Shikhar Dhawan: ఆ ఒక్క రోజు నేనలా చేయకపోయుంటే!.. గబ్బర్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 15 , 2025 | 12:21 PM
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తన ఆత్మకథ ‘ది వన్: క్రికెట్, మై లైఫ్ అండ్ మోర్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా తన క్రికెట్ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మాజీ ప్లేయర్ శిఖర్ ధావన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జట్టులో ఎన్నో కీలక ఇన్నింగ్స్ ఆడి.. ‘గబ్బర్’గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా తన ఆత్మకథ ‘ది వన్: క్రికెట్, మై లైఫ్ అండ్ మోర్’ పుస్తకాన్ని ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా తన(Shikhar Dhawan) క్రికెట్ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
తన క్రికెట్ కెరీర్‌నే మలుపు తిప్పిన ఓ సంఘటన గురించి ధావన్ తన పుస్తకంలో రాసుకున్నట్లు వెల్లడించాడు. ఆస్ట్రేలియా పర్యటన సమయంలో బ్రిటిష్ యువతి ఎలెన్‌తో కలిసి హోటల్లో చేతులు పట్టుకుని నడిచిన ఘటన అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని వెల్లడించాడు.
‘అప్పుడు నేను చాలా చిన్నవాడిని. ఆ అమ్మాయి నాకు ఎయిర్‌పోర్టులో పరిచయం.. ఆ స్నేహం కాస్తా నాతో పాటు టూర్‌కు తీసుకొచ్చే వరకు వచ్చింది. దాని వల్ల నేను ఎన్నో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సంఘటన తర్వాత నా ప్రదర్శన చాలా పడిపోయింది. కెరీర్ కూడా రెండు సంవత్సరాలు వెనక్కి వెళ్లింది. ఇది ఎవ్వరినీ నిందించడానికి చెప్తుంది కాదు. యువ ఆటగాళ్లు ఈ విషయం తెలుసుకుని కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే నాకు అంతే చాలు’ అని ధావన్ వివరించాడు.
అతడి పరుగుల దాహం తీరనిది..
ఈ సందర్భంగా గబ్బర్.. కోహ్లీతో తనకున్న అనుభవాలను పంచుకున్నాడు. ‘కోహ్లీ పరుగుల దాహం తీరనిది. ఇలానే ఫామ్ కొనసాగిస్తే.. దేవుడి దయతో 100 సెంచరీలు కూడా సాధిస్తాడు. అతడిలో ఫిట్నెస్, క్రమశిక్షణ ఉన్నాయి’ అని అన్నాడు. ఢిల్లీ జట్టు రోజుల స్నేహాన్ని గుర్తు చేస్తూ కోహ్లీపై ధావన్ ప్రశంసలు కురిపించాడు.
రిటైర్మెంట్ తర్వాత..
గతేడాది ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధావన్.. ఇప్పుడు కొత్త పాత్రలో దూసుకుపోతున్నాడు. ఫుల్‌టైమ్ కంటెంట్ క్రియేటర్‌గా మారిన అతడి రీల్స్‌కు 20 నుంచి 50 మిలియన్ వ్యూస్ వస్తుండటం విశేషం. ‘ప్యాషన్‌తోనే రీల్స్ చేస్తున్నా. ప్రకృతి ఏ అవకాశాలను తీసుకొస్తుందో చూద్దాం’ అంటూ చిరునవ్వుతో చెప్పుకొచ్చాడు గబ్బర్.
ఇవి కూడా చదవండి:
నేను ఫామ్ కోల్పోలేదు: భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్య.. తొలి భారత ప్లేయర్‌గా!