గోదావరి తీరంలో ఇసుకను తోడేస్తున్నారు..!
ABN , Publish Date - Jan 18 , 2025 | 11:02 PM
గోదావరి తీరం నుంచి రాత్రి,పగలు తేడా లేకుండా ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. గుడిరేవు గోదావరి నుంచి నిత్యం ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

దండేపల్లి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): గోదావరి తీరం నుంచి రాత్రి,పగలు తేడా లేకుండా ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. గుడిరేవు గోదావరి నుంచి నిత్యం ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నదిలో కొద్దిగా నీరు ఉన్న చోట ఇసుకను తోడి తెప్పల మీద తీసుకవస్తూ ఒడ్డుపై పోసి ట్రాక్టర్లలో నింపుకొని తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను ట్రాక్టర్లలో యథేచ్ఛగా తరలిస్తున్నారు. గుడిరేవు గ్రామ సమీపంతో పాటు వివిధ గ్రామాల్లో డంప్ చేస్తున్నారు. గోదావరి నదిలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. అధికారులు స్పందించి అక్రమంగా తరలిస్తున్న ఇసుక పట్టుకోవాలని, నదిలో తవ్వకాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
అనుమతులు లేకుండా తరలిస్తే చర్యలు
సంధ్యారాణి, తహసీల్దార్
గోదావరి తీరాల నుంచి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకొంటాం. ప్రభుత్వ నిబంధనలను పాటించని వారిపై చర్యలు తప్పవు. ఎవరైనా ఇంటి అవసరాలకు ఇసుక అవసరం ఉంటే అనుమతి తీసుకోవాలి. ఎలాంటి అనుమతి లేకుండ తరలిస్తే వాహనాలను సీజ్ చేస్తాం.
అక్రమంగా ఇసుక, మట్టి తరలింపు
గర్మిళ్ల, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలోని గోదావరి నదిలో ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు నేతృత్వంలో ఇసుక, మట్టిని తరలించి దండుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. శనివారం గోదావరి నదిని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక, మట్టి తరలుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గోదావరిలో ఇసుక, మట్టి తీయడం వల్ల వర్షాకాలంలో గోదావరి నీరు వచ్చిన తర్వాత ప్రజలకు ఈ అక్రమ తవ్వకాల వల్ల ప్రాణాపాయం పొంచి ఉందన్నారు. మంచిర్యాల గోదావరిలో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు నడిపెల్లి విజిత్‌కుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.