ChatGPT: చాట్‌జీపీటీలో రోజుకు 2.5 బిలియన్ల ప్రాంప్ట్‌లు.. షాకింగ్ రిపోర్ట్..
ABN , Publish Date - Jul 22 , 2025 | 01:19 PM
చాట్‌జీపీటీ ఏఐ వచ్చిన తర్వాత క్రమంగా ట్రెండ్ మారుతోంది. అనేక మంది గూగుల్ వాడకానికి బదులుగా జీపీటీని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆక్సియోస్ డేటా తెలిపింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో చాట్‌జీపీటీ (ChatGPT) ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే దీనిని తెగ వాడేస్తున్నారు. ఆక్సియోస్ సేకరించిన డేటా ప్రకారం, ఓపెన్‌ఏఐ నిర్వహిస్తున్న ఈ చాట్బాట్లో రోజుకు 250 కోట్లకు పైగా ప్రాంప్ట్‌లు వస్తున్నాయి. ఈ సంఖ్యలో అమెరికా నుంచి వచ్చేవి 33 కోట్ల ప్రాంప్ట్‌లు ఉన్నాయని తెలిసింది. ఈ క్రమంలో సంవత్సరానికి దాదాపు 91,200 కోట్ల అభ్యర్థనలను చాట్‌జీపీటీ నిర్వహిస్తోంది. ఇది ఆన్‌లైన్ కార్యకలాపాల్లో దీని ప్రాముఖ్యతను మరోసారి స్పష్టం చేసింది.
వినియోగదారుల సంఖ్యలో భారీ పెరుగుదల
గూగుల్ సంవత్సరానికి 500 లక్షల కోట్ల సెర్చ్‌లను నిర్వహిస్తున్నప్పటికీ, చాట్‌జీపీటీ వేగవంతమైన వృద్ధి భవిష్యత్తులో ఇది గూగుల్‌కు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉందని సూచిస్తోంది. 2023 డిసెంబర్‌లో, ఓపెన్‌ఏఐ వారానికి 30 కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకుంది. కేవలం మూడు నెలల్లోనే ఈ సంఖ్య 50 కోట్లకు చేరుకుంది. వీరిలో ఎక్కువ మంది చాట్‌జీపీటీ ఉచిత వెర్షన్‌ను ఉపయోగిస్తున్నారు.
ఓపెన్‌ఏఐ కొత్త ప్రాజెక్టులు
ఈ క్రమంలో అనేక మంది సమాచారం కోసం గూగుల్‌ను ఆశ్రయించడానికి బదులు, చాట్‌జీపీటీ వంటి AI సాధనాలను ఎంచుకుంటున్నారు. ఈ మార్పు ఇంటర్నెట్ వినియోగంలో కొత్త ట్రెండ్‌ని తీసుకొస్తుంది. ఓపెన్‌ఏఐ కేవలం చాట్‌బాట్‌లకే పరిమితం కాదు. ఈ నెల ప్రారంభంలో, రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఓపెన్‌ఏఐ గూగుల్ క్రోమ్‌కు పోటీగా AI ఆధారిత వెబ్ బ్రౌజర్‌ను అభివృద్ధి చేస్తోంది. అంతేకాదు, వినియోగదారుల కంప్యూటర్‌లో పనులు చేయగలిగే చాట్‌జీపీటీ ఏజెంట్ అనే సాధనాన్ని కూడా విడుదల చేసింది. ఈ కొత్త ఆవిష్కరణలు AI టెక్నాలజీని మరింత సులభతరం చేసే దిశగా ఓపెన్‌ఏఐ లక్ష్యాలను తెలియజేస్తున్నాయి.
శామ్ ఆల్ట్‌మన్ దార్శనికత
ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఈ వారం వాషింగ్టన్‌ను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో AIని అందరికీ అందుబాటులో ఉంచాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆల్ట్‌మన్ ఫెడరల్ రిజర్వ్ కాన్ఫరెన్స్‌లో AI ఉద్యోగాలపై చూపే ప్రభావం గురించి చర్చించనున్నారు. ఇటీవలి ఒక ఎస్సేలో ఆల్ట్‌మన్ AI ఇండస్ట్రీని ప్రపంచానికి ఒక మెదడును నిర్మిస్తోందిని వర్ణించారు. చాలా తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే ఇంటెలిజెన్స్ ఇప్పుడు సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.
ఏఐ భవిష్యత్తు
చాట్‌జీపీటీ వేగవంతమైన వృద్ధి, ఓపెన్‌ఏఐ కొత్త ప్రాజెక్టులు AI టెక్నాలజీ భవిష్యత్తు ఎలా ఉంటుందో సూచిస్తున్నాయి. సమాచార శోధన నుంచి రోజువారీ పనుల వరకు, AI జీవితంలో అనేక రంగాలను మార్చివేస్తోంది. అయితే, ఈ టెక్నాలజీ అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలని, దాని లాభాలు కొందరికే పరిమితం కాకూడదని ఆల్ట్‌మన్ చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
అలర్ట్.. పరీక్షల విషయంలో కొత్త రూల్స్ జారీ..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి