Pak-Sri One day Series: పాక్‌ను వీడొద్దంటూ శ్రీలంక క్రికెటర్లకు బోర్డు హెచ్చరిక
ABN , Publish Date - Nov 13 , 2025 | 04:20 PM
పాక్ టూర్‌ను కొనసాగించాలని తమ ప్లేయర్లకు శ్రీలంక క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. తమ సూచనలను కాదని తిరిగొచ్చే వారిపై క్రమశిక్షణ చర్యలు కూడా తప్పవని స్పష్టం చేసింది. ఇస్లామాబాద్ ఆత్మాహుతి దాడి నేపథ్యంలో శ్రీలంక బోర్డు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే టోర్నీ కోసం శ్రీలంక టీమ్ ప్రస్తుతం పాక్‌లో పర్యటిస్తోంది. అయితే, ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి నేపథ్యంలో ఆందోళన చెందిన శ్రీలంక క్రికెటర్లు కొందరు తమ దేశానికి వెళ్లిపోయేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. కానీ, వారి అభ్యర్థనకు శ్రీలంక క్రికెట్ బోర్డు అంగీకరించలేదు. తమ ఆదేశాలను ఖాతరు చేయకుండా తిరిగొచ్చే ప్లేయర్లపై దర్యాప్తు ప్రారంభిస్తామని కూడా హెచ్చరించింది.
ప్రస్తుతం శ్రీలంక ప్లేయర్లు అందరూ ఇస్లామాబాద్‌లోనే ఉన్నారు. ఆత్మాహుతి దాడి నేపథ్యంలో సుమారు ఎనిమిది మంది ప్లేయర్లు సొంత దేశానికి తిరిగెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. వారి స్థానంలో కొత్త వారిని పాక్‌కు పంపించేందుకు కూడా శ్రీలంక క్రికెట్ బోర్డు సిద్ధమైనట్టు తెలిసింది. ఇంతలోనే పరిస్థితి తలకిందులైంది. తమ ప్లేయర్లు ఎవరూ తిరిగి రావట్లేదని శ్రీలంక బోర్డు తాజాగా ప్రకటన విడుదల చేసింది.
‘పాక్‌లోని కొందరు ప్లేయర్లు భద్రతా కారణాల రీత్యా తిరిగొచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్టు టీమ్ మేనేజ్‌మెంట్ మాకు తెలిపింది. అయితే, మేము వెంటనే ప్లేయర్లతో సంప్రదింపులు జరిపాము. పీసీబీతో కలిసి వారి భద్రతకు కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చాము’ అని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది. పాక్ టూర్‌ను కొనసాగించాలని ప్లేయర్లకు, సపోర్టు స్టాఫ్‌కు తాము సూచించినట్టు పేర్కొంది. ఈ సూచనలను కాదని వెనక్కు వచ్చే వారి చర్యలను సమీక్షించి తగు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.
శ్రీలంక మనసు మార్చిన నఖ్వీ
శ్రీలంక క్రికెటర్లకు అధ్యక్షుడి స్థాయి భద్రతను కల్పిస్తామని పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్, దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహిసీన్ నఖ్వీ హామీ ఇవ్వడంతో శ్రీలంక బోర్డు వెనక్కు తగ్గినట్టు తెలిసింది. వారి భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని నఖ్వీ హామీ ఇచ్చారట. ఇక ఈ టోర్నీ తొలి వన్డేలో శ్రీలంక టీమ్ ఓటమిని చవి చూసింది. రెండవ వన్డే రేపు రావల్పిండి క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి:
భద్రతా సమస్యలు.. పాక్ నుంచి తిరిగెళ్లిపోనున్న శ్రీలంక క్రికెటర్లు
మరో రికార్డుపై కన్నేసిన కేఎల్ రాహుల్..!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి