్లో జమ చేయాలని.. ఖాతాలన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలితే డబ్బంతా తిరిగి జమచేస్తామని నమ్మించారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని.. లేదంటే భర్త, కుమారుడినీ అరెస్టు చేస్తామని హెచ్చరించారు. భయపడిపోయిన ఆమె, వారు సూచించిన ఖాతాల్లో రూ.3కోట్లు జమ చేసింది. ఆ తర్వాత ఆవలి వైపు వారు స్పందించకపోవడంతో మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫోన్ చేసింది. ఈ మేరకు సాంకేతిక ఆధారాల ద్వారా గుజరాత్‌కు చెందిన సైబర్ ముఠాలో హరిపాల్ సింగ్, సయ్యద్ అజియుబ్ భాయ్‌ను అరెస్టు చేశారు. ఇక ట్రేడింగ్‌లో ఎక్కువ లాభాలొస్తాయంటూ నగరానికి చెందిన వ్యాపారి నుంచి రూ.2.06 కోట్లు కొల్లగొట్టిందో సైబర్ ముఠా. ఆ డబ్బును క్రిప్టో కరెన్సీగా దుబాయ్‌లో ఉన్న ప్రధాన నిందితులకు హవాలా రూపంలో పంపుతుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఏపీ, తెలంగాణకు చెందిన ఐదుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో షాలిబండకు చెందిన మహ్మద్ ఇస్మాయిల్, బహదూర్‌పురకు చెందిన మహ్మద్ జునైద్, మచిలీపట్నానికి చెందిన మాగంటి జయకిరణ్ ఉన్నారు. వారు నిర్వహిస్తున్న మ్యూల్ బ్యాంకు ఖాతాల్లో రూ.47.50లక్షల నగదు, రూ. 40లక్షల విలువైన క్రిప్టో కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. 33 చెక్‌బుక్స్, 26 డెబిట్ కార్డులు, రెండు ల్యాప్‌టా్‌పలను సీజ్ చేశారు.
సహకరించిన బ్యాంకు ఉద్యోగులు వీరే..
సీపీ వెల్లడించిన రెండో కేసు ఛేదించే క్రమంలో ఒక బ్యాంకు ఉద్యోగి ప్రమేయం, మూడో కేసు ఛేదించే క్రమంలో ముగ్గురు బ్యాంకు ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు తేలింది. రూ.2.06 కోట్లను నగరానికి చెందిన ఓ వ్యాపారి నుంచి కొల్లగొట్టిన కేసు దర్యాప్తులో ఏపీలోని గుంటూరు జిల్లా ముప్పాళ్ల జేఎన్టీయూ కొటక్ మహీంద్రా బ్రాంచీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న కాటా శ్రీనివాసరావును అరెస్టు చేశారు. ఇతడు.. దుబాయ్‌లో ఉండే సైబర్ నేరగాళ్లకు మ్యూల్ ఖాతాలను సృష్టించి.. కోట్లలో అక్రమలావాదేవీలు జరగేందుకు సహకరించాడని నిర్ధారించారు. ఈ కేసులో అరెస్టయిన వారిలో ఏపీలోని పశ్చిమ గోదావరికి చెందిన రెడ్డి ప్రవీణ్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఇక మూడో కేసులో.. ట్రేడింగ్‌లో భారీ లాభాలొస్తాయని నమ్మించి నగరానికి చెందిన ఓ వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.93 లక్షలు కొల్లగొట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులకు నేరంలో ముగ్గురు బ్యాంకు అధికారులూ ఉన్నట్లుగా తెలిసింది. ఇష్టానుసారంగా మ్యూల్ ఖాతాలకు సహకరించి, వారి వద్ద రూ.లక్షల్లో డబ్బులు దండుకుంటూ.. కొంత డబ్బును బ్యాంకు అధికారులే ఇతర ఖాతాలకు మళ్లిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు బెంగళూరులో ఆర్బీఎల్ బ్యాంకు విద్యారణ్యపుర బ్రాంచి డిప్యూటీ మేనేజర్ శుభం కుమార్ ఝా, బెంగళూరు యాక్సిస్ బ్యాంకు మల్లేశ్వరం బ్రాంచి అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ హరూన్ రషీద్ ఇమాముద్దీన్, మరో బ్యాంకు ఉద్యోగి మోహన్‌ను అరెస్టు చేశారు. వీరు బ్యాంకు ఖాతాలు తెరచి వాటి క్రెడెన్షియల్స్‌ను నేపాల్, చైనాలో ఉంటున్న ప్రధాన నేరగాళ్లకు చేరవేసి రూ.లక్షల్లో కమీషన్ తీసుకున్నారు. ప్రతి లావాదేవీకి 5-10శాతం కమీషన్ తీసుకున్నట్లు పోలీసులు తేల్చారు.
క్రిమినల్స్‌కు సహ కరిస్తే అరెస్టులే
సైబర్ నేరగాళ్లకు ప్రత్యక్షంగాను పరోక్షంగానూ కొందరు బ్యాంకు ఉద్యోగులు సహకరిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలడంతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో బ్యాంకర్లకు కొన్ని సూచనలు చేసింది. సైబర్ క్రైం కేసుల్లో బ్యాంకు సిబ్బంది పాత్ర ఏ మాత్రం ఉన్నా అరెస్టులు తప్పవని హెచ్చరించింది. పెద్ద మొత్తంలో డబ్బు జమ చేసే వీలున్న కరెంటు ఖాతాల రూపంలోనే మ్యూల్ ఖాతాలు తెరుస్తున్నారు. ఏదైనా బ్యాంకులో కరెంట్ ఖాతా తెరవాలంటే జీఎ్‌సటీఎన్ నంబర్, కంపెనీ అయితే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) నంబర్ తప్పని సరి. ఈ వివరాలను బ్యాంకు సిబ్బంది వ్యక్తిగతంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు సైబర్ ఫ్రాడ్స్‌లో బయటపడ్డ ఖాతాల్లో చాలావరకు బ్యాంక్ సిబ్బంది సహకారంతోనే ఫేక్ ఖాతాలు ఓపెన్ అయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీంతో కొత్త కరెంట్ ఖాతాల విషయంలో బ్యాంకర్లు తొందర పడొద్దని సూచించారు. కాగా మంగళవారం వివిధ బ్యాంకుల ప్రధానాధికారులతో సమావేశం నిర్వహించినట్లు సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. సైబర్ క్రిమినల్స్‌కు సహకరించే ఉద్యోగులు ప్రతి బ్యాంకులోనూ ఉన్నారని అధికారులు ఒప్పుకొన్నారని తెలిపారు. సిబ్బందిలో కొందరు సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపి, తప్పుడు పత్రాలతో ఖాతాలు సృష్టించి.. అందులో జరిగే ప్రతి లావాదేవీకి కమీషన్ తీసుకుంటున్నట్లు అధికారులు అంగీకరించారని చెప్పారు. ఇకపై ఇలాంటి సిబ్బందిని ఉపేక్షించేది లేదని.. అరెస్టు చేసి కటకటాల్లోకి నెడతామని సీపీ హెచ్చరించారు.
ఇవీ చదవండి:
పరువు కాపాడిన తిలక్-వరుణ్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు
సంజూ కెరీర్ ఫినిష్.. ఒక్క షాట్ ఎంత పని చేసింది
అతడి వల్లే ఓడాం.. ఇది అస్సలు మర్చిపోను: సూర్య
టీమిండియాకు కొత్త కెప్టెన్.. చేజేతులా చేసుకున్న సూర్య
ఇంత పొగరు అవసరమా హార్దిక్.. ఆల్‌రౌండర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి