Shane Watson: కోల్‌కతా నైట్ రైడర్స్ కోచింగ్ బృందంలోకి షేన్ వాట్సన్
ABN , Publish Date - Nov 13 , 2025 | 05:29 PM
కోల్‌కతా నైట్ రైడర్స్ తమ కోచింగ్ బృందంలో కీలక మార్పు చేసింది. ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ షేన్ వాట్సన్‌ను తమ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా నియమించుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ తమ కోచింగ్ బృందంలో ఓ కీలక మార్పు చేసింది. ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌ను కేకేఆర్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈ నియామకం గురించి గురువారం (నవంబర్13) కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల ప్రధాన కోచ్‌గా నియమితులైన భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో షేన్ వాట్సన్ కలిసి పని చేస్తారు.
ఈ ఆసీస్ దిగ్గజ ప్లేయర్ షేన్ వాట్సన్(Shane Watson) గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు (Delhi Capitals) అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. తిరిగి మూడేళ్ల తర్వాత అతడు మళ్లీ సహాయక కోచ్ పదవి చేపట్టాడు. అయితే ఈ సారి జట్టు మారింది. ఇటీవలే అభిషేక్ నాయర్.. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు (Kolkata Knight Riders) చంద్రకాంత్ పండిత్ స్థానంలో హెడ్ కోచ్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. ప్రస్తుతం వాట్సన్, అభిషేక్ నాయర్ కలిసి కేకేఆర్ కు మరో టైటిల్ అందించేందుకు గట్టిగా కృషి చేయనున్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ సీఈఓ వెంకీ మైసూర్ మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ 2026లో కేకేఆర్ జట్టును మరింత బలోపేతం చేయడం కోసం షేన్ వాట్సన్ కోచింగ్ బృందంలో చేరనున్నాడు. ఆయన కేకేఆర్ కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అద్భుతమైన ఆటగాడిగా, కోచ్‌గా అతడి అనుభవం కోల్‌కత్తా జట్టుకు ఎంతో ఉపయోగకరం. టీ20 ఫార్మాట్‌పై అతడికి అపారమైన అనుభవం ఉంది. వాట్సన్ సహాయ, సహకారాల కోసం మేం ఎదురు చూస్తున్నాం’ అని తెలిపాడు.
ఇక తనను కేకేఆర్ జట్టుకు అసిస్టెంట్ కోచ్ గా నియమించడంపై వాట్సన్(Shane Watson) స్పందించారు. ‘కోల్‌కతా నైట్ రైడర్స్‌లాంటి ఐకానిక్ ఫ్రాంచైజీలో భాగం కావడం గొప్ప గౌరవం. ఆ జట్టుకు మరో ఐపీఎల్ టైటిల్‌ను అందించడానికి.. కోచింగ్ గ్రూప్, ప్లేయర్లతో కలిసి పనిచేయడానికి నేను ఆసక్తిగా ఉన్నాను’ అని అన్నాడు. 2007, 2015లో వన్డే వరల్డ్ కప్‌లు గెలిచిన ఆస్ట్రేలియా(Australia) జట్టులో షేన్‌వాట్సన్ సభ్యుడిగా ఉన్నాడు. అతడు ఐపీఎల్‌లో 145 మ్యాచ్‌లు ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో నాలుగు సెంచరీలు సాధించాడు.
ఇవి కూడా చదవండి:
భద్రతా సమస్యలు.. పాక్ నుంచి తిరిగెళ్లిపోనున్న శ్రీలంక క్రికెటర్లు
మరో రికార్డుపై కన్నేసిన కేఎల్ రాహుల్..!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి