Share News

Artificial Intelligence: వ్యవసాయ రంగంలో ఏఐ వినియోగం.. సత్య నాదెళ్ల వీడియో వైరల్

ABN , Publish Date - Feb 24 , 2025 | 06:11 PM

ఇప్పటికే విద్య, వైద్యం వంటి పలు రంగాల్లో దూసుకెళ్తున్న ఏఐ, ఇప్పుడు వ్యవసాయ రంగంలో కూడా అద్భుత ఫలితాలను ఇస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్వయంగా ఓ వీడియో పోస్ట్ చేసి ప్రకటించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

 Artificial Intelligence: వ్యవసాయ రంగంలో ఏఐ వినియోగం.. సత్య నాదెళ్ల వీడియో వైరల్
Satya Nadella

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల(Satya Nadella), కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) వ్యవసాయ రంగంలో కూడా కీలకమైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. AI పరిజ్ఞానం ద్వారా మహారాష్ట్రలోని బారామతి ప్రాంతంలో రైతులు తమ పంట దిగుబడిని పెంచుకోవడంలో సానుకూల ఫలితాలు వచ్చాయన్నారు. ఈ క్రమంలో సోమవారం తన X హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా పోస్ట్ చేసి పంచుకున్నారు. షేర్ చేసిన వీడియోలో AI ద్వారా వ్యవసాయ రంగంలో వచ్చే సాంకేతిక పరిణామాలు, రైతులకు అందించే ప్రయోజనాల గురించి ఆయన వివరించారు.


రైతుల పంట ఉత్పత్తి పెంచుకోవడం

మహారాష్ట్రలోని బారామతి ప్రాంతంలో రైతులు ఈ సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా వారు తమ పంటల దిగుబడిని పెంచుకున్నారని సత్య నాదెళ్ల తెలిపారు. డ్రోన్లు, ఉపగ్రహాల నుంచి పొందిన జియోస్పేషియల్ డేటాను ఉపయోగించి, రైతులకు తమ భూమి పరిస్థితి గురించి తెలుసుకోవడం ద్వారా వారికి మరింత మేలు జరిగిందన్నారు. ఈ సాంకేతికత రైతుల భాషలో ఉండటం ద్వారా వారి పనులను మరింత సులభతరం చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.

దీనిని "సెన్సార్ ఫ్యూజన్" అంటారు. ఇది డ్రోన్లు, ఉపగ్రహాలు, నేల నుంచి సేకరించబడే జియోస్పేషియల్ డేటాను ఉపయోగించి వ్యవసాయ రంగంలో సమస్యలకు పలు రకాల మార్గాలను సూచిస్తుంది. ఈ సమాచారాన్ని AI విశ్లేషించి, రైతులకు ప్రత్యక్షంగా వారి సొంత భాషలో వివరించగలుగుతుంది.


రసాయనాలు తగ్గించడం, నీటి వినియోగం

ఈ క్రమంలో ఏఐ వినియోగం వల్ల పంటలకు రసాయనాల వినియోగాన్ని కూడా తగ్గించుకోవచ్చన్నారు సత్య నాదెళ్ల. దీంతోపాటు రైతులు వారి పొలాల గురించి తెలుసుకుని, తక్కువ నీటితో పంటలను పండించుకోవచ్చన్నారు. ఇలా చేయడం ద్వారా వారి పొలాల్లో నీటి ఉత్పత్తిని మెరుగుపరుచుకుని, అధిక దిగుబడిని సాధించవచ్చని సత్య నాదెళ్ల చెప్పారు. నాదెళ్ల ఈ వీడియోలో వ్యవసాయంపై AI ప్రభావం చాలా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. AI ఆధారిత వ్యవసాయ కార్యక్రమాలు రైతుల ప్రయోజనాన్ని నిరూపించాయన్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయానికి ఏఐ ఎంతో భవిష్యత్తునిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఎలాన్ మస్క్ స్పందన

ఈ వీడియోపై ప్రముఖ టెక్ బిలియనీర్, ఎలాన్ మస్క్ స్పందించారు. తన X హ్యాండిల్ ద్వారా ఈ వీడియోని పంచుకుని, "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతిదీ పరిష్కరిస్తుంది" అని వ్యాఖ్యానించారు. AI వ్యవసాయ రంగంలో ఎంతో గొప్ప పరిణామాలను తీసుకువస్తున్నందుకు మస్క్ అభినందనలు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి:

Apple iPhone: మార్కెట్లోకి కొత్త ఐఫోన్ మోడల్.. ఈనెల 28 నుంచి సేల్, 10 వేలు తగ్గింపు ఆఫర్


OpenAI: ఓపెన్ ఏఐ నుంచి కొత్తగా ఏఐ ఏజెంట్.. దీని స్పెషల్ ఏంటంటే..


Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 24 , 2025 | 06:14 PM