Share News

Bandi Sanjay: ఎన్నికలను బహిష్కరించాలనేది నక్సలైట్లే

ABN , Publish Date - Apr 20 , 2025 | 04:49 AM

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు నక్సలైట్ల వారసులేనని బండి సంజయ్‌ విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అంగీకారం తెలియకపోవడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు.

Bandi Sanjay: ఎన్నికలను బహిష్కరించాలనేది నక్సలైట్లే

హైదరాబాద్‌ సిటీ, బర్కత్‌పురా, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎన్నికలను బహిష్కరించాలని చెప్పేదెవరు? నక్సలైట్లు మాత్రమే. ఆ నక్సలైట్ల వారసులే ఈ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు. రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌, 15 నెలలుగా అధికారాన్ని అనుభవిస్తున్న కాంగ్రెస్‌. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున జరిగే ఎన్నికలకు దూరంగా ఉండటం సిగ్గు చేటు’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌ బర్కత్‌పురాలోని బీజేపీ సెంట్రల్‌ జిల్లా కార్యాలయంలో కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో బండి సంజయ్‌ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్నికలపై, ప్రజాస్వామ్యంపై నమ్మకమున్న ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని.. కానీ 24 మంది కార్పొరేటర్లు ఉన్న బీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉండటం హాస్యాస్పదమని బండి సంజయ్‌ విమర్శించారు. ఓటింగ్‌ దూరంగా ఉండాలంటూ బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లకు విప్‌ జారీ చేయనున్న విషయాన్ని మీడియా ప్రస్తావించగా.. ‘‘విప్‌లు, గిప్‌లు ఏమీ పనిచేయవు.


జీహెచ్‌ఎంసీ పాలక మండలికి ఉన్న గడువు ఇంకా 6 నెలలే. పార్టీల విప్‌కు భయపడి మజ్లీస్ కు ఓటేసినా, ఎన్నికలకు దూరంగా ఉన్నా వాళ్ల పని ఖతమైనట్టే..’’ అని పేర్కొన్నారు. ఈ ఎన్నికలో మజ్లీస్ ను ఓడిస్తే మిమ్మల్ని అక్కున చేర్చుకుని గెలిపించే బాధ్యతను తీసుకుంటామని బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్పొరేటర్లకు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి దమ్మూ, ధైర్యముంటే తెలంగాణలో వక్ఫ్‌ ఆస్తులెన్ని? ఎన్ని అన్యాక్రాంతమయ్యాయి? వక్ఫ్‌ ఆస్తుల ద్వారా ఎంత ఆదాయం వస్తోంది? అందులో పేదలకు ఎంత ఖర్చు చేస్తున్నారనే వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు గెలిచామని, ఈసారి జీహెచ్‌ఎంసీ మేయర్‌ పీఠంపై కాషాయ జెండా ఎగరవేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్‌ మనోహర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, గౌతమ్‌రావు, రాంచంద్రరావు, లంకల దీపక్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, గుండగోని భరత్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

Betting Apps Case.. మరో ఆరుగురికి నోటీసులు..

కేసీఆర్‌ క్యాంపు కార్యాలయానికి టులెట్‌ బోర్డు..


Read Latest
Telangana News And Telugu News

Updated Date - Apr 20 , 2025 | 04:49 AM