Share News

గూడెం గ్రామానికి అనుకూలించని రిజర్వేషన్‌

ABN , Publish Date - Jan 19 , 2025 | 10:28 PM

మూడు దశాబ్దాలకు పైగా గూడెం గ్రామంలో ఎన్నికలు జరగడం లేదు. గ్రామంలో ఒక్క గిరిజనుడు లేకపోయినా సర్పంచ్‌ పదవితోపాటు ఐదు వార్డు స్థానాలను షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ (ఎస్టీ) కులస్థులకు రిజర్వ్‌ చేశారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి నోటిఫికేషన్‌ ఇవ్వ డం, నామినేషన్లు దాఖలు కాకపోవడం షరా మామూ లైంది. త్వరలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈసారైనా గ్రామ పంచాయతీ రిజర్వేషన్‌ మారుతుందని గ్రామస్థులు ఆశిస్తున్నారు.

గూడెం గ్రామానికి అనుకూలించని రిజర్వేషన్‌

మంచిర్యాల, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గూడెం గ్రామానికి ఈ సారైనా ఎలక్షన్లు జరుగుతాయా అనే సందేహాలు నెలకొన్నాయి. దశాబ్దాలుగా రిజర్వేషన్‌ అనుకూలించక సర్పంచ్‌ పదవికి ఎన్నికలు జరగడం లేదు. కనీసం ఈ సారైనా ఎన్నికలు జరుగుతాయో లేదో తెలియని గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. దండేపల్లి మండలం గూడెం గ్రామ పంచాయతీకి మూడు దశాబ్దాలకు పైగా సర్పంచ్‌ ఎన్నికలు జరగడం లేదు. గ్రామంలో ఒక్క గిరిజనుడు లేకపోయినా సర్పంచ్‌ పదవిని షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ (ఎస్టీ) కులస్థులకు రిజర్వ్‌ చేశారు. దీంతో 35 ఏళ్లుగా సర్పంచ్‌ పదవికి ఎన్నికలు జరుగకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలనలోనే గ్రామం కొనసాగుతోంది.

నోటిఫైడ్‌ ఏరియాగా ప్రకటించడంతో...

గూడెం గ్రామ పంచాయతీలో 1800పై చిలుకు మంది ఓటర్లు ఉన్నారు. గూడెంలో ఒక్కరు కూడా గిరిజనులు లేకపోయినా 1950లో అప్పటి ప్రభుత్వం గ్రామా న్ని నోటిఫైడ్‌ ఏరియాగా ప్రకటించింది. రిజర్వేషన్‌ ప్రకా రం గిరిజనులు ఎవరూ లేకపోవడంతో పోటీ చేసేవారు లేకపోవడంతో అప్పటి నుంచి ఇన్‌చార్జీల ద్వారా పాలన కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, 1987 నుంచి గ్రామ సర్పంచు స్ధానాన్ని ఎస్టీకి రిజర్వు చేశారు. సర్పంచు పదవితోపాటు గ్రామంలోని 10 వార్డు సభ్యుల స్థానాల్లో ఐదింటిని ఎస్టీలకు కేటాయించారు. అప్పటి నుంచి సుమారు 35 ఏళ్లపాటు గూడెం గ్రామ పంచాయతీకి సర్పంచు, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసేందుకు అర్హులు లభించడం లేదు. దీంతో గ్రామంలో అభివృద్ధి కుంటుపడింది. ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేకుండా పోయాయి. అయినప్పటికీ ప్రతిసారీ పంచాయతీ ఎన్నికల సమ యంలో నోటిఫికేషన్‌ విడుదల చేయడం, నామినేషన్లు దాఖలు కాకపోవడం షరా మామూలైంది.

ఆందోళనలు చేసినా ఫలితం శూన్యం...

దశాబ్దాలుగా గూడెం పంచాయతీకి ఎన్నికలు జరుగకపోవడంతో గ్రామస్థులు పదవులకూ నోచుకోవ డం లేదు. రాజకీయాలపై మక్కువ ఉన్నవారు, ప్రజల సమస్యలను పరిష్కరించాలని భావించేవారు ఎన్నికల్లో పోటీ చేద్దామన్నా రిజర్వేషన్‌ అనుకూలించక అనర్హు లుగా మిగిలిపోతున్నారు. గ్రామంలో ఎస్టీ జనాభా లేదని, రిజర్వేషన్‌ మార్చాలని గ్రామస్థులు పలుమార్లు ఆందోళనలు చేశారు. రిజర్వేషన్లు మార్చాలని సామూ హిక నిరహార దీక్షలు, రాస్తారోకో, తదితర నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో పరిస్థితి ఎప్పటిలాగే ఉంది. త్వరలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమ వుతోంది. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లలో మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీసీ రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి. గతంలో ఉన్న 27 శాతం బీసీ రిజర్వేషన్‌ను 42 శాతానికి పెంచాలనే డిమాండ్లు ఉన్నాయి. ఈ క్రమంలో రిజర్వేషన్ల మార్పులు జరిగి, తమకు కూడా అవకాశం వస్తుందనే భావనలో గూడెం గ్రామానికి చెందిన ఆశావహులు ఉన్నారు. తమ గ్రామ పంచాయతీ రిజర్వేషన్‌ మారుతుందని గ్రామస్థులు గంపెడాశతో ఉన్నారు. రాష్ట్రంలోని పంచాయతీలకు చివరిసారిగా 2019లో ఎన్నికలు జరిగాయి. ప్రస్తుత సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవీకాలం 31 జనవరి 2024తో ముగిశాయి.

Updated Date - Jan 19 , 2025 | 10:28 PM