Shreyas Iyer: అయ్యర్ కోసం సూర్యకుమార్ తల్లి పూజలు
ABN , Publish Date - Oct 29 , 2025 | 07:08 PM
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తల్లి స్వప్న యాదవ్ శ్రేయస్ ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేసింది. సూర్య సోదరి దీనాల్ యాదవ్ షేర్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) ఆసీస్‌తో మూడో వన్డేలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న అతడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. త్వరలోనే శ్రేయస్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్(Suryakumar Yadav) యాదవ్ సోదరి దీనాల్ యాదవ్ షేర్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయ్యర్ కోసం అమ్మ పూజలు..
సూర్య కుమార్ యాదవ్ తల్లి స్వప్న యాదవ్(Swapna Yadav) శ్రేయస్ ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేసింది. ‘శ్రేయస్ ఆరోగ్యం బాగా లేదని తెలిసి నా మనసు ఆందోళనకు గురైంది. అతడు త్వరగా కోలుకుని ఇంటికి తిరిగి రావాలని అందరూ దయచేసి ప్రార్థన చేయండి. అతడు క్షేమంగా ఉండాలని మొక్కుకోండి’ అంటూ ఛట్ పూజలో స్వప్న యాదవ్ అందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘ఇది అమ్మ ప్రేమ..’, ‘శ్రేయస్ పట్ల మీ ఆప్యాయత మిమ్మల్ని కదిలించింది..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
అయ్యర్ అదృష్టవంతుడు!
శ్రేయస్ అయ్యర్ సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో క్యాచ్ పట్టుకునే క్రమంలో గాయపడ్డాడు. అతడి పక్కటెముకలు నేలను బలంగా తాకడంతో ప్లీహానికి తీవ్ర గాయమైంది. అంతర్గత రక్తస్రావం కారణంగా ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. దీనిపై కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా స్పందించాడు. ‘దేవుడు అయ్యర్ పక్షాన ఉన్నాడు. గాయం పెద్దదే అయినా త్వరగా కోలుకుంటున్నాడు. సిడ్నీ డాక్టర్లు, బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. త్వరలోనే అతడు పూర్తిగా కోలుకుంటాడు’ అని అన్నాడు.
Also Read:
రింకూ సింగ్-ప్రియ సరోజ్ లవ్ స్టోరీ రివీల్
సూర్య బ్యాట్‌తోనే సమాధానం ఇస్తాడు: అభిషేక్ నాయర్