Share News

Sigachi Fire Accident: ఆ 11 మంది ఏమయ్యారు..?

ABN , Publish Date - Jul 05 , 2025 | 03:42 AM

పాశమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో ప్రమాదం జరిగి ఐదు రోజులు గడుస్తున్నా, శిథిలాల తొలగింపు దాదాపు పూర్తయినా ఇంకా 11 మంది కార్మికులు, సిబ్బంది ఆచూకీ దొరకలేదు.

Sigachi Fire Accident: ఆ 11 మంది ఏమయ్యారు..?
Sigachi Fire Accident

సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగి ఐదు రోజులైనా దొరకని ఆచూకీ

  • డీఎన్‌ఏ పరీక్షల్లోనూ తేలని ఆనవాళ్లు

  • వారి కుటుంబాలకు ఏం చెబుదాం?

  • తర్జనభర్జనలో అధికారులు.. పరిశ్రమలో మరోసారి అణువణువూ గాలింపు

  • చికిత్సపొందుతున్న వారిలో మరొకరు మృతి

  • 39కి చేరిన మృతుల సంఖ్య.. మరో నలుగురికి సీరియస్‌

సంగారెడ్డి ప్రతినిధి, పటాన్‌చెరు, పటాన్‌చెరు రూరల్‌, ఆంధ్రజ్యోతి, జూలై 4: పాశమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో ప్రమాదం జరిగి ఐదు రోజులు గడుస్తున్నా, శిథిలాల తొలగింపు దాదాపు పూర్తయినా ఇంకా 11 మంది కార్మికులు, సిబ్బంది ఆచూకీ దొరకలేదు. నిజానికి ప్రమాద స్థలంలో దొరికిన మృతదేహాల్లో చాలా మందికి సంబంధించి ఏవో కొన్ని చిన్న చిన్న భాగాలే దొరికాయి. ఒడిశాకు చెందిన మహాపాత్రో అనే కార్మికుడికి సంబంధించి అర చెయ్యితోపాటు మరో రెండు చిన్న భాగాలే లభించాయి. ఈ నేపథ్యంలో ఆచూకీ దొరకని 11 మంది పూర్తిగా కాలిబూడిదయ్యారా? ఇతర మృతదేహాల భాగాల్లో వీరి భాగాలు కలిసిపోయి ఉంటాయా అన్నది తేలడం లేదు. బాధిత కుటుంబాలకు ఏం చెప్పాలనే దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ప్రకటన చేద్దామని భావిస్తున్నట్టు తెలిసింది.

8.jpg


మరోసారి అణువణువూ గాలింపు

ఆచూకీ తెలియకుండా పోయినవారు ప్రమాద సమయంలో ఏదైనా మూలకు వెళ్లి దాక్కునే ప్రయత్నం చేసి ఉండొచ్చని, వారికి సంబంధించి అవశేషాలు ఏమైనా లభించవచ్చనే ఉద్దేశంతో సహాయక బృందాలు ఫ్యాక్టరీలోని అన్ని విభాగాల్లో అణువణువూ గాలింపు చేపట్టాయి. సందేహంగా ఉన్న బూడిద, ఇతర అవశేషాలను సేకరిస్తున్నాయి. కాగా, సిగాచి పరిశ్రమలో సీనియర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న ఇస్నాపూర్‌కు చెందిన సిల్వేరు రవి (36) కూడా గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన రోజున ఆయన విధులుకు హాజరైనట్టు రికార్డుల్లో ఉంది. కానీ ఇప్పటివరకు ఆచూకీ దొరకలేదు.


క్షతగాత్రుల్లో ఒకరు మృతి..

ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మహారాష్ట్ర కార్మికుడు భీంరావు శుక్రవారం చనిపోయారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మొత్తంగా మృతుల సంఖ్య 39కి చేరింది. వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకు 12 మంది డిశ్చార్జికాగా, మరో 21 మంది ఆస్పత్రుల్లో ఉన్నారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 15 మృతదేహాల డీఎన్‌ఏ విశ్లేషణ పూర్తవడంతో కుటుంబ సభ్యులకు అప్పగించారు. శిథిలాల్లో దొరికిన ఈ మృతదేహాల భాగాలను ప్లాస్టిక్‌ కవర్లలో చుట్టి. కార్టన్‌ డబ్బాల్లో పెట్టి తరలిస్తున్నారు. చాలావరకు స్థానికంగా శ్మశాన వాటికల్లోనే దహనం చేస్తుండగా.. మరికొందరు స్వరాష్ట్రాలకు తీసుకెళ్తున్నారు.


ప్రభుత్వం అండగా ఉంటుంది: సీఎస్‌

సిగాచి ప్రమాదంలో మృతి చెందిన, గాయపడిన కార్మికుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు భరోసా ఇచ్చారు. సీఎస్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ శుక్రవారం పరిశ్రమను సందర్శించింది. ప్రమాదానికి కారణాలు, భద్రతా ప్రమాణాలు, ఇతర అంశాలపై సమీక్షించింది. బాధిత కుటుంబాలను పరామర్శించింది. త్వరలోనే ఆర్థిక సాయం అందేలా చర్యలు చేపడతామని ఈ సందర్భంగా సీఎస్‌ పేర్కొన్నారు.


ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు.. ఒకే అంబులెన్సులో..

సిగాచి ప్రమాదంలో బిహార్‌లోని రోథాస్‌ జిల్లా అవుర్ధా గ్రామానికి చెందిన ముగ్గురు కార్మికులు దిలీ్‌పకుమార్‌, దీపక్‌కుమార్‌, నాగపాశ్వాన్‌ మృతిచెందారు. డీఎన్‌ఏ విశ్లేషణతో వారి మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక చికిత్స పొందుతూ మృతి చెందిన భీంరావు మృతదేహాన్ని ఆయన భార్య సోని, బంధువులు కలసి స్వగ్రామం మహారాష్ట్రలోని దెగ్లూర్‌ తాలూకా మనుర్‌కు తరలించారు. ఒడిశాకు చెందిన ప్రశాంత్‌ మహాపాత్రోకు సంబంధించి మూడు భాగాలను డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా గుర్తించి.. ఆయన భార్య సోనాలికి అప్పగించారు. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు అధికారులు ఇస్నాపూర్‌లోనే అంత్యక్రియలు నిర్వహించారు.


ఇవి కూడా చదవండి

స్టాక్ మార్కెట్‌లో భారీ కుంభకోణం..జేన్ స్ట్రీట్‌పై సెబీ చర్యలు

రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 05 , 2025 | 10:02 AM