Amit Shah: బీఆర్‌ఎస్ పోయినా అవినీతి పోలేదు
ABN , Publish Date - Jun 30 , 2025 | 04:03 AM
తెలంగాణలో బీఆర్‌ఎస్ పాలన పోయిందిగానీ.. అవినీతి మాత్రం పోలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్ అవినీతిని సహించకుండా ఆ పార్టీని గద్దె దింపితే..

కాంగ్రెస్ పాలనలోనూ కొనసాగుతోంది
తెలంగాణను ఏటీఎంగా మార్చుకున్న ఢిల్లీ కాంగ్రెస్
రాష్ట్రంలో బీజేపీ సర్కారు వస్తేనే అవినీతి అంతం
ప్రధాని మోదీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు
పసుపు బోర్డును నిజామాబాద్‌లోనే ఏర్పాటు చేశారు
భవిష్యత్తులో ప్రపంచమంతా పసుపు ఎగుమతి
నక్సలైట్లు ఆయుధాలు వీడేదాకా చర్చలుండవు
పోలీసులను చంపినప్పుడు ఎవరూ మాట్లాడలేదేం?
తెలంగాణను నక్సలైట్ల అడ్డాగా మార్చొద్దు: అమిత్‌షా
నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఆఫీసు ప్రారంభం
డీఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర హోంమంత్రి
షాను కలిసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నం
ఢిల్లీలో అత్యవసర పని ఉందంటూ వెళ్లిపోయిన షా
నిజామాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణలో బీఆర్‌ఎస్ పాలన పోయిందిగానీ.. అవినీతి మాత్రం పోలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్ అవినీతిని సహించకుండా ఆ పార్టీని గద్దె దింపితే.. ఆ స్థానంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ కూడా అవినీతి పాలననే కొనసాగిస్తోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం, ధరణి వంటి వాటిని కుటుంబ ఏటీఎంగా మార్చుకున్నారని, పదేళ్లపాటు అన్ని రంగాల్లో దోపిడీకి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఢిల్లీ కాంగ్రెస్.. తెలంగాణను తమ ఏటీఎంగా మార్చుకుందన్నారు. రాష్ట్రంలో అవినీతి అంతం కావాలంటే బీజేపీ సర్కారు రావాలన్నారు. ఆదివారం నిజామాబాద్‌లో పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్‌షా ప్రారంభించారు. ఆ తర్వాత బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన డి.శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించిన కిసాన్ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన అర్వింద్ పసుపు బోర్డు కోసం హామీ ఇచ్చారని, ఆ హామీని ప్రధాని మోదీ నెరవేర్చారని అన్నారు. మోదీ ఏదైనా చెప్పారంటే చేసి చూపిస్తారని తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటుతో.. నిజామాబాద్ రైతుల 40 ఏళ్ల పోరాటం ఫలించిందని, వారి కల నెరవేరిందని పేర్కొన్నారు. ఇకపై ఇక్కడి రైతులు పండించే పసుపు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతుందన్నారు. ఇందుకోసం మార్కెటింగ్, ఎక్స్‌పోర్ట్ వ్యవస్థలను ఏర్పాటు చేసి పసుపును ఎగుమతి చేస్తామన్నారు. ఇప్పటికే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, వియత్నాంతోపాటు ఇతర దేశాలకూ పసుపు ఎగుమతి అవుతోందని తెలిపారు. భారత్ ఎక్స్‌పోర్ట్ లిమిటెడ్ ద్వారా యూరప్ దేశాలకు ఎక్కువగా ఈ ఎగుమతి కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.
పసుపు పంటకు రాజధాని ఇందూరు..
పసుపు పంటకు ఇందూరు రాజధాని లాంటిదని అమిత్‌షా అన్నారు. 2030వ సంవత్సరం వరకు బిలియన్ డాలర్ల విలువైన పసుపును ఎగుమతి చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఈ బోర్డు ద్వారా రైతులకు నూతన సాగు పద్ధతులపై శిక్షణ ఇస్తామని, ఇక్కడి పసుపు పంటకు జియో ట్యాగింగ్ కూడా చేస్తున్నామని చెప్పారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా మోదీ సర్కారు పనిచేస్తోందని, దాంతోపాటు పరిశ్రమలను తీసుకొచ్చేందుకూ కృషి చేస్తోందన్నారు. రైతు ల కోసం రూ.లక్ష కోట్ల వరకు ఖర్చు చేస్తున్నామని ఆయన వివరించారు.
నక్సలైట్లతో చర్చలు ఉండవు..
నక్సలైట్లు తక్షణమే హింసను వీడి లొంగిపోవాలని, జనజీవన స్రవంతిలోకి రావాలని అమిత్‌షా పిలుపునిచ్చారు. ఆదివాసీలు, ఇతర వర్గాలపై నక్సల్స్ హత్యాకాండకు పాల్పడుతున్నారని, ఆయుధాలు వదిలేసేంత వరకూ వారితో చర్చలు ఉండబోవని స్పష్టం చేశారు. లొంగిపోతే పునరావాసం కల్పిస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 10 వేల మంది నక్సలైట్లు లొంగిపోయారని వెల్లడించారు. 2026 మార్చిలోపు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని ప్రకటించారు. నక్సలైట్లకు మద్దతుగా మాట్లాడేవారు బా ధిత కుటుంబాల పరిస్థితిని తెలుసుకోవాలని హితవు పలికారు. గిరిజన బిడ్డలను, పోలీసులను చంపినప్పుడు వారి తరఫున ఎవరూ మాట్లాడలేదని, కానీ.. ఇప్పుడు చర్చల కోసం చాలా మంది పిలుపునిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం రే వంత్‌రెడ్డి తెలంగాణను నక్సలై ట్ల అడ్డాగా మార్చవద్దని సూచించారు. ‘ఆపరేషన్ సిందూర్’ తో పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పామని అమిత్‌షా తెలిపారు. అయితే పాకిస్థాన్ మాట.. రాహుల్‌గాంధీ నోట వినిపిస్తోందని విమర్శించారు.
తెలంగాణలో బీజేపీకి అధికారం ఖాయం..
తెలంగాణలో బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని అమిత్‌షా అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఉంటేనే.. అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ఆదివాసీలు, మహిళలు, దళితులు, ఈబీసీలు, రైతుల అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం రైతులకు అన్నివిధాలా అండగా ఉందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంతోపాటు ప్రస్తుత రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాగా, రైతును రారాజును చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ప్రభుత్వం పని చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. పసుపు బోర్డు సాధించుకున్న ఇందూరు రైతులను హీరోలుగా అభివర్ణించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. ఇందూరు రైతుల పోరాట ఫలితంగానే పసుపు బోర్డు ఏర్పాటయిందన్నారు. రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేశ్ కులాచారి తదితరులు పాల్గొన్నారు.