CII Summit 2025: సీఐఐ సమ్మిట్.. ఇవాళ ఒక్కరోజే ఎన్ని ఒప్పందాలంటే..
ABN , Publish Date - Nov 13 , 2025 | 05:00 PM
ఈనెల 14, 15 తేదీల్లో విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ వేదికగా సీఐఐ సదస్సు జరగనుంది. అయితే, ఈ సదస్సు ప్రారంభం కావడానికి ముందే ఏపీ సర్కార్ రికార్డుల మోత మోగిస్తోంది.
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు, యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు సీఐఐతో కలిసి 30వ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు-2025ను కూటమి ప్రభుత్వం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈనెల 14, 15 తేదీల్లో విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ వేదికగా ఈ సదస్సు జరగనుంది. అయితే, ఈ సదస్సు ప్రారంభం కావడానికి ముందే ఏపీ సర్కార్ రికార్డుల మోత మోగిస్తోంది. విశాఖపట్నాన్ని ‘గ్లోబల్ ట్రేడ్ గేట్‌వే’గా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అనే నినాదంతో చేపట్టిన కార్యక్రమం ప్రారంభానికి ముందే లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి తరలివస్తున్నాయి.
సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఒక్క రోజు ముందుగానే 35 సంస్థలతో చంద్రబాబు సర్కార్ ఎంవోయూలు కుదుర్చుకుంటోంది. మొత్తం రూ.3.65 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు చకాచకా జరిగిపోతున్నాయి. వీటి ద్వారా ఏకంగా 1.26 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. ఇవాళ(గురువారం) ఉదయం నుంచి ఇప్పటివరకూ 6 సంస్థలతో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎంవోయూలు జరిగాయి.
రెన్యూ పవర్ రూ.60 వేల కోట్లు, eJoule రూ.19,000 కోట్లు, తైవాన్ ప్రైవేట్ ఇండస్ట్రీయల్ పార్క్ రూ.1,200 కోట్లు, కోరమాండల్ రూ.2,000 కోట్లు, హీరో ఫ్యూచర్ ఎనర్జీ రూ.15,000 కోట్లు, JOOL రూ.1,500 కోట్లు పెట్టుబడులపై ఇప్పటివరకూ ఒప్పందాలు జరిగాయి. మరో 29 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం నేడు ఒప్పందాలు చేసుకోనుంది. ఏపీ సీఆర్డీఏ 8 ఎంవోయూలు, ఇంధన రంగంలో 5, ఫుడ్ ప్రాసెసింగ్ 4, ఐ అండ్ ఐ 3, ఇండస్ట్రీస్‌లో 9 ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటోంది. కాగా, రెన్యూ పవర్ ఈ ఏడాది మేలోనే రూ.22 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. దీంతో ఈ ఒక్క సంస్థ పెట్టుబడులే రూ.82 వేల కోట్లకు చేరాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
YS Viveka Case: వివేకా హత్య కేసులో లోతైన విచారణ జరగాలి: సునీత తరఫు న్యాయవాది
Stree Shakti Scheme Funds: గుడ్ న్యూస్.. వారి కోసం నిధులు విడుదల చేసిన కూటమి సర్కార్..