Pant: దేవుడికి నా మీద దయ ఎక్కువ: పంత్
ABN , Publish Date - Nov 13 , 2025 | 01:45 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ నాలుగు నెలల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. గాయం నుంచి కోలుకున్న పంత్, దేవుడి దయతో మళ్లీ జట్టులోకి రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: నవంబర్ 18 నుంచి టీమిండియా- సౌతాఫ్రికా జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుండగా.. రెండో మ్యాచ్‌కు గువాహటి వేదికగా కానుంది. అయితే దాదాపు నాలుగు నెలల విరామం తర్వాతం టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేస్తున్నాడు.
నాలుగు నెలల తర్వాత..
ఇంగ్లండ్ సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో పంత్(Rishabh Pant) కాలికి గాయమైన విషయం తెలిసిందే. ఎముక విరగడంతో అతడు నాలుగు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకుని ఇటీవలే బెంగళూరు వేదికగా సౌతాఫ్రికా ఏ జట్టుతో భారత్ ఏ జట్టు అనధికారిక టెస్టు మ్యాచ్ ద్వారా పంత్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో పంత్ మాట్లాడిన వీడియోను బీసీసీఐ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
‘గాయం తర్వాత జట్టులోకి పునరాగమనం చేయడం అంత తేలికైన విషయం కాదు. కానీ దేవుడు చాలా దయగలవాడు. ఆయన నన్ను చాలాసార్లు ఆశీర్వదించాడు. అలాగే ఈ సారి కూడా దేవుడు నన్ను కరుణించాడు. జట్టులోకి తిరిగి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. గాయం నుంచి కోలుకునే సమయంలో నా తల్లిదండ్రులు, కుటుంబం, అందరూ నాకు మద్దతుగా నిలిచారు. నేను నా నియంత్రణలో ఉన్న విషయాల మీదే దృష్టి పెట్టగలను. అదృష్టం అనేది మన చేతుల్లో ఉండదు. కాబట్టి నేను దాని గురించి ఆలోచించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను. మనకు నచ్చే పనులనే చేస్తూ ఉండాలి. ఏ పని చేసినా ఆస్వాదిస్తూ చేయాలి. దాని కోసం వంద శాతం ఎఫర్ట్స్ పెట్టాలి’ అని పంత్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి
అలా బతకడం చాలా కష్టం: సానియా మీర్జా
మరో రికార్డుపై కన్నేసిన కేఎల్ రాహుల్..!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి